
జబర్దస్త్ గురించి జబర్దస్త్ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ వేణు.. బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. కాగా, తాజాగా వేణు స్పూర్తితో ఇంకో జబర్దస్త్ నటుడు డైరెక్టర్ గా అవతారమెత్తాడు. అతడే శాంతి కుమార్. జబర్దస్త్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శాంతి కుమార్.. ఇప్పుడు డైరెక్టర్ గా తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు.
శాంతి కుమార్ తూర్లపాటి దర్శకత్వంలో సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘నాతో నేను’. ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను స్టార్ రైటర్ విజయేంద్ర వర్మ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేకాదు ‘‘టైటిల్ బావుంది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం చక్కని విజయం సాధించాలి’’ అని అన్నారు.
ఇక డైరెక్టర్ శాంతి కుమార్ మాట్లాడుతూ.. “ఓ మంచి కథ రాసి మొదట నిర్మాతల్ని వెతుక్కున్నాను. నా కథ నచ్చి వెంటనే అంగీకరించారు. నా తొలి ప్రయత్నానికి సాయికుమార్ గారు అండగా ఉన్నారు. చక్కని సలహా సూచనలు అందిస్తున్నారు. మంచి కథ రాశాను.. దానిని చక్కగా తెరపై చూపిస్తానని, ఆ దిశగా కృషి చేస్తానని చెబుతున్నాను” అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ ‘‘మంచి కథతో శాంతికుమార్ ఈ చిత్రం చేస్తున్నారు. ఇందులో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథకు మంచి మనిషి అయిన విజయేంద్ర ప్రసాద్‌గారు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.











