తెలంగాణాపై ప్రకటన రాదు : గంటా

ganta-srinivasa-raoఇటీవలే తన వ్యాఖ్యలతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తననోటికి పని చెప్పారు. అఖిల పక్ష భేటీలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పినట్టు ఈనెల 28న తెలంగాణపై ప్రకటన వెలువడదని అన్నారు. విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలే ప్రభుత్వాలు, పార్టీ కంటే ముఖ్యమని గంటా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో బలంగా ఉందని ఆయన తెలిపారు. వాయలార్ రవి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే మీరెన్ని సీట్లు ఇస్తారో చెప్పాలని అన్నారో… లేదో తనకు తెలియదని గంటా వ్యాఖ్యానించారు. తాను విహార యాత్రలకు లండన్ వెళ్లడం లేదని ఆయన తెలిపారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖలపై తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటా మాటలు అర్థ రహితంగా ఉన్నాయని పొన్నం ధ్వజమెత్తారు. కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆపాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన అన్నారు.

మరోవైపు గంటా పదేపదే చేస్తున్న ఈ వ్యాఖ్యలపై తెలంగాణా వాదులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఇప్పించిన చిరు అనుమతి లేకుండానే మంత్రి గంటా మాట్లాడే సాహసం చేస్తారా అని ప్రశ్నించుకుంటున్నారు. అన్నయ్యను ధిక్కరించే దమ్ము తమ్ముడు గంటాకి ఉందా అని గుసగుసలాడుకుంటున్నారు. కేంద్రమంత్రి స్థానంలో ఉన్నందున తాను ప్రత్యక్షంగా నోరు మెదపకుండా తెర వెనుకే ఉంటూ, తన విధేయుడైన మంత్రి గంటా శ్రీనివాస రావుతో ఈ విధంగా తన పలుకులను బయట పెట్టిస్తున్నాడంటూ తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీమాంధ్రలో తన ప్రాబల్యం పెంచుకునేలా పట్టుకోసం తెర వెనుక ఉండి పావులు కదుపుతున్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే కావాలనే చిరు తెర వెనుక ఉండి తన అనుచరులతో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.