చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతం, మొదలైన సంబరాలు !


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. కోట్ల మంది భారతీయుల ఎదురుచూపులు ఫలించాయి. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్‌ భారతావని ఉత్కంఠగా వేచిచూసింది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని ఉపరితలాన్ని తాకిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.

దక్షిణాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌ నుంచి ప్రధాని మోడీ లైవ్‌ను వీక్షించారు. విక్రమ్ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయిన వెంటనే శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చంద్రయాన్‌-3 విజయంతో నా జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు. చంద్రయాన్‌-3 ల్యాండింగ్ విజయవంతం కావడంతో దేశమంతా సందడి వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఇస్రో కి తమ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.