రివ్యూ : జెఫ్ఫా

jaffa-telugu-movie-review-rating

తెలుగుమిర్చి రేటింగ్‌ 1.75/5 | Click here for English Review

 

రివ్యూ:

వెన్నెల కిషోర్‌కి తెలుగు ప్రేక్ష‌కులేమైనా ద్రోహం చేశారా… ? ఏమో… చేసే ఉంటారు. ఏదైనా సినిమాలో అతివీర భ‌యంక‌రంగా కామెడీ చేసేస్తే… కిసుక్కున న‌వ్వి ఉండ‌రు. సీరియ‌స్ వేషాలేసిప్పుడు ఫ‌క్కుమ‌ని ఉంటారు. మ‌య‌స‌భ‌లో ద‌ర్యుధ‌నుడికి అవ‌మానం జ‌రిగిన‌ట్టు తెగ ఫీలైపోయి మ‌న‌సులో క‌క్ష పెంచుకొని ఉంటాడు. ఆ కోపం, ఆ చిరాకు, ఆ అస‌హ‌నం ఎలా వెల్ల‌గ‌క్కాలో తెలీక `వెన్నెల వ‌న్ అండ్ ఆఫ్‌` అనే సినిమా తీశాడు. ఈ దెబ్బ‌తో జ‌నం చ‌చ్చి ఊరుకొంటారులే… అని సంబ‌ర‌ప‌డి ఉంటాడు. కానీ మ‌నం చూశాం… గుండె బండ‌రాయ కాబ‌ట్టి.. బ‌తికిపోయాం. పెద్ద‌మ‌న‌సు చేసుకొని `కొన్ని సినిమాలింతే లేవోయ్` అని లైట్ తీసుకొన్నాం. దాంతో కిషోర్ ప‌గ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వ‌డ్డీతో రుణం తీర్చుకోవాల‌ని పెద్ద ప్లానే వేశాడు. పోస్ట‌రుపై త‌న బొమ్మ ఉంటే జ‌నాలు రారాని డిసైడ్ అయిపోయి.. బ్ర‌హ్మానందంని అడ్డుపెట్టుకొని ఓ మ‌హ‌త్త‌ర దుర్మార్గ‌పు సినిమా తీసి జ‌నం మీద‌కు వ‌దిలేశాడు. అదే జ‌ఫ్ఫా. ఈసారైనా కిషోర్ ప‌గ చ‌ల్లారిందా? ఈ సినిమా చూసిన స‌గ‌టు ప్రేక్ష‌కుడు త‌ట్టుకొని నిల‌బ‌డ్డాడా?  చూద్దాం రండి.

జఫ్ఫా (బ్ర‌హ్మానందం) చేయ‌ని నేరానికి జైలుకి వ‌స్తాడు. ఆ జైలులో అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉంటుంది. జైలు అధికారి విక్కీ (వెన్నెల కిషోర్‌). . జైలులోని ఖైదీలు ఒకొక్క‌రికీ ఒక్కో చ‌రిత్ర‌. అంద‌రి ద‌గ్గ‌రా జ‌ప్ఫా త‌న తెలివి తేట‌ల‌తో, మాట‌తీరుతో మాంఛి ప‌లుకుబ‌డి తెచ్చుకొంటాడు. ఉరిశిక్ష ఎలా త‌ప్పించుకోవాలి, ప్రేమికురాలిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి? ఇంట్లో స‌మ‌స్య‌ల నుంచి ఎలా గట్టెక్కాలి..? అనే స‌ల‌హాలు ఇస్తుంటాడు. దాంతో భైదీలంతా జ‌ప్ఫాకి అభిమాల‌నులు అయిపోతారు. ఓరోజు జఫ్ఫా జైలు నుంచి త‌ప్పించుకోవాల‌నే ప్లాన్ వేస్తాడు. దానికి విక్కీ కూడా స‌హ‌క‌రిస్తాడు. జైలులోని ఫాద‌ర్ (ర‌ఘుబాబు)ని చంపేసి, ఆ శ‌వ పేటిక‌లో జ‌ఫ్ఫాని ప‌డుకోబెట్టి… శ‌వాన్ని శ‌వ‌పేటిక‌తో స‌హా పాతిపెట్టేసి న‌ప్పుడు అందులోంచి త‌ప్పించుకోవాల‌నేది జ‌ఫ్ఫా ప్లాన్‌! అయితే ఆ ఫ్లాన్ దారుణంగా ఫెయిలై… జ‌ఫ్ఫా శ‌వ‌పేటిక‌లోనే ఉండిపోవ‌ల‌సి వ‌స్తుంది. బ‌తికున్న జఫ్ఫాని భూమిలో పాతేస్తారు. అందులోంచి ఎలా త‌ప్పించుకొన్నాడు? అస‌లు బ‌య‌ట‌కి వ‌చ్చి జ‌ఫ్ఫా ఎలాంటి ఘ‌న‌కార్యం సాధించాడు? అనేదే ఈ సినిమా క‌థ‌.

క‌థగా వింటే ఎలా అనిపిస్తోంది? ఇదేంటి జ‌ఫ్ఫామే జ‌ఫ‌డాలా (అంటే ఏమిట‌ని అడ‌క్కండి ఈ సినిమా చూశాక‌.. ఇలా అర్థం ప‌ర్థంలేని భావాలే పుట్టుకొస్తుంటాయ్‌) ఉందేమిటి? అనుకోవ‌చ్చు. నిజానికి తీత‌, రాత అంత కంటే దారుణంగా నే ఉన్నాయి. చిన్న‌పిల్లాడు పిచ్చిగీత గీస్తే… అందులోనూ ఎంతో కొంత అందం ఉంటుంది. పిచ్చి వాడు పాట పాడినా.. ఓ రాగం పుట్టుకొచ్చేస్తోంది. ఓపిక ఉంటే వినొచ్చు. కానీ.. వెన్నెల కిషోర్ సినిమా తీస్తే అందులో ఏమీ ఉండ‌దు… అని చెప్ప‌డానికి వెన్నెల వ‌న్ అండ్ ఆఫ్ సినిమానే ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఆ సినిమా చూడ‌లేక‌పోయిన వారికి… రుజువు ఈ జ‌ఫ్ఫా. సినిమా ఎలా తీయాలి? అందులో ఏముండాలి? అనే ప్రాధ‌మిక విష‌యాలు కొన్ని ఉంటాయి. వాటికి అతీతంగా తన ఇష్టం వ‌చ్చిన‌ట్టు తీసుకొంటూ పోయాడు కిషోర్‌. ఆయ‌న‌గారికి క‌నీస అవ‌గాహ‌న లేదు అని చెప్ప‌డానికి ఎన్నెన్ని ఉదాహ‌ర‌ణ‌లో. ఉరిశిక్ష తెల్ల‌వారు ఝూమున తీస్తారు. మిట్ట‌మ‌ద్యాహ్నం కాదు. ఉరిశిక్ష వాయిదా వేసే అధికారం జైల‌ర్‌కో, కానిస్టేబుల్‌కో ఉండ‌దు. ఈ విష‌యం కూడా తెలీక సినిమా తీస్తే ఆయ‌న్ని ఏమ‌నాలి? తొంభై ఏళ్ల ముస‌లివాడు… `అయ్యా.. నా చెల్లాయికి పెళ్లి చేయాల‌య్యా.. అందుకోసం దాచుకొన్న డ‌బ్బ‌య్యా ఇది` అంటాడు. తొంభై ఏళ్ల‌వాడి చెల్లాయికి ఇంకా పెళ్లి కాలేదా? మ‌రీ ఇంత లాజిక్ లేకుండా సినిమా ఎలా తీశాడో అర్థం కాదు.

వెన్నెల కిషోర్ అంటే జూనియ‌ర్‌…! మ‌రి ఇన్ని సినిమాలు చేసిన బ్ర‌హ్మానందం సినియారిటీ ఏమైంది? ఏ స‌న్నివేశానికి జ‌నం న‌వ్వుతారో, ఎలాంటి స‌న్నివేశం తీస్తే తాము నవ్వుల పాల‌వుతామో ఆయ‌న‌కీ తెలీదా? బ‌్రహ్మీ ఓ స్టార్ క‌మెడియ‌న్‌. ఆయ‌న్ని చూస్తే చాలు… ప్రేక్ష‌కులు ద‌ర‌హాసాల్లో తేలిపోతారు. నాలుగు స‌న్నివేశాల్లో న‌వ్వించి సినిమాని హిట్ చేసిన చ‌రిత్ర ఆయ‌న‌ది. అలాంటి ఓ హాస్య న‌టుడు ఓ ఫుల్ లెంగ్త్ పాత్ర‌లో క‌నిపిస్తే జ‌నం ఇంకెన్ని న‌వ్వులు ఆశిస్తారు? అయితే కిషోర్ అవేమీ ప‌ట్టించుకోలేదు. సినిమా అంటే కొన్ని స‌న్నివేశాలు అల్లుకోవ‌డం కాదు. ఓ క‌థ చెప్ప‌డం. ప్రేక్ష‌కుల‌ను రెండు గంట‌ల పాటు బోర్ కొట్టించ‌కుండా కూర్చోబెట్ట‌డం… ఇవేమీ వెన్నెల కిషోర్ కి ప‌ట్ట‌లేదు.

జైలులో కొన్ని స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. అయితే వాటిలో ఎక్క‌డా లాజిక్ ఉండ‌దు. ఎవ‌రెవ‌రు జైలుకి ఏ నేరం చేసి వ‌చ్చారు? అనే స‌న్నివేశాల్ని బాగానే తీశాడు. ఆ ఒక్క విషయంలోనే కిషోర్ స‌క్సెస్ అయ్యాడు. ఆ త‌ర‌వాత‌… ఎక్క‌డా అత‌ని ప‌నిత‌నం క‌నిపించ‌దు. సెకండాఫ్ అయితే పర‌మ‌బోర్. తెర‌పై ఎంత‌మంది హాస్య‌న‌టులు క‌నిపిస్తున్నా న‌వ్వురాదు. ఈ సినిమాతో బ్ర‌హ్మీ ప్ర‌త్యేకంగా సాధించింది ఏమీ లేదు. ఎంత గొప్ప క‌మెడియ‌న్ అయినా స‌రైన స‌న్నివేశాలు రాసుకోక‌పోతే ఆయ‌నా ఏమీ చేయ‌డ‌లేడ‌నే స‌త్యం అర్థ‌మైంది. సెకండాఫ్‌లో బ్ర‌హ్మీని భూమిలోనే పాతిపెట్టేశాడు. ఆ హంగామా అలీ నెత్తిమీద పెట్టుకొన్నాడు. ఆయ‌న‌పై తెర‌కెక్కించిన‌వ‌న్నీ చంట‌బ్బాయ్ సీన్లే.

జ‌ఫ్ఫా అంటే ఓ అర్థం లేని పేరు. ఆ సినిమాలో అర్థ‌వంత‌మైన స‌న్నివేశాలు ఉంటాయ‌ని భ్ర‌మించ‌డంలోనూ అర్థం లేదేమో? కిషోర్ ఇక‌నైనా మెగాఫోన్ పై మోజు త‌గ్గించుకొంటే మంచిది. ఒక‌వేళ ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నిద్దాం అనుకొంటే ఓ మంచి క‌థ రాసుకోవాలి. క‌థ లేకుండా, స‌రైన స‌న్నివేశాలు రాసుకోకుండా.. తెలిసిన పైత్యం అంతా తెరపై గుమ్మ‌రిద్దాం అనుకొంటే ఆ సినిమా జ‌ఫ్ఫాలా త‌యార‌వుతుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 1.75/5                                           – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version