రివ్యూ : మిస్టర్‌ పెళ్ళికొడుకు

Mr Pellikoduku Telugu Movie Review, Rating, Sunil

కొంచెం కళ తప్పిన ‘మిస్టర్‌ పెళ్ళికొడుకు’

మన ఇంట్లో కూర వండుకోవడానికి, కర్రీ పాయింట్ పై ఆధారపడిపోవడానికీ చాలా తేడా ఉంది. ఇంటి రుచి  దేనికొస్తుంది చెప్పండి? ఇక్కడైతే మనకు ఇష్టమైన కూర, మనకు నచ్చినట్టు వండుకోవచ్చు. అదే కర్రీ పాయింట్ అనుకోండీ… వాడు వండిన కూరే చచ్చినట్టు తినాలి. రీమేక్ కథ కూడాఅ కర్రీ పాయింట్ లాంటిదే. ఎక్కడో హిట్టయిన సినిమాని మనం అరువు తెచ్చుకొని చూడాలి. అయితే కర్రీని రీమోడలింగ్ చేసుకొనే సౌలభ్యం ఉండదు. గానీ.. కథకు ఉంది. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి, హీరో శైలికీ తగినట్టు మలచుకోవచ్చు. మార్పులు దర్శకుడి
ప్రతిభపై ఆధారపడి ఉంటాయి. ‘మిస్టర్ పెళ్ళికొడుకు’ కూడా ఓ రీమేక్ స్టోరీనే. బాలీవుడ్ లో విజయవంతమైన ‘తను వెడ్స్ మను’ని తెలుగులో తీసుకొచ్చారు. మరి ఈ కూర రీమోడలింగ్ చేశారా? టేస్ట్ ఎలా ఉంది?
తెలుసుకొందాం రండి!

అమెరికా నుంచి అరేళ్ల తరవాత వస్తాడు బుచ్చిబాబు (సునీల్). రాగానే ఇంట్లోవాళ్లు పెళ్లిసంబంధాలు వెతికేస్తారు. అందులో భాగంగా సఖినేటిపల్లి వస్తారు. పెళ్లిచూపుల్లో అంజలి (ఇషాచావ్లా) ని చూసి మనసు పడతాడు. రెండు
కుంటుంబాలూ ఈ పెళ్లికి ఒప్పుకొంటాయి. సీతారాముల కళ్యాణం చూద్దామని భద్రాచలం వెళ్తాయి. పెళ్లి చూపుల్లో అణకువగా కనిపించిన అమ్మాయి… అక్కడ విశ్వరూపం చూపిస్తుంది. దమ్ము కొడుతుంది. ‘నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకొన్నావా? నీకు నేను కావాలా? ‘ అంటూ బుచ్చిని బెదిరిస్తుంది. దాంతో ఖంగుతిన్న బుచ్చి ఈ సంబంధాన్ని వదులుకొంటాడు. కానీ.. బుచ్చి మనసులో అంజలి బొమ్మ ముద్రించుకుపోతుంది. స్నేహితుడి పెళ్లికి కేరళ వెళ్తాడు. అక్కడికి అంజలి కూడా వస్తుంది. కొన్ని సంఘటనలు చూసి అంజలి నన్ను ప్రేమిస్తుందేమో అని ఆశపడతాడు బుచ్చిబాబు. కానీ ‘నేనో అబ్బాయిని ఇష్టపడ్డాను. తను కూడా ఇక్కడికి వస్తున్నాడు. మా ఇద్దరికీ పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే’ అని బుచ్చిబాబుతో చెప్తుంది. అప్పుడేమైంది? ఇద్దరికీ పెళ్లిచేశాడా? ఇంతకీ అంజలి ప్రేమించింది ఎవరిని? ఈ విషయాలు ద్వితీయార్థంలో తెలుస్తాయి.

నిజానికి ‘తను వెడ్స్ మను’ తెలుగు ప్రేక్షకులకు తెలియని కొత్త కథేం కాదు. దాదాపు ఇలాంటి లైన్ చాలా సినిమాల్లో తగిలింది. కానీ.. ఆ సినిమా బాగా ఆడిందంటే కారణం.. కంగనా రనౌత్ నటన, మాధవన్ పాత్ర సృష్టించిన ఫీల్ ! ఇవి రెండు ఈ కథకు కీలకం. వాటిని ఈ రీమేక్ కథలో సునీల్, ఇషాచావ్లా మోశారు.
బుచ్చిబాబు పెళ్లిచూపులు, అంజలిని ఇష్టపడిన ఘట్టాలతో సినిమా ప్రారంభం… హడావుడిగానే మొదలవుతుంది. ఈ ప్రవాహంలో ‘మొగలిరేకులు’ లాంటి సీరియళ్లపై ఓ సెటైర్ కూడా వేశారు. అది ఒకింత బాగానే పేలింది. సునీల్ ఛేజింగ్ సీన్… పాత వాసన కొట్టినా కాస్త భరించొచ్చు. ధర్మవరపు, అలీ, ఆహుతి ప్రసాద్ లాంటి సీనియర్ హాస్యనటులు నవ్వించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అందులో కొన్నిసార్లు విజయం సాధించారు కూడా.

సునీల్ వస్తూ వస్తూనే బీభత్సమైన స్టెప్పులతో అదరగొట్టాడు. రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేలా సాగాయి అతని నృత్యాలు. అమాయకత్వం, మంచితనం, తెలివితేటలూ.. ఇవన్నీ మేళవిస్తూ అతని
పాత్రని తీర్చిదిద్దారు. తనదైన శైలిలో అల్లుకుపోవడానికి ప్రయత్నించాడు. మరోవైపు ఇషాచావ్లా.. కంగనా రౌనత్ ని ఇమిటేట్ చేయలేక, తన సొంత ముద్ర చూపించలేక డీలా పడింది. ఎప్పుడూ పాటలకు మాత్రమే పరితమైన కథానాయిక కాబట్టి… ఇంత ఎమోషన్ ని మోయడం కష్టం అనిపించింది. ఆమెకే కాదు.. చూస్తున్న
ప్రేక్షకులకు కూడా. దానికి తోడు దమ్ము కొట్టించారు. మందు తాగించారు. బాలీవుడ్ సినిమాల్లో ఇవన్నీ చల్తా! కానీ తెలుగులో మక్కీకి మక్కీ దించేస్తే.. తట్టుకోవడం కష్టం.

ఇంట్రవెల్ బ్యాంగ్ కే కథేంటో అర్థమైపోతుంది. కాబట్టి.. ఆ తరవాత సన్నివేశాలు పకడ్బందీగా రాసుకోవాల్సింది. అయితే అలాంటి ప్రయత్నాలేం చేయలేనట్టు కనిపిస్తుంది. అందుకే ద్వితీయార్థంలో బండి భారంగా సాగుతుంది.
దానికితోడు.. ప్లేస్ మెంట్లు కుదరని పాటలు ఇబ్బంది పెడతాయి. ఆ పాటల్లో సునీల్ నృత్యాలు ఎంత బాగున్నా సరే.. కనెక్ట్ అవ్వలేం. రిజిస్టార్ ఆఫీసులో సన్నివేశం కాస్త కృతకంగా అనిపిస్తుంది. పెన్ను లేకపోవడం వల్ల పెళ్లి
ఆపేస్తారా? ! ఎంత సినిమా అయినా.. మరీ ఇంత సినిమాటిక్ గా తీయాలా? పతాక సన్నివేశాల్లో సునీల్ తన సిక్స్ ప్యాక్ చూపించి శుభం కార్డు వేయించాడు. సునీల్ కండలు జబర్ దస్త్ గా ఉన్నా సరే – ‘ఈ ఫైటు ఇక్కడ అవసరమా?’ అనే సందేహం ప్రేక్షకుడికి కలుగుతుంది. ‘తను వెడ్స్ మను’ భారాన్ని కంగనా, మాధవన్ ఇద్దరూ మోశారు. ఈసారి సునీల్ మాత్రమే ఎత్తుకోవలసి వచ్చింది.

సాంకేతిక విభాగంలో పాటలు తేలిపోయాయి. ఎస్. ఏ. రాజ్ కుమార్ అంటే మెలోడీ ఆశిస్తారు. కానీ… ఆ శ్రావ్యత ఈ సినిమాలో కనిపించదు. ఆర్. ఆర్ కూడా సాధారణ స్థాయిలోనే ఉంది. పాటలు రిచ్ గానే తీశారు. తొలి సన్నివేశాల్లో కొన్ని పంచ్ లు పేలి.. అక్కడే అయిపోయాయి. ఇదో ఫీల్ గుడ్ మూవీలా మలచాలని దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఫీలూ లేదూ, గూడ్డూ లేదు. దాంతో.. థియేటర్ బోసిపోయింది. సునీల్ డ్యాన్సులంటే ఇష్టపడేవారు పాటలు చూసి వచ్చేయొచ్చు.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.75/5                                 – స్వాతి                                                                                                                                  

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version ….

Mr Pellikoduku Review, Rating : Mr Pellikoduku Movie Review : Mr Pellikoduku Telugu Movie Review
Swathi

Mr Pellikoduku Review, Rating : Mr Pellikoduku Movie Review : Mr Pellikoduku Telugu Movie Review
Mr Pellikoduku Movie Review, Rating, Mr Pellikoduku Telugu Movie Review, Rating, Mr Pellikoduku Review, Rating, Sunil Mr Pellikoduku Movie Review, Rating – Cast: Sunil, Isha Chawla – Director: Devi Prasad – Producer: N. V. Prasad, Paras Jain – Release Date: Feb 22, 2013

2.75