రివ్యూ : మహంకాళి

mahankali-telugu-movie-review-ratingతెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5

ఇంకా ఏదో కావాలి… మహంకాళి

పేపర్లో ఏదో ఓ వార్గ్త నిత్యం మనల్ని కదిలిస్తూనే ఉంటుంది. చదివినంతసేపూ ఆవేశంతో ఊగిపోతాం. పేపర్ పక్కన పెట్టి వేడి వేడి కాఫీ నోటికి అందగానే – ఆ రుచిలో మన ఆవేశం చల్లబడిపోతుంది. మరుసటి రోజు మరో పేపర్ వస్తుంది. మరో కప్పు కాఫీ మన ఆవేశాన్ని చంపేస్తుంది. ఢిల్లీలో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తే ఏం చేశాం? తొలి రోజు ఆవేశం వచ్చింది. రెండో రోజు నిరసన తెలియజేశాం. మూడో రోజు మర్చిపోయాం. కానీ.. లోలోపల మాత్రం ఆ దుర్మార్గుల అంతు చూడాలనే కోరిక మాత్రం అలానే ఉంటుంది. ఆ పనే తెరపై కథానాయకుడు చేస్తే.. అప్పుడు మనలో ఉన్న సామాన్యుడు తృప్తి పడతాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు నేపథ్యంలో సాగే పోలీసు కథలు విజయవంతం అయ్యేది అక్కడే. ప్రేక్షకుడి ఈగో ఫీలింగ్స్ ని సంతృప్తిపరిచిన సినిమాలన్నీ హిట్ బాటపట్టాయి. ఇప్పుడు ‘మహంకాళి’ నేపథ్యం కూడా అదే. ఈ సినిమా సామాన్యుడిఆవేశాన్ని చల్లార్చిందా? లేదా చప్పబడిపోయిందా చూద్దాం రండి.

మహంకాళి (రాజశేఖర్) ఓ సిన్సియర్ ఆఫీసర్.. దుర్మార్గులను ఏరిపారేస్తుంటాడు. హైదరాబాద్ లో ఉన్న నాయక్ కీ, దుబాయ్ లో ఉన్న అర్షద్ భాయ్ కీ ఎప్పుడూ గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఈ ముఠాలోని వాళ్లందరినీ మహంకాళి ఎన్ కౌంటర్ చేస్తుంటాడు. తనీషా (మధురిమ) అనే కథానాయికను లైంగిక వేధింపుల నుంచి రక్షిస్తాడు మహంకాళి. అతని దూకుడు చూసి తనీషా ప్రేమలో పడిపోతుంది. మహంకాళి స్పీడు మాత్రం పైఅధికారి (చలపతి రావు)కి నచ్చదు. అతను అర్షద్ భాయ్ మనిషి. ఎలాగోలా మహంకాళిని అడ్దుతొలగించుకోవాలని చూస్తాడు. మహంకాళి అర్షద్ మనిషి.. అని నమ్మించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాడు. అరెస్టు కూడా చేయిస్తాడు. మరి మహంకాళి ఎలా బయటకు వచ్చాడు? అర్షద్, నాయక్ లా ఆట ఎలా కట్టించాడు? అనేదే ఈ సినిమా కథ.

రాజశేఖర్ బలం.. ఆవేశం. పోలీస్ పాత్రల్లో భలే నప్పుతాడు. పౌరుషం, లెక్కచేయనితనం, నిజాయితీ ఇవన్నీ మేళవిస్తే – అతని పాత్రకు తిరుగుండదు. కానీ ‘అంకుశం’ తరవాత అంతటి శక్తివంతమైన పాత్ర మలచడంలో దర్శకులు విఫలమయ్యారు. ఆ బాధ్యత జీవిత భాగస్వామి జీవిత తీసుకుంది. రాజశేఖర్ బలాలు,బలహీనతలు చక్కగా తెలిసిన వ్యక్తి కాబట్టి అందుకు అనుగుణంగానే సన్నివేశాలను రాసుకొంది. పైగా ఢిల్లీలో బాలికపై జరిగిన అత్యాచారం, గోకుల్ చాట్ బాంబు పేలుడు.. ఇలా సమకాలీన అంశాలను కథలో మేళవించారు. కాబట్టి ప్రేక్షకుడు చాలా సులభంగా ఈ కథలో లీనమయ్యే అవకాశం ఉంది. నాయక్-అర్షద్ ల మధ్య ఆధిపత్యపోరు, వీరి గ్యాంగ్ ని అంతం చేసే మహంకాళి స్పీడుతో సినిమాకి కావల్సినంత బేస్ దొరికింది. నస పెట్టే సన్నివేశాలకు ఏమాత్రం ఆస్కారం లేని సబ్జెక్ట్ ఇది. జీవిత కూడా చక్కగా డీల్ చేసింది.

రాజశేఖర్ ఎప్పటిలాగే సహజంగా నటించారు. వయసైపోతున్న ఛాయలు కనిపించినా.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సంతోషించదగిన విషయం. అందుకే ఎక్కడా రాజశేఖర్ చేత స్టెప్పులు వేయించలేదు. వెకిలి వేషాలూవేయించలేదు. మధురిమ ఈ సినిమాకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఆమెపై ప్రేమతో నాలుగు డైలాగులు ఎక్కువ రాసినా – ఆమె తన హావభావాలతో చిరాకు తెప్పించేస్తుందని జీవిత కూడా భావించి ఉంటుంది. అందుకే… ఆ పాత్రని ముందు నుంచీ మూకీగానే ఉంచారు. కథానాయకుడు-ప్రతినాయకుడి మధ్య వార్ ఎప్పుడూ పరోక్షంగానే సాగుతుంది. ప్రేమికులతో మాట్లాడినట్టే.. ఫోన్ లో గంటల కొద్దీ వార్నింగులు ఇచ్చిపుచ్చుకోవడానికి సరిపెట్టుకొన్నారు. ఈ తతంగం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ‘మహంకాళి’ ఓ హిందీ సినిమాకి రిమేక్ అని చెప్పారు. అంత అవసరం లేదేమో అనిపించింది. ఇందులో ‘గోలీమార్’ ఛాయలు కనిపిస్తాయి.

రాజశేఖర్ యాక్షన్ హీరో. అతని నుంచి ఏమేం ఆశిస్తారో అవన్నీ ఈ కథలో ఉన్నాయ్. అయితే.. కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం ప్రధానమైన లోపం. మాటల కన్నా తూటాల శబ్దాలే ఎక్కువ. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు కాబట్టి.. తుపాకిని ఎడా పెడా వాడేశారు. ముఖ్యమంత్రి పాత్ర.. రాజశేఖర్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ కనిపిస్తుంది. పాపం… ఆయన్ని ఈ కథలో ఎందుకు లాకొచ్చారో అర్థం కాదు. నేపథ్య సంగీతం కూడా గందరగోళంగా తయారైంది. పాటలు తక్కువే. ఈ విషయంలో జీవితను మెచ్చుకోవాలి. కథ టెంపో పోకుండా.. ఆ జాగ్రత్త తీసుకొన్నందుకు. కెమెరాల్లో ఎక్కువ కదిలికలు కనిపించాయి. అది కూడా బాలీవుడ్ సినిమాకి స్ఫూర్తో ఏమో? !

రాజశేఖర్ నుంచి సూపర్ హిట్ సినిమా రాకపోయినా ఫర్లేదు.. ఓ యాక్షన్ సినిమావచ్చినా చాలు.. అనుకొంటోంది పరిశ్రమ. ఎందుకంటే కొన్ని కథలకు ఆయన లాంటి నటులు కావాలి. ఆలోటుని ‘మహంకాళి’ పూడ్చే ప్రయత్నం చేసింది. అసలేమీ ఆశించకుండా ఈ సినిమా చూస్తే మంచిది. కనీసం ఎంతో కొంత తృప్తి దక్కుతుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5                                 – స్వాతి                                                                                                                                

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version ….