Telangana Election Results 2023 : తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రారంభం..


అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నెల రోజులుగా ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఓట్లను లెక్కిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను 49 ప్రాంతాల్లో ఓట్లు లెక్కించేందుకు 1,798 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేయగా 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న ఆరు నియోజకవర్గాల్లో మాత్రం 28 టేబుళ్లు ఏర్పాటు చేసారు అధికారులు.

ఇక ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారంటే.. తొలుత పోస్టల్‌ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. ఇవి పూర్తయ్యాక అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచి కంట్రోల్‌ యూనిట్లను టేబుల్‌కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు. కంట్రోల్‌ యూనిట్‌లోని ‘టోటల్‌’ బటన్‌ను నొక్కగానే ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుస్తుంది. పోలైన ఓట్ల వివరాలను 17-సి పేరిట నమోదు చేసిన రికార్డుతో, కంట్రోల్‌ యూనిట్‌లో వచ్చిన మొత్తం ఓట్లతో సరిపోయాయా? లేదా? అని పరిశీలిస్తారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఆ తరువాత ‘రిజల్ట్స్‌’ మీటను నొక్కగానే ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో కనిపిస్తాయి. ఆ వివరాలను ఇటు అధికారులతో పాటు, అటు పోలింగ్‌ ఏజెంట్లు కూడా నమోదు చేసుకుంటారు. ఇక ఏజెంట్ల నుంచి ఆమోదం లభించిన తరువాత వారి సంతకాలు తీసుకుంటారు. ఈవిధంగా 14 ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండు ముగిసినట్లు. అభ్యర్థులు, ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో 28 ఈవీఎంల లెక్కింపును ఒక రౌండుగా పరిగణిస్తారు. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక ఆ నియోజకవర్గ లెక్కింపు పరిశీలకుడు, ఏజెంట్ల సమక్షంలో ర్యాండమ్‌గా అయిదు వీవీప్యాట్స్‌ను ఎంపిక చేసి, వాటిలోని ఓటరు స్లిప్పులను లెక్కిస్తారు. ఇలా అయిదు వీవీ ప్యాట్‌లలో లెక్కించిన వివరాలకు.. అంతకుముందు ‘17-సి’లో నమోదు చేసిన ఓట్ల సంఖ్యకు సరిపోలితే అధికారులు, ఏజెంట్ల ఆమోదంతో ఫలితాన్ని ప్రకటిస్తారు.