రాజకీయాల్లోకి రంగీలా..

రాజకీయాల్లోకి సినీ తారలు రావడం..వెళ్లిపోవడం కామన్..ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ లో చేరడం..ఆ పార్టీ టికెట్ దక్కించుకోవడం..ఎన్నికల బరిలో నిలబడడం చేస్తుంటారు. గెలిస్తే ఒకే..ఓడిపోతే మళ్లీ రాజకీయాల్లో కనిపించారు. ఆలా ఇప్పటివరకు చాలామంది వచ్చి వెళ్లారు. తాజాగా సీనియర్ నటి రంగీలా ఫేమ్ ఊర్మిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఊర్మిళ మటోండ్కర్‌ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఊర్మిళ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు అంటున్నారు. ప్రస్తుతం ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గానికి భాజపా ఎంపీ గోపాల్‌ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భాజపాను ఓడించేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్‌.. ఊర్మిళ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అటు ఊర్మిళ నుంచి గానీ.. ఇటు కాంగ్రెస్‌ నేతల నుంచి గానీ అధికారిక సమాచారం రాలేదు. త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఊర్మిళ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అంతం, అనగనగా ఒక రోజు, గాయం లాంటి చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.