రివ్యూ : ప్రియతమా నీవచట కుశలమా

Priyatama Neevachata Kusalama Movie

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5 

ప్రియతమా నీవచట కుశలమా… ఫీల్ వుంది కానీ… 

యువ‌హీరోల్లో అంద‌రూ ఇప్పుడు ప్రేమ‌క‌థ‌ల బాట ప‌ట్టారు. ఓ మాంఛి టైటిల్ ఎంచుకొని, యువ‌త‌రాన్ని మెప్పించే స‌న్నివేశాలు జోడించి, అందులో కాస్త మ‌సాలా ద‌ట్టించి సినిమా లాగించేస్తున్నారు. చాలా సార్లు హ‌ద్దులు దాటి, క‌థ‌కు దూరంగా వెళ్లి గార‌డీ చేసి, చివ‌ర్లో సందేశం ఇచ్చి మ‌రీ పంపిస్తున్నారు. `ప్రియ‌త‌మా నీవ‌చ‌ట కుశ‌ల‌మా` కూడా ఈ త‌ర‌హా ప్రేమ క‌థే! ప్రేమ గురించి త‌లోర‌కంగా ఆలోచించే ముగ్గురి క‌థ ఇది. ఒక‌రు మ‌రొక‌రి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? చివ‌రికి ఎవ‌రి అభిప్రాయం గెలిచింది? అనేదే ఈ `ప్రియ‌త‌మా నీవ‌చట‌ కుశ‌ల‌మా` సినిమా.

వ‌రుణ్‌(వ‌రుణ్ సందేశ్‌) అల్లరి అబ్బాయి. ఇంట్లో బాధ్యత‌లు వ‌దిలేసి… గాలికి తిరుగుతుంటాడు. తండ్రి (శుభ‌లేఖ సుధాక‌ర్‌).. `జీవితానికి ఓ ల‌క్ష్యం ఉండాలి` అని పోరు పెడుతున్నా ప‌ట్టించుకోడు. ఆ ల‌క్ష్యానికీ ఓ పర్పస్ ఉండాల‌ని వాదిస్తాడు వ‌రుణ్‌. రావు (రావు ర‌మేష్‌) గారి అమ్మాయి ప్రీతి (హాసిక‌) చుట్టూ రెండేళ్ల నుంచీ తిరుగుతుంటాడు వ‌రుణ్‌. కానీ వ‌రుణ్‌ని ప‌ట్టించుకోదు, `ప్రేమిస్తున్నా` అని చెప్పదు, `ప్రేమ లేద‌ని` అన‌దు ప్రీతి. త‌న వెనుక తిర‌గ‌డం ఆమెకూ ఇష్టమే. చివ‌ర‌కు ఏదోలా ప్రీతి ప్రేమ‌ను ద‌క్కించుకొంటాడు వ‌రుణ్‌. ప్రీతి మ‌న‌స్తత్వం వేరు… అభిప్రాయాల‌ను క్షణాల్లో మార్చుకొంటుంది. త‌న‌పై ఎవ‌రైనా కాస్త కేర్ తీసుకొంటే చాలు ఇష్టప‌డుతుంది. కాస్త నిర్లక్ష్యాన్ని కూడా భ‌రించ‌లేదు. వీరిద్దరి విష‌యం రావుకి తెలిసిపోతుంది. అప్పటిక‌ప్పుడు ప్రీతిని త‌న మేన‌ల్లుడికి ఇచ్చి పెళ్లిచేయాల‌నుకొంటాడు. ఏం చేయాలో తెలీక‌… వ‌రుణ్‌కి ఫోన్ చేస్తుంది ప్రీతి. `ఇద్దరం ఎక్కడికైనా లేచిపోదాం` అంటుంది. వ‌రుణ్ కూడా స‌రే.. అంటాడు. ఫ‌లానా బ‌స్‌లో ఉంటా. నీ స్టాప్ వ‌చ్చిన త‌ర‌వాత ఎక్కేయ్‌… అని చెబుతుంది. ప్రీతి చెప్పిన‌ట్టే బ‌స్ ఎక్కుతాడు వ‌రుణ్‌. అయితే… ప్రీతి మాత్రం రాదు. ప్లాన్ చేసిన ప్రీతి ఎందుకు రాలేదు? ఈలోగా ఏమైంది? ఇద్దరూ క‌లుసుకొన్నారా? లేదా? మ‌ధ్యలో వంద‌న (కోమ‌ల్ ఝా) క‌థేమిటి? అనేదే ఈ సినిమా.

ఎదిగీ ఎద‌గ‌ని వ‌య‌సులో, ప్రేమంటే తెలియ‌ని వ‌య‌సులో… యువ‌త‌రం క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డింది. కేరింగ్‌ నే ప్రేమ అనుకొంటున్నారు. కాస్త నిర్లక్ష్యాన్ని కూడా త‌ట్టుకోలేరు. ఈ ల‌క్షణాల‌న్నీ అమ్మాయిల్లో ఎక్కువగా క‌నిపిస్తాయి. క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌స్తే… ఆ ప్రేమ పునాదుల‌తో స‌హా కూలిపోతుంది. `ప్రియ‌తమా నీవ‌చట‌ కుశ‌ల‌మా` బేసిక్ లైన్ కూడా ఇదే. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ‌పై అమ్మాయిల‌కు ఉన్న అభిప్రాయాన్ని అద్దంలో చూపించే ప్రయ‌త్నం చేశారు. వ‌రుణ్‌-ప్రీతిల మ‌ధ్య వంద‌న‌ను తీసుకురావ‌డంతో ఇది ముక్కోణ‌పు ప్రేమ క‌థ రంగు పులుముకొంది. అయితే వ‌రుణ్‌-ప్రీతిల ప్రేమ‌కు, వ‌రుణ్‌-వంద‌న‌ల ప్రేమ‌కూ చాలా తేడా ఉంది. ఆ వ్యత్యాసమే ఈ క‌థ‌కు ఆయువు ప‌ట్టు.

త్రినాథ‌రావు న‌క్కిన మంచి క‌థే రాసుకొన్నాడు. కొన్ని స‌న్నివేశాలు బ‌లంగానే తీర్చిదిద్దాడు. అయితే నేరేష‌న్ చాలా స్లో. ఈత‌రం ప్రేక్షకులు గంట‌కు వంద కిలోమీట‌ర్ల వేగం కోరుకొంటున్నారు. ఈ సినిమా వంద గంట‌ల‌కు ఓ కిలోమీట‌ర్‌… అన్నట్టు న‌డుస్తుంది. `కొత్తబంగారు లోకం` కూడా బాధ్యత‌కు-ప్రేమ‌కూ ఉన్న వ్యత్యాస‌మే. అయితే అదెంత జోష్‌గా న‌డిచింది? అయితే ఆ వేగం ఈ సినిమాలో ఎక్కడా క‌నిపించ‌లేదు. వినోదానికి ఎక్కడా ఛాన్స్ లేదు. మెలోడ్రామాలో ముంచేద్దాం… అనే ధ్యేయంతో తీసిన సినిమా ఇది. ఎలాంటి క‌థ‌కైనా వినోద‌పు కోటింగ్ త‌ప్పని స‌రి. అయితే ఆ విష‌యాన్ని ద‌ర్శకుడు ప‌ట్టించుకోలేదు.

ఎడిటింగ్‌ చేసుకోద‌గిన స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే తీసిన ప్రతి స‌న్నివేశంపై మ‌క్కువ పెంచుకొనే ద‌ర్శకుడు క‌త్తెర‌కు ప‌నిచెప్పనీడు. అయితే ఆ ప్రేమే ఇలాంటి సినిమాల్ని ముంచేస్తాయి. ఈత‌రం ప్రేక్షకుల‌కు ఓపిక చాలా త‌క్కువ‌. ఎంత మంచి క‌థ చెప్పినా.. ఫ‌టా ఫ‌ట్ ధ‌నాధ‌న్ అంటూ లాగించేయాలి. గీతాంజ‌లి టైపు స్లో నేరేషన్ భ‌రించ‌లేరు. ఇక్కడా అదే త‌ప్పు జ‌రిగింది.

వ‌రుణ్ సందేశ్‌లో ఉన్న ఓ సంపూర్ణమైన న‌టుడు ఈ సినిమాతో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. త‌న లోపాల‌ను స‌రిదిద్దుకొంటూ… పాత్రని నిల‌బెట్టిన విధానం త‌ప్పకుండా ఆక‌ట్టుకొంటుంది. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లో అత‌ని ముఖ‌క‌వ‌ళిక‌లు బాగున్నాయి. సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ చాలా మార్పు వ‌చ్చింది. కోమ‌ల్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గానీ, ఆమెను చూసిన ప్రతిసారీ ఇరిటేష‌న్ వ‌స్తుంది. ప‌రిశ్రమ‌లో క‌థానాయిక‌ల‌కు కొర‌త ఉన్న వాస్తవ‌మే. మ‌రీ అందం, చందం, న‌ట‌న గిట‌న తెలియ‌ని క‌థానాయిక‌ల‌ను తెచ్చుకోవ‌డం వ‌ల్ల ప్రయోజ‌నం ఉండ‌దు. హాసిక న‌ట‌న బాగుంది. అమాయ‌క‌త్వం, ఏమీ తెలియ‌ని త‌నం ఉన్న అమ్మాయిగా హాసిక మంచి ఛాయిస్‌. రావు ర‌మేష్ త‌న‌కు అల‌వాటైన పాత్రలో న‌టించాడు. శుభ‌లేఖ సుధాక‌ర్‌లాంటి అనుభ‌వం ఉన్న న‌టుడిని తీసుకొంటే స‌న్నివేశాల్లో ఎంత డెప్తు వ‌స్తుందో, ఆసుప‌త్రి స‌న్నివేశం చూస్తే అర్థం అవుతుంది.

సంభాష‌ణ‌ల్లో డెప్తు క‌నిపిస్తుంది. `వ‌దిలేయ‌డానికి ఇది ప్రాణం కాదు, ప్రేమ‌`, `దూరం తెలియ‌క‌పోవ‌డం వేరు, ద‌గ్గర‌గా ఉండ‌డం వేరు`, `టైం రాదు, గ‌డిచిపోతుంది`లాంటి సంభాష‌ణ‌లు బాగున్నాయి. అదే పెన్నుతో పంటికింద రాళ్ళలాంటి మాట‌లూ రాశారు. `నా ఫిగ‌ర్‌కి ఏం త‌క్కువ‌. నన్ను చూసి కాలు మీద కాలు వేసుకోని మ‌గాడు ఉంటాడా`? అని క‌థానాయిక చేత ప‌లికించ‌డం, `ఆడు మ‌గాడే..` అని అన‌డం.. ఎబ్బెట్టుగా వినిపిస్తాయి. వ‌రుణ్ స్నేహితుడి అక్రమ సంబంధం ఎపిసోడ్ కూడా ఎడిట్ చేయ‌ద‌గిన‌దే. ఇలాంటి స‌న్నివేశాలు ఈ సినిమాలో ఉన్న ఫీల్‌ని చెరిపేసేలా చేశాయి.

అమ్మాయిల్ని దోషులుగా చూపించ‌డం కూడా మింగుడు ప‌డ‌ని విష‌య‌మే. `మోసం చేసిన అమ్మాయిల‌ను నాశ‌నం చేయాలంటే… రోజూ ఎన్ని వేల యాసిడ్ దాడులు జ‌రుగుతాయో` అని చెప్పడంలో ఆంత‌ర్యం ఏమిటి? ఆ త‌ప్పు క్లైమాక్స్‌లో స‌రిదిద్దుకొన్నారు. `అమ్మాయిలు గ్రేట్‌` అని బ‌ల‌వంతంగా చెప్పించారు. పాట‌లు థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే గుర్తుండ‌వు. ఫోటోగ్రఫీ మాత్రం బాగుంది. పాట‌ల కోసం విదేశాల‌కు వెళ్ళలేదు. గోదారి అందాల‌ను బ్యాంకాక్ బీచ్ కంటే గొప్పగా చూపించారు.

ద‌ర్శకుడు మంచి క‌థే రాసుకొన్నాడు. ఆ క‌థ‌లో బాధ్యత ఉంది. అయితే.. దాన్ని యువ‌త‌రానికి న‌చ్చేలా మాత్రం తీర్చిదిద్దలేక‌పోయాడు. కాస్త ఓపిక ఉండి, వ‌రుణ్ సందేశ్‌లోని కొత్త న‌టుడిని చూడాల‌నుకొంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5                                           – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version