క్యూ లైన్లో నిలబడి ఓటు వేసిన లోకనాయకుడు..

వెండితెర ఫై లోకనాయకుడు గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ అందరితో సమానంగా క్యూ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పార్టీ అధ్యక్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌న కూతురు శృతి హాస‌న్‌తో క‌లిసి ఆల్వార్ పేట కార్పోరేష‌న్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అలాగే ఉదయం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వ‌చ్చారు. అజిత్‌, నటుడు అరుణ్‌ విజయ్‌ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 11 న జరుగగా..రెండో విడత పోలింగ్ ఈరోజు మొదలు అయ్యింది. మొత్తం 95 స్థానాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో పోలింగ్‌ జరగనుంది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దఫా ఓటింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్‌లో మొత్తంగా 1,600 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తంగా 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, అసోం, బిహార్‌, ఒడిశాల్లో 5 సీట్ల చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లలో 3 సీట్ల చొప్పున, జమ్మూకశ్మీర్‌లో 2 సీట్లు, మణిపూర్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ సీటుకు పోలింగ్‌ జరగనుంది.