విభజన జరగదు : లగడపాటి

Lagadapati Rajagopalరాష్ట్ర విభజన జరిగే ప్రసక్తే లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారన్నారు. చంద్రబాబు మనసు మార్చుకోవాలన్నారు. తెలంగాణపై ఈనెల 28న ఎటువంటి ప్రకటన రాదని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తెలంగాణపై ఎప్పుడు తీర్మానం పెట్టినా మెజార్టీ సమైక్యాంధ్రకే ఉంటుందని రాజగోపాల్ అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఏమీ తేల్చలేదన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా ఉండాలనే తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సమైక్యవాదంపై చంద్రబాబుకు కనువిప్పు కలగచేస్తామన్నారు. విభజన వార్తల్లో వాస్తవం లేదని, రాష్ట్ర విభజన ముమ్మాటికి అవాస్తవమని చెప్పారు.  కేసీఆర్‌కు దమ్ముంటే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పోటీ చేయాలన్నారు. ఈనెల 28న ఏమీ కాదు, రాష్ట్రాన్ని కేంద్రం విభజించదని ఆయన అన్నారు. పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ గెలిస్తే నేను సమైక్యాంధ్ర గురించి మాట్లాడను అని లగడపాటి అన్నారు. 2014 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతాయని లగడపాటి విశ్వాసం వ్యక్తం చేశారు.