Akash Deep : ఒక్కటే మ్యాచ్.. 10 వికెట్లు! ఆకాష్ దీప్ సునామీ..


Akash Deep : ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. బుమ్రా లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు ఎలా ఆడుతుందో అనే అనుమానాల మధ్య, అంచనాలను తలకిందులు చేస్తూ 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఇది విదేశాల్లో భారత్ సాధించిన అతిపెద్ద టెస్ట్ విజయం. ముఖ్యంగా కెప్టెన్ శుభమన్ గిల్ అసాధారణ ఫామ్‌లో కనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 269, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు సాధించి ఈ మ్యాచ్‌లో మొత్తం 430 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587, రెండో ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

ఈ మ్యాచ్‌లో అసలైన హీరో మరెవరో కాదు… ఆకాష్ దీప్. భారత్ చేసిన భారీ స్కోర్లను చేధించేందుకు ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రయత్నించినప్పటికీ, వారికి అడ్డుకట్ట వేసినవాడు ఆకాష్ దీపే. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. దీంతో బర్మింగ్‌హామ్‌లో ఒకే టెస్టులో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఆయన 187 పరుగులకు 10 వికెట్లు తీసి, 1986లో చేతన్ శర్మ నెలకొల్పిన 188 పరుగులకు 10 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా రెండు కీలక ఘనతలను సాధించింది — ఎడ్జ్ బస్టన్ మైదానంలో తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలవడం, అలాగే విదేశాల్లో అత్యధిక తేడాతో విజయం సాధించడం. ఆకాష్ దీప్ 39 ఏళ్ల రికార్డు చెరిపేశాడు. జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ లాంటి దిగ్గజ బౌలర్లూ సాధించలేని ఫీట్‌ను అందుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా తలచుకున్న లక్ష్యానికి మరో అడుగు దగ్గరైంది, ఇక ఆకాష్ దీప్ భారత బౌలింగ్ దళంలో కొత్త ఆశాజ్యోతిగా నిలిచాడు.