రివ్యూ : 26/11 ఇండియా పై దాడి

వర్మ నిద్ర లేచాడు : 26/11 ఇండియా పై దాడి

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.25/5

26-11-India-Pai-Daadi-review-ratingవేటాడే పులి, పరిగెట్టించీ పరిగెట్టించీ జింక పీకని లాఘవంగా పట్టే పులి, పచ్చి నెత్తురు రుచి మరిగిన పులి… ఎండు గడ్డి తింటే ఎలా వుంటుంది? రామ్ గోపాల్ వర్మ కామెడీ కధలు చెప్పినప్పుడు, దెయ్యం కధలు చెబుతూ భయపెట్టడానికి శతవిధాలా ప్రయత్నించినప్పుడు అదే అనిపించేది. వేటాడీ వేటాడీ అలసిపోయి, మరేమీ దిక్కుతోచక, కడుపు నింపుకోవడానికి ఏదైతేనేమి? అనుకోవడం పులి లక్షణం కాదు. లక్షలాది మంది అభిమానుల దృష్టిలో రామ్ గోపాల్ వర్మ కూడా అలాంటి పులే.

అతని విజృంభన చూసి తరిద్దాం అని ఎదురు చూసిన ప్రతీసారీ నిరాశే ఎదురయ్యింది. ఎప్పుడైతే ఓ నిర్మాతగా ఆలోచించి, నాలుగు డబ్బులు వెనకేసుకోవడం పైన దృష్టి పెట్టాడో, అప్పుడే అతనిలోని సృజన నిద్రపోయింది. లాభాపేక్ష తో ఆ దర్శకుడిని వర్మలోని నిర్మాత జో కొడుతూనే వున్నాడు. అందుకే వర్మ నుంచి ‘భూత్’ లాంటి సినిమాలు చూసే దౌర్భాగ్యం దక్కింది. అయినా వర్మ అభిమాన గణం ఆశ చావలేదు. ఎప్పటికైనా మన వర్మ వస్తాడు.. అని ఎదురు చూశారు. ఆ కల ఫలించింది. ఎట్టకేలకు వర్మ లోని దర్శకుడు నిద్రలేచాడు. 26/11 తో ‘నాలో ఇంకా క్రియేటర్ బతికే వున్నాడు’ అని నిరూపించుకున్నాడు.

దేశం మరచిపోలేని దారుణం.. తాజ్ పై దాడి. సముద్ర మార్గం నుంచి వచ్చిన ఉగ్రవాదులు తాజ్ హోటల్ పై దాడి చేసి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. భారత ప్రభుత్వం, పోలీసు బలగాల నిర్లిప్తతను ఈ ఉదంతం బట్టబయలు చేసింది. వర్మ ఈ ఉదంతాన్నే కథగా చేసుకున్నాడు. అందరికీ తెలిసిన ఓ భయంకర మారణకాండని తెరపై ఆవిష్కరించాడు. ఉగ్రవాదులు భారత్ లోకి ఎలా ప్రవేశించారు? ఆ సమయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయాలేమిటి? ప్రభుత్వం ఎలా స్పందించింది? ప్రజల మనో భావాలు, మృతుల కుటుంబాల వేదన ఎలా వుంది? ప్రాణాలతో పట్టుబడిన కసబ్ ఆలోచనలు ఏమిటి? అతను మారాడా? అనేదే ఈ సినిమా కధ. కసబ్ ఉరి తో ఈ సినిమా ముగుస్తుంది.

నిజానికి ఇది సినిమా కాదు. ఓ మారణ హోమానికి డాక్యుమెంటరి. తాజ్ హోటల్ లో ఏమి జరిగిందో అక్కడ ఉగ్రవాదులు ఆడిన వికృతక్రీడ ఎలా వుందో కళ్ళకు కట్టినట్టు వివరించాడు వర్మ. దర్శకుడిగా కాదు… ఓ పాత్రికేయుడి అవతారం ఎత్తాడు. సినిమా మొత్తంగా ఉగ్రవాదులు, తాజ్ లో చిక్కుకున్న భారతీయులు, పోలీస్ వ్యవస్థ… ఈ ముగ్గురి భావోద్వేగాలను కెమెరా లో బంధించే ప్రయత్నం చేశాడు. ముష్కరుల ప్రతీ కదలికను అణువణువూ గాలించి, ‘ఇలా చేశారేమో?’ అనుకునేలా వారి ప్రవర్తనను కళ్ళకు కట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే థియేటర్ లో వున్న ప్రేక్షకులను తాజ్ హోటల్ కి తీసుకెళ్ళాడు. ఈ ప్రయత్నంలో దర్శకుడిగా తనను తానూ సంతృప్తి పరచుకుంటూ, ఈ దేశం మీద తనకున్న విధేయతను బయట పెట్టాడు. వర్మ నిజాయితీగా, మనసు పెట్టి ఓ సినిమా తీస్తే ఎలా వుంటుందో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. పాత్రధారుల ఎంపికలో ఈ మధ్య పదే పదే తప్పులు చేస్తూ విమర్శకుల నోటికి అడ్డంగా దొరికి పోతున్న వర్మ ఈసారి ఆ పొరపాటు చేయలేదు. ఏ పాత్ర విషయంలోనూ మిస్ కాస్టింగ్ జరగలేదు.

సాధారణంగా ఓ యదార్ధ సంఘటన సినిమాగా తీస్తున్నప్పుడు కాస్త మెలోడ్రామా, సినిమాటిక్ మార్పులు చేయక తప్పదు. వాస్తవిక జీవితాలను ప్రతిబింబించే మణిరత్నం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ వర్మ ఆ దృష్టి తో ఆలోచించలేదు. ఓ సంఘటనని యధాతథంగా చూపించే ప్రయత్నంలో ఎక్కడా సినిమా కొలతల గురించి ఆలోచించలేదు. అక్కడే మనం అందరం మరచిపోతున్న వర్మ మళ్ళీ గుర్తొస్తాడు. నానా పటేకర్, సంజీవ్ ల నటన వర్మ పనితనానికి, ప్రతిభకు వెన్ను దన్ను గా నిలిచింది. వర్మ ని డామినేట్ చేసిన విషయం ఈ సినిమాలో వుంది అంటే.. అది నానా నటనే. మిగతా వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తుండవు. అవసరం లేదు కూడా. సాంకేతికంగా వర్మ పాత మెరుపులు మరోసారి తళుక్కు మంటాయి. టేకింగ్ లో తాను సృష్టించుకున్న మార్క్… ఈ సినిమాలోనూ కనిపిస్తుంది.

ఇలాంటి సినిమాల వల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడిప్పుడే మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపాలనా? లేదంటే భవిష్యత్‌ తరాలకు ఓ హెచ్చరికగా మిగలాలని సినిమా తీశాడా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వర్మ కూడా చెప్పలేడేమో? వర్మ లోని టెక్నికల్ బ్రిలియన్స్‌ ని చూసే అవకాశం దక్కింది గానీ…. ఈ దాడి వెనుక వున్న సిద్ధాంతపరమైన కారణాలు, ఆ తరవాత ఉత్పన్న మైన పరిస్థితుల జోలికి వెళ్ళలేదు. దాడి లో మరణించిన వారి కుటుంబాలు ఈ సినిమా చూస్తే వారిలో మరింత వేదన తప్ప ఏమి మిగులుతుంది? వర్మ ఫుల్ ఫామ్ లో వున్నప్పుడు ఈ సినిమా తీస్తే.. ఎవరూ పట్టించుకునే వారు కాదు. వరుసగా డక్ అవుట్ అవుతున్న ఓ బాట్స్ మెన్ ఒక్కసారిగా 30, 40 పరుగులు కొడితే ఎలా వుంటుంది? పోనీలే.. ఈ మాత్రం అయినా ఆడాడు అనుకుంటాం. వర్మ పరిస్థితీ అంతే. తనలోని దర్శకుడు మళ్ళీ గాడిలో పడడానికి ఈ సినిమా ఉపయోగపడింది. వర్మ భక్తులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. వాస్తవ సంఘటనలను చూడాలి అనుకునే వాళ్ళు…. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.25/5                                 – స్వాతి                                                                                                                                  

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version ….