Arabia Kadali : ‘అరేబియా కడలి’ ట్రైలర్ విడుదల.. తండేల్ సినిమానే గుర్తొస్తుందిగా?

Arabiakadali
Arabia Kadali : తెలుగు ప్రేక్షకుల కోసం మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’ రూపుదిద్దుకుంది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ నేడు (ఆగస్టు 1న) విడుదలైంది. ఈ ట్రైలర్‌ను చూసిన వెంటనే చాలామందికి నాగచైతన్య ‘తండేల్’ సినిమానే గుర్తుకు రావడం ఖాయం. కారణం, ఈ సిరీస్ కథ కూడా శ్రీకాకుళం జాలర్లు పాకిస్థాన్ జలాల్లో చిక్కుకుపోవడం, అక్కడి నేవీ చేతిలో అరెస్టు కావడం చుట్టూ తిరుగుతోంది. ఆపై వారి రక్షణ కోసం జరిగే సంఘటనలే కథకు మూలం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 8 నుండి ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్‌ను క్రియేట్ చేసింది ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాగా, దర్శకత్వం వహించింది ఆయన శిష్యుడు సూర్యకుమార్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో సత్యదేవ్‌తో పాటు ఆనంది, నాసర్, రఘుబాబు, దలీప్ తాహిల్ తదితరులు నటిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు గల ఈ సిరీస్ ట్రైలర్ యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ మిక్స్‌తో ఆకట్టుకుంటోంది. తండేల్‌తో పోలికలున్నప్పటికీ, ‘అరేబియా కడలి’కు ప్రత్యేకతను తీసుకురావడంలో మేకర్స్ విజయవంతమవుతారా అనే ప్రశ్నకు సమాధానం ఆగస్టు 8న తెలుస్తుంది.