10 రోజుల భారత్ పర్యటన.. మరపురాని అనుభవమన్న కార్ల్ స్వాన్‌బర్గ్

Svanberg
స్వీడన్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కార్ల్ స్వాన్‌బర్గ్ ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) మరియు స్వీడన్‌లోని భారత రాయబార కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ‘ఫ్యామిలరైజేషన్ విజిట్’లో పాల్గొన్నారు. తన భార్య ఎకటెరినా స్వాన్‌బర్గ్‌తో కలిసి స్వీడన్ నుంచి ఎంపికైన ప్రతినిధుల్లో ఒకరిగా ఈ 10 రోజుల పర్యటనలో పాల్గొన్న ఆయన, న్యూఢిల్లీ, ఆగ్రాలోని తాజ్ మహల్, రాష్ట్రపతి భవన్, హుమాయూన్ సమాధి, ఇండియా గేట్, హంపి, విరూపాక్ష ఆలయం, అంజనాద్రి కొండ, బెంగళూరులోని లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్, విధాన సౌధ వంటి భారతదేశంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.

ఈ పర్యటన తన జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందని కార్ల్ స్వాన్‌బర్గ్ పేర్కొన్నారు. భారతీయుల ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. పర్యటన సందర్భంగా చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్థానిక ప్రజలతో తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, భారతదేశ వైవిధ్యం, పర్యాటక ఆకర్షణలు, ఆధునిక అభివృద్ధిని యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫాలోవర్లకు పరిచయం చేశారు.