రివ్యూ: గుండెల్లో గోదారి

gundello-godari-reviewతెలుగుమిర్చి రేటింగ్‌ : 2.75/5  | Click here for English Review

ఉరకలు, పరుగులు లేని గుండెల్లో గోదారి….

సంస్కృతిలోనే కాదు, సినిమాల్లోనూ పొల్యూషన్ వచ్చేసింది. కథలన్నీ బ్యాంకాక్ వీధుల్లోనో, సిడ్నీ సందుల్లోనో పుడుతున్నాయి. అల్ర్టామోడ్రన్ దుస్తులూ, దానికి తగిన పాత్రలు… ఇది వరకు పాటల కోసం ఫారిన్ వెళ్లేవారు. ఇప్పుడు సినిమా అంతా అక్కడే చుట్టేస్తున్నారు. తెలుగు సినిమా కథ, పల్లెటూర్లో గోదారి తీరాన పుడితే చూడాలని చాలామంది ప్రకృతి ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. ‘గుండెల్లో గోదారి’ సినిమా వచ్చింది. ఒకటో సన్నివేశం నుంచీ శుభం కార్డు వరకూ – కథ, కథనం, పాటలూ అన్నీ ఆ పచ్చని తీరంలోనే. అసలింతకీ… ఈ కథలో ఏముంది? ఆ గోదారమ్మ పరవళ్లు గుండెల్ని తాకాయా? లేదంటే ఓ గుర్తుగానే మిగిలిపోయాయా? తెలుసుకుందాం పదండి?

అది 1986. గోదారి తీరం. వరద తాకిడి ఉధృతంగా ఉంది. ఆ సమయంలోనే మల్లి (ఆది పినిశెట్టి), చిత్ర (లక్ష్మీ ప్రసన్న)ల పెళ్లి. పెళ్లి పెద్దగా వచ్చిన దొరబాబు (రవిబాబు) చిత్రకి ఖరీదైన కానుక ఇస్తాడు. పిలవని పెళ్లికి వచ్చిన బుజ్జి (తాప్సి) మల్లికి బంగారం ఉంగరం కట్నంగా ఇస్తుంది. అంత విలువైన వస్తువులు ముట్టజెప్పారంటే వారి మధ్య ఏదో ఉందని ఆ పెళ్లికొచ్చినవారంతా గుసగుసలాడుకొంటారు. మల్లికి చిత్రపైన, చిత్రకు మల్లిపైన అనుమానం మొదలవుతుంది. అంతలో.. గట్టు తెగి గోదారి వరద ఊరిని ముంచెత్తుతుంది. మల్లి, చిత్రలు ఓ గడ్డిమేటు ఎక్కి ప్రాణాలు తాత్కాలికంగా కాపాడుకొంటారు. కొన్ని గంటల్లో ప్రాణాలు పోవడం ఖాయం. ఈలోగా ఒకరి అనుమానాల్ని మరొకరు నివృత్తి చేసుకోవడానికి ఒకరి కథ మరొకరికి చెప్పుకొంటారు. మల్లి, చిత్ర జీవితాలతో ప్రేమ ఎన్ని ఆటలు ఆడింది? వీరి పెళ్లికి ముందు జరిగిన కథేమిటి? మల్లి, చిత్ర మనసుల్లో ఎవరున్నారు? అనేదే ‘గుండెల్లో గోదారి’ సినిమా.

ముఖ్యంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగిన కథ ఇది. వారి ఆలోచనలు, లక్ష్యాలు, ఆశలూ చూపించే ప్రయత్నం చేశారు. తొలి సగంలో మల్లి-బుజ్జి, రెండోభాగంలో సూరిబాబు (సందీప్ కిషన్), చిత్రల మధ్య నడిచే సన్నివేశాలే ఈ చిత్రానికి ఆధారం. 1985 నాటి కథ కాబట్టి అందుకు తగిన వాతావరణం చూపించడానికి చిత్రబృందం అణువణువూ కష్టపడింది. అప్పటి దుస్తులు, కేశాలంకరణ, మాటతీరు ఇవన్నీ ప్రతిబింబిస్తాయి… ఆఖరికి అప్పట్లో విడుదలైన పోస్టర్లతో సహా. పల్లెదనం, పచ్చదనం నిండిన సినిమా ఇది. గోదారి తీరంలోని మనుషుల జీవితాల్ని చూపించే ప్రయత్నం చేశారు. దివిసీమ ఉప్పెనని గోదారి ప్రాంత వాసులు ఎప్పటికీ మర్చిపోలేరు. దాన్ని మళ్లీ గుర్తు చేశారు.

అసలు ఈ కథకు నేపథ్యంగా దివిసీమ ఉప్పెనను ఎంచుకోవాలనే ఆలోచనే మామూలు ప్రేమకథలని మరోరూపంలో ఆవిష్కరించడానికి నాంది పలికింది. కొత్తగా పెళ్లయిన జంట తమ జీవితాన్ని ఒకరి కొరకు ఆవిష్కరించుకోవడం బాగుంది. దానికి తోడు ఇళయరాజా నేపథ్య సంగీతం ఈ సినిమాకి కొత్త ఊపు, రూపు తీసుకొచ్చాయి. ఆయన తన పాత పాటల బాణీలనే వినిపించారు. పాతకాలం నాటి సినిమా కాబట్టి – ఇళయరాజా ఎత్తుగడ ఫలించింది. ‘గుండెల్లో గోదారి’, ‘నిను నాతో నను నీతో’ పాటలు ఇళయరాజా శైలిని మరోసారి గుర్తుచేశాయి. ఛాయాగ్రహణంతో పాటు ఆర్ట్ విభాగం చాలా శ్రద్ధగా పనిచేసింది.

సాంకేతికంగా సినిమా ఓకే! అయితే.. ఈ సినిమాకి కావల్సింది అది కాదు. భావోద్వేగాలు పండించటం. రెండు ప్రేమ జంటల మధ్య ఉన్న ఫీల్ ని క్యారీ చేయడంలో దర్శకుడు కుమార్ నాగేంద్ర తడబడ్డాడు. మల్లి-బుజ్జిల మధ్య ప్రేమ లేదు. బుజ్జికి మల్లిపై ఉన్న కోరిక తప్ప. బుజ్జిని అనుభవించడానికి మల్లి దగ్గర బలమైన కారణమూ లేదు. అలాంటప్పుడు ఆ జంటపై ప్రేక్షకులకు సానుభూతి ఎందుకు కలగాలి? సందీప్ కిషన్, లక్ష్మీల జంట చూడ్డానికి కాస్త కృతకంగా అనిపించింది. సందీప్ కంటే లక్ష్మీ వయసు ఎక్కువనే సంగతి.. మేకప్ మసి పూసి మారేడు కాయ చేయలేకపోయింది. ఈ రెండు పాత్రల్లో ఒకరిని మార్చినా ఈ కథ మరోలా ఉండేదేమో? ! బుజ్జిగా తాప్సి క్యారెక్టరైజేషన్ అంత సమర్థంగా లేదు. ఆమెను అణువణువూ కోరికలు నింపుకున్న అమ్మాయిగా చూపించారు. రేపు తనకు పెళ్లని తెలిసి, మరొకడికి శరీరాన్ని ఇష్టంగా అర్పించడం వెనుక కోరిక తప్ప, ప్రేమ ఉండదు.

వినోదం ఆశించి ఈ సినిమాకి వెళితే భంగపాటుకు గురికాక తప్పదు. కథని ఎంతసేపూ సీరియస్ మూడ్ లోనే చూపించడానికి శ్రద్ధ పెట్టారు. దాంతో నవ్వుకోవడానికి ఛాన్స్ దొరకలేదు. సంభాషణలూ, పాత్రల ప్రవర్తనా అంతా గోదారి వాతావరణమే. ఆ యాసపై ప్రేమ ఉంటే ఆస్వాదిస్తారు. మరి మిగతావాళ్ల పరిస్థితి? ! గోదారి అందాలను, దాని బీభత్సాన్నీ చూడాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. ఇళయరాజా అభిమానులు కూడా. అంతకు మించి ఆశిస్తే.. ఆ తప్పు మీదే!

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.75/5                                 – స్వాతి                                                                                                                                  

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version ….