రివ్యూ : 3జి లవ్‌

3G-Love-Movie Reviewతెలుగుమిర్చి రేటింగ్‌ : 1.5/5  

మరో బూతు సినిమా… 3జి లవ్‌ 

నోటి దురద అని ఓ మోటు మాట ఉంది. త్రీజీ లవ్ లాంటి సినిమాలు చూస్తే, ఆ నోటి దురద తీర్చుకోవడానికి తీశారనిపిస్తుంది. సీన్లు తీస్తే సెన్సారు ఒప్పుకోదు కాబట్టి, ఆ పైత్యం అంతా మాటల్లోనే పెట్టేసి, కుర్రకారుపైకి వదిలేస్తే, చొంగకార్చుకుంటూ చూసేసి డబ్బులిచ్చేస్తారని అతి తెలివి అయిడియా, హాస్టల్ లో వుండే అమ్మాయిలకు అబ్బాయిల యావ తప్ప మరేమీ వుండదని, కాలేజీ అబ్బాయిలకు, అమ్మాయిలను పటాయించడం తప్ప మరో కార్యక్రమం వుండదని రుజువుచేయడమే తమ లక్ష్యమన్నట్లు ఉంటాయి ఇలాంటి సినిమాలు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కొద్ది మందిని చూసి, ఇక యువ లోకం అంతా ఇంతే అనుకుని తీసే ఇటువంటి సినిమాలకు కర్త, కర్మ, క్రియ కూడా యువతే కావడం మాత్రం విచారకరం.

త్రీజీలవ్ అరడజను మంది హాస్టల్ అమ్మాయిలు, పది మంది కాలేజీ అబ్బాయిల మధ్య నడుస్తుంది. చదువుకునే అమ్మాయిలు, ఆ వయస్సులో దాని గురించి గాక, సదా అబ్బాయిలు, సెక్స్ ఇవే ఆలోచనలట. ఇక అమ్మాయిల సందేహాలు.. ఒక్కడ్ని ప్రేమిస్తే బెటరా, ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్ లను మెంటయిన్ చేస్తే బెటరా. ప్రేమిస్తే చాలా? వాణ్ణే పెళ్లి కూడా చేసుకోవాలా? ప్రేమ డెవలప్ కావాలంటే డన్ లప్‌ బెడ్ ఎక్కాలా? ఇలాంటి సందేహాల నడుమ ఓ పురుషద్వేషి అయిన అమ్మాయిని సలహా అడుగుతారు. ఆమె వాళ్ళకి పెద్ద లెక్చర్ ఇచ్చి, కాలేజీ ఆడిటోరియంలో ఇరువర్గాలను సమావేశపరుస్తుంది. ‘నువ్వు నన్నే ఎందుకు ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఫ్రెష్ యేనా? ‘ఇవీ ప్రశ్నలు. చిత్రమేమిటంటే అబ్బాయిలు వేటికి సూటి సమాధానాలు ఇవ్వరు. బస్ స్టాప్ లో డిస్కషన్ లలా అడ్డదిడ్డంగా మాట్లాడతారు. చివరకు ఏమయిందన్నది కథ. ఇలాంటి సినిమాకు దర్శకుడు విజువలైజేషన్ కన్నా మాటలనే ఎక్కువ నమ్ముకున్నారు. ఒకసారి చేసుకుంటేనే వాంతులవుతాయా? నడుం పక్కలు పెరుగుతున్నాయి. కానీ పెళ్లి ఊసెత్తడం లేదు. మేం నిల్చుని పాస్ పోసుకుంటాం.. మీరు పోసుకోగలరా? ఇలా రాసుకుంటే, సంభాషణలు అనే బూతుకూతలు ఇన్నీ అన్నీకావు.

దర్శకుడు వెంకటపతి రాజు సినిమాకు సరైన స్ర్కీన్ ప్లే రాసుకోలేదు. కథ అంటూ లేకపోవడమే దానికి కారణం కూడా. నిజానికి దర్శకుడు అమ్మాయిలు, అబ్బాయిల నడుమ నిఖార్సయిన డిస్కషన్ అన్నది సినిమాకు కీలకమైన, కొత్త పాయింట్ అనుకుని ఉంటారు. కానీ అదే సినిమాలో పెద్ద మైనస్ గా మిగిలింది. అమ్మాయిల, అబ్బాయిల నడుమ వాదన కాలేజీ గోడల మీదనో, రోడ్డుపక్క బస్ స్టాప్ లోనో జరిగినట్లు ఉంది కానీ, అందులో విషయం లేదు. మొదటి సగంలో అమ్మాయిలను దిగజారినట్టు మాటలు కురిపించి, రెండవ సగంలో అబ్బాయిలపై పడ్డాడు. కానీ ఓ మెట్టు అమ్మాయిల విలువలపైనే నిందలు ఎక్కువ పడ్డాయి.

విజువలైజేషన్, మిక్సింగ్, కెమెరా పనితనం బాగున్నా, స్ర్కిప్ట్ లేనప్పుడు సుఖమేముంది? శేఖర్ చంద్ర సంగీతంలో పాటలు థియేటర్ బయటే బాగుంటాయి. ‘ఏదో సమ్ థింగ్ జరుగుతోంది’ పాట బాగుంది కానీ, లెంగ్తీ పిక్చరైజేషన్ దాన్నిచెడగొట్టింది. నటీనటులంతా కుర్రకారు. రోజూ మాట్లాడే మాటలు, వేసుకునే దుస్తులు, దాంతో కొత్తగా చేసేదేముంది. అమ్మాయిలు కూడా అంతే. మరో సినిమా చాన్స్ దొరికే అవకాశం వున్నవారెవరూ కనిపించరు. ఇన్ని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు వుండి ఏం ప్రయోజనం, ఇటువంటి సినిమాలు విచ్చలవిడిగా వచ్చి, అమ్మాయిల, అబ్బాయిల వ్యక్తిత్వాన్ని నిలువునా దిగజార్చుతుంటే, మౌనంగా వున్నాక.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.5/5                                 – స్వాతి                                                                                                                              

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.