వరద బాధితులకు సేవలను ఒక సవాల్ గా తీసుకోవాలి

cbn-teleconference
వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, ఒక్కొ కిలో చొప్పున కందిపప్పు, పంచదార, 1 లీటర్ పామాయిల్, వెంటనే అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరదల వల్ల నెల్లూరు జిల్లాలో దెబ్బ తిన్న ప్రాంతాలను శ్రుక్ర, శని వారాల్లో ముఖ్యమంత్రి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేస్తూ తీవ్రంగా దెబ్బతిన్నమండలాల్లో 25 కేజీలు, మిగిలిన మండలాల్లో 10 కేజీల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ నిత్యావసర వస్తువులను బాధిత కుటుంబాలకు అందించేందుకు తగు రవాణా ఏర్పాట్లను తక్షణమే చేపట్టాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2 రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేసి, నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామ, మండల, జిల్లా స్థాయిలకు చెందిన 2,500 మంది అధికారులు, ప్రజాప్రతినిధులు, జన్మభూమి – మా ఊరు కమిటీ సభ్యులతో పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన ప్రజలందరకీ, ప్రభుత్వం వారి వెంట ఉన్నదన్న భావనను కల్పించే రీతిలో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకం కలిగి బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే రీతిలో సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై సహాయ చర్యలు ముమ్మరం చేశారన్నారు. జిల్లాకు కేటాయించిన సీనియర్ అధికారులతో సహా అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. అయితే సహాయ కార్యక్రమాల వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకం ఏర్పడాలని ముఖ్యమంత్రి సూచించారు.

తుపాను వల్ల పాడైన ప్రతి ఇంటికి నష్టపరిహారం వెంటనే అందేలా చూడాలన్నారు. పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధిక వర్షాల వల్ల గండ్లు పడిన చెరువులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆయా ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలో చేరిన నీటిని సమర్ధవంతంగా వినియోగించుకుని, ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించేందుకు ప్రణాళికలు రూపొందాంచాలన్నారు.