కర్నూల్ లో హైకోర్టు బెంచ్ : నారా లోకేష్


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఆయన కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్నారు.

ఈ సమయంలో పాదయాత్ర చేస్తున్న నారాలోకేష్ ని పలువురు న్యాయవాదులు కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసారు. మేము చేసేది మాత్రమే చెప్తాం .. ఒకసారి చెప్పిన తర్వాత మాట తప్పము, తమది జగన్ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదని సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అలాగే ఇదే సమయంలో నారా లోకేష్ మరో వాగ్దానం కూడా చేసారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగు దేశం పార్టీనే అని, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ చేసిన ఈ కామెంట్స్ పై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై వైసీపీ నేతలు మాత్రమే కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. కర్నూల్ ని న్యాయ రాజధాని కాకుండా అడ్డుతగిలే మీ బాబు, కొడుకులు కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని చెప్తున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో హైలెట్ అవుతున్నాయి.