రివ్యూ : బేబీ (Baby Movie Review)

Baby Movie Review

న‌టీన‌టులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, సాత్విక్ ఆనంద్, సీత తదితరులు
దర్శకత్వం: సాయి రాజేష్ నీలం
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాత: మారుతీ, ఎస్కేఎన్
TELUGUMIRCHI RATING : 3.25/5

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. మరి చిత్రం ఈ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

ఆనంద్, వైష్ణవి హైదరాబాదులో ఒక బస్తీలో ఎదురెదురు ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. కాలక్రమేణా వీరిద్దరిమధ్య ప్రేమ పుడుతుంది. అయితే ఆనంద్ కి చదువు అబ్బకపోవడంతో ఆటో తోలుతూ జీవనం సాగిస్తుంటాడు.  వైష్ణవి మాత్రం ఎలాగోలా కష్టపడి ఇంటర్ పూర్తి చేసి బిటెక్ లో జాయిన్ అవుతుంది. అక్క‌డ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల వైష్ణవి ఆలోచ‌నా విధానంలో మార్పులు మొద‌ల‌వుతాయి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న క్లాస్‌మెట్‌ విరాజ్ తో స్నేహం మొదలవుతుంది, అది కాస్త  పక్కదారి పడుతుంది. ఆ తరువాత వీరిద్దరి బంధం ఆనంద్ కి తెలుస్తుందా ? వైష్ణవి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే.

ఆనంద్ పాత్రలో ఆనంద్ దేవరకొండ సరిగ్గా సూట్ అయ్యాడు. ఎలాంటి కల్మషం లేకుండా తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తిగా ఆనంద్ దేవరకొండ జీవించాడు. వైష్ణవి పాత్రకు వైష్ణవి చైతన్య సరిగా న్యాయం చేసింది. అసలు బేబీ అనే పాత్ర ఆమె కోసమే రాసుకున్నారా అన్నట్టుగా నటనలో తనదైన శైలిలో నటించింది.  సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద నడిపించింది. ఒకపక్క ఆనంద్ ను ప్రేమిస్తూనే విరాజ్ మీద ఆకర్షణతో అతని మాటలకు పొంగిపోయే సాధారణ బస్తీ అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా ఇది ఆమెకు మొదటి సినిమానే అయినా అసలు ఏమాత్రం తడబడకుండా ఔరా అనిపించేలా నటించింది. విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. నాగబాబు, వైవా హర్ష, సాత్విక్ ఆనంద్, కిరాక్ సీత, లిరీష కూనపరెడ్డి వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రలకు న్యాయం చేశారు.

ఫైనల్ పాయింట్ : ఇంప్రెస్సివ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ

TELUGUMIRCHI RATING : 3.25/5