రివ్యూ : అరవింద్ 2

aravind-2-telugu-movie-review

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5 | Click here for English Review

టైటిల్  :  అరవింద్ 2 (2013)
డైరెక్టర్ :  శేఖర్ సూరి
ప్రొడ్యూసర్ :  జి. ఫణీంద్ర, జి. విజయ్ చౌదరి
సంగీతం :  విజయ్ కురాకుల
ముఖ్యతారాగణం   శ్రీనివాస్, మాధురీలత, కమల్ కామరాజు, శ్రీనివాస్, అవసరాల.
విడుదల తేది  మార్చి 29 – 2013.

ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలియని అయోమయం, భయంతో అరుపులు, పరుగులు, దీనికి సరైన నేపథ్యంగా అడవి, కాస్త మంచి ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం వుంటే సరిపోతుందని అనుకొంటారు దర్శకులు. కథ, లాజిక్ లు సరియైన సన్నివేశాలు మాత్రం మిస్ కొడుతుంటాయి. దీనికి కారణం ఒక్కటే, లాజిక్ లు చూసుకుని, సన్నివేశాలు పెంచుకుంటూ వెళ్తే సస్పెన్స్ మెయింటెయిన్ చేయలేమో అన్న అనుమానం. చేయలేని బలహీనత. ఎ ఫిల్మ్ బై అరవింద్ తో మంచి థ్రిల్లర్ మేకర్ గా పేరు సంపాందించిన దర్శకుడు శేఖర్ సూరి ఇప్పుడు ఆ సినిమాతో ఏ మాత్రం సంబంధం లేని కథతో, ‘అరవింద్ 2’ పేరిట మరో సైకో థ్రిల్లర్ ను అందించాడు.

అరవింద్ 2 లో రెండు కథలున్నాయి. గోవా దగ్గర అడవుల్లోకి వెళ్లిన అయిదుగురు స్నేహితుల్లో నలుగురు మాయం కాగా, శ్రీ (శ్రీ) ఒక్కడే మిగలడంతో, అతగాడ్ని పోలీసులు అనుమానించి అరెస్టు చేస్తారు. అరెస్టయిన శ్రీ, మాయమైన తన స్నేహితురాలు దివ్య (అదోనిక) తండ్రి సాయంతో జైలు బయటకు వచ్చి అనుకోకుండా సినిమా డైరెక్టర్ (అవసరాల నాని) కళ్లలో పడి, సెకెండ్ హీరోగా సెలెక్ట్ అవుతాడు. ఫస్ట్ హీరో (కమల్ కామరాజ్), ఇద్దరు హీరోయిన్లు, నిర్మాత, మిగతా బృందం కలిసి గోవా దగ్గర అడవికే షూటింగ్ కు వెళ్ళడం రెండో కథ. ఇలా షూటింగ్ వెళ్ళినవాళ్ళు అక్కడ వరసపెట్టి హతమారుతుంటారు. ఇదంతా చేస్తున్నది ఓ సైకో అని తెలిసేసరికే ఇద్దరు హీరోలు, ఓ హీరోయిన్, డైరెక్టర్ మాత్రం మిగులుతారు. చివరకు వీరన్నా బతికారా? సైకో ఏమయ్యాడు, ఏమిటన్నది మిగిలిన కథ.

శేఖర్ సూరి దర్శకుడిగా, సాంకేతిక బృందం నుంచి, నటీనటుల నుంచి కావాల్సినది రాబట్టుకోవడంలో విజయం సాధించాడు. కానీ స్ర్కీప్టు ను సరైన విధంగా రూపొందించుకోలేకపోయాడు. ఎంత థ్రిల్లర్ అయినా, కేవలం రన్ అండ్ కిల్ వ్యవహారంతోనే సినిమా అంతా నడిపించేయడం, సస్పెన్స్ ను విప్పడంలో కానీ, లాజిక్ ను నిరూపించుకోవడంలో విఫలం కావడం అన్నవి అతగాడి వైఫల్యాలుగా చెప్పుకోవాలి ‘ఫ్రైడే ౧౩’ సినిమా నుంచి స్ఫూర్తిపొంది సైకో క్యారెక్టర్ డిజైన్ చేశానని నిజాయితీగా ఒప్పుకోవడం వరకు ఓకే. కానీ సైకో వ్యవహారం మరీ వన్ సైడెడ్ గా వుంది.

దాదాపుగా మృగంతో సమానం. కానీ తెలివితేటలు అపారం. హీరో, హీరోయిన్ సరే, మరి చంపిన వారి శవాల గుట్టలన్నీ పేర్చడం ఎందుకో తెలియదు. మరో అమ్మాయిలో తల్లిని చూడగలిగినవాడు అకారణంగా, ఏ ద్వేషం లేకుండానే చంపుకుంటూ పోవడం అంటే కాస్తయినా ఎక్కడో లాజిక్ లింక్ ఇవ్వాలి. ఈ బృందం, ఈ స్నేహితులు మినహా ఎవరికీ అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవడం ఏమిటో? ఇలా చాలా చాలా అనుమానాలు కలుగుతుంటాయి.

కానీ ఇన్ని అనుమానాలు, గోడ గెంతడాలు వున్నప్పటికీ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులు సినిమాను ఆద్యంతం (సెకండాఫ్ నిడివి విషయం పక్కన పెడితే) చూడగలిగేలా చేయగలిగాడు. రాజేంద్రబాబు ఫొటో గ్రఫీ, లొకేషన్లు బాగున్నాయి. దీనికి తగ్గట్టు విజయ్ కూరాకుల నేపథ్య సంగీతం కూడా బాగానే అమరింది. యూత్ కు సినిమా పట్టాలన్న ఉద్దేశంతో కావచ్చు. సినిమా ప్రారంభంలో ఓ ఎరోటిక్ సాంగ్ ను ఇరికించారు. ‘బూతు పండితేనే బాక్సులు నిండుతాయి’ అని సినిమాలో డైలాగ్ చెప్పించిన దర్శకుడు తాను కూడా అదే సూత్రాన్ని నమ్మే ప్రయత్నం చేశాడు.

నటీనటుల్లో అవసరాల శ్రీనివాస్, కమల్ కామరాజు ఓకె. శ్రీ మాత్రం తన తొలి సినిమా ‘ఈరోజుల్లో’ కన్నా డల్ అయ్యాడు. సినిమా ప్రారంభంలో డైలాగ్ మాడ్యులేషన్ కూడా మరీ ఎమెచ్యూర్ గా ఉంది. సినిమాలో అరవడం, పరిగెత్తడం మినహా చేయడానికి ఎవరికీ ఏమీ లేదు. కానీ చంపడాలు, చావడాలు, ముఖంలో భయాందోళనలు బాగానే చిత్రీకరించాడు. ఇందుకు సహకరించిన ఎడిటింగ్ సినిమా నిడివి విషయంలో మాత్రం తడబడింది. మొత్తం మీద కాస్త సన్నివేశాల్లో వైవిధ్యం, కథపై పట్టు ప్రదర్శించి ఉంటే మరో మంచి థ్రిల్లర్ అయి వుండేది. కానీ తప్పిపోయింది.

 

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5                                          – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 

Click here for English Version