రివ్యూ : జబర్ దస్త్

jabardasth-movie-review

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5

మైనస్‌ పాయింట్ల మస్త్‌… జబర్‌ దస్త్‌

సినిమాకి కథ ముఖ్యం అంటారు కొందరు. కాదు కథనం బాగుంటే నడిపించేయొచ్చు అని ఇంకొందరు వాదిస్తారు. పాటలు, మాస్ మసాలా, థ్రిల్లింగ్ కలిగించేలా ఫైటింగులూ.. ఈ గోల ఎప్పుడూ ఉండేదే. అన్నింటికంటే ముఖ్యంగా సినిమాకి ‘ఒరిజినాలిటీ’ చాలా ముఖ్యమనే సంగతి మర్చిపోతున్నారు. ప్రతి సన్నివేశం ‘ఇది నా ఆలోచన’ అని దర్శకుడు గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకునేలా ఉండాలి. ‘అలా మొదలైంది’ చూసి అదే అన్నారు. ‘కొత్త దర్శకురాలైనా భలే తీసింది’ అని మొచ్చుకున్నారు. కథేం కొత్తది కాకపోయినా సీన్లు మాత్రం పరమ కొత్తవి. అందుకే ‘అలా మొదలైంది’ ఫస్టు క్లాసులోనూ, ఆ సినిమా తీర్చిదిద్దిన నందినిరెడ్డి డిస్టింక్షన్ లోనూ పాసైపోయారు. అచ్చం ఇలాంటి ఫలితాన్నే ‘జబర్ దస్త్’లోనూ ఆశిస్తారు. ఇది నందిని రెడ్డి రెండో సినిమా. తొలి సినిమా ఇచ్చిన నమ్మకంతో ధైర్యంగా ముందడుగు వేస్తుందని.. భావిస్తారు. మరి నందిని రెడ్డి ఏం చేసింది? హిట్టుతో ‘అలా మొదలైంది’ అనిపించుకొన్న నందిని దర్శకులను వెంటాడుతున్న ద్వితీయ విఘ్నం అనే గండాన్ని దాటగలిగిందా? చూద్దాం పదండి.

బైర్రాజు (సిద్దార్థ్)కి ఊరంతా అప్పులే. బీహార్ లో ఓ సేట్ (షాయాజీ షిండే) అప్పు ఎగ్గొట్టి హైదరాబాద్ లో వాలిపోతాడు. ఇక్కడా అప్పులు వెంటాడుతూనే ఉంటాయి. మరోవైపు శ్రియ (సమంత) కథ… తనకి బిజెనెస్ వుమెన్ అనిపించుకోవాలని కోరిక. ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ పెట్టి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది. శ్రియ, బైర్రాజు కొన్ని సినిమాటిక్ కారణాల వల్ల కలుస్తారు. ఇద్దరూ కలిసి ఓ కంపెనీ పెడతారు. మంచి పేరొస్తుంది. లాభాలొస్తాయి. ఓ ప్రమాదం నుంచి శ్రియను కాపాడి ఆమెకు దగ్గరవుతాడు బైర్రాజు. తన మనసులో మాట చెబుదామనుకొనేలోగా… బైర్రాజు నిజస్వరూపం బయటపడుతుంది. ఛీ కొట్టి వచ్చేస్తుంది. పార్ట్నర్స్ గా విడిపోతారు. సరస్వతి (నిత్యమీనన్) తో కలిసి మరో కంపెనీ మొదలుపెడతాడు బైర్రాజు. ఇంతకీ సరస్వతీ ఎవరు? శ్రియ ప్రేమ ఏమైంది? ఇద్దరూ కలిశారా? లేదా? అనేవే ‘జబర్ దస్త్’లోని ట్విస్టులు.

‘కాపీ రైట్’ అనే పదాన్ని సినిమా వాళ్లు ‘కాపీ కొట్టడం రైటు’ అన్నట్టు మార్చుకొన్నారు. వాళ్ల దృష్టిలో అదేం పెద్ద నేరమూ కాదు. ‘జబర్ దస్త్’ కూడా ఆ తానులో ముక్కే ! కథని టూకీగా చెబుతోంటే హిందీ సినిమా ‘బ్యాండ్ బాజా బారాత్’ గుర్తొస్తుంది. సన్నివేశాల్ని యథావిధిగా దించేస్తే ‘కాపీ’ అంటారని ఆ దారాన్ని పట్టుకొని పూసలు పేర్చుకొంటూ వచ్చింది నందిని రెడ్డి. అవైనా మేలిమి ముత్యాలా అంటే.. అన్నీ తీగ తెగిన బల్బుల్లా మాడిపోయినవి. ‘నోరు మూసుకొని అన్నం తిను’ అంటే ‘నోరు మూసుకొని అన్నం ఎలా తింటామ్ బే..’ అని కౌంటర్ వేయడం చెడ్డీలేసుకొన్నప్పటి నుంచీ వింటున్నదే. ఇలాంటి రిపేరు కొచ్చిన డైలాగులు కోకొల్లలు. ప్రారంభ సన్నివేశాలు ‘అలా మొదలైంది’ తాలూకు ఫ్రెష్ లుక్ లోనే సాగుతాయి. ఆ తరవాత ఆ టాలెంట్ ఏమైపోయిందో అర్థం కాదు. తెరపై కనిపించేవన్నీ రొటీన్ సన్నివేశాలే. వినోదం పేరుతో ‘నవ్వుతారా? లేదా? అంటూ బలవంతం పెట్టించేశారు. తెరపై అంతమంది హాస్యనటులు కనిపించినా.. వినోదం పండించలేకపోయారు.

పెళ్ళిళ్లూ, పేరంటాలూ చేయడం మినహా.. ప్రథమార్థంలో కథ సాగిందేమీ లేదు. నిత్యామీనన్ వచ్చాక కూడా కథ పరుగు పెట్టలేదు. మలేషియాలో సాగిన దావూద్ భాయ్ (శ్రీహరి) ఎపిసోడ్ శుద్ధ దండగ, శ్రీహరి, వెన్నెల కిషోర్ కాల్షీట్లు కథ రాసుకోకముందే తీసుకుని ఉంటారు. వాటిని ఎలా వాడాలో అర్థం కాక.. ఈ ఎపిసోడ్ జోడించినట్టు అనిపిస్తుంది. తెలుగు సినిమాపై కాసింత పరిజ్ఞానం ఉన్న వాడు కూడా క్లైమాక్స్ ముందే ఊహిస్తాడు.

సిద్దార్థ్ చలాకీగా నటించాడు. కాస్త ఓవర్ చేసినట్టు అనిపించినా… ఆమాత్రం హుషారు లేకపోతే బైర్రాజు పాత్ర నడవదు. చివర్లో మరోసారి ‘బొమ్మరిల్లు’ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చేతిని మెడకేసి రద్దుకొంటూ ‘అంతా మీరే చేశారు నాన్నా’ అనే డైలాగు గుర్తుచేస్తాడు. సమంత తొలిసారి శ్రుతి మించి నటించింది. సిద్దూని చూసిన ప్రభావమో ఏమో? తనది మాంఛి స్మెలింగ్ ఫేస్. అయితే అయిన దానికీ కాని దానికీ నవ్వుతూ చూస్తుంటే లేని పోని అనుమానాలొస్తాయి. నిత్యమీనన్ వచ్చాక సమంతని మర్చిపోతాం. నిత్య అంత క్యూట్ గా కనిపించింది. ఇక మిగిలిన గ్యాంగ్ గురించి చెప్పుకోవడం దండగ. శ్రీహరి చేసిన అతిథి పాత్రల్లో… ‘జబర్ దస్త్’ గురించి ప్రస్తావించక పోవడం మంచిది. తమన్ పాటల్లో బీటు ఎక్కువ. హాంటింగు తక్కువ. ఇకనైనా తమన్.. మన్ పెట్టి చేస్తే బాగుంటుంది. చిన్న సినిమానే అయినా.. రిచ్ గా కనిపించింది. ఫొటోగ్రఫికి మంచి మార్కులు పడతాయి.

‘అలా మొదలైంది’, ‘జబర్ దస్త్’ రెండు సినిమాల్ని తీసింది ఒక్కరే. కానీ ‘అలా మొదలైంది’ లో ఉన్నదీ ‘జబర్ దస్త్’లో లేనిది ఏమిటుంటే.. ‘ఒరిజినాలిటీ’. మనసులో వచ్చిన ఆలోచనను తెర మీద చూపించడానికి, వేరే వాళ్ల ఆలోచనని సన్నివేశంగా మలచడానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా విజయానికీ పరాజయానికీ ఉన్నంత తేడా. అది ఈ సినిమాలో కనిపించింది. ‘చంపేద్దాం’ అనేది బైర్రాజు ఊతపదం. ఆ పదం వాడినప్పుడల్లా… విన్నవాళ్లు ఉలిక్కిపడుతూనే ఉంటారు. ‘ఓ … హీరో.. ఊతపదమా?’ అంటూ రిలాక్స్ అవుతారు. కానీ అన్నంత పని చేశాడీ బైర్రాజు. థియేటర్లో రొటీన్ సన్నివేశాల్తో బ్యాండ్ వాయించేశాడు. ‘మైండ్ ని అడిగితే వద్దు అంటుంది – మనసుని అడిగితే కావాలి అంటుంది’ అంటూ ఓ సూపర్ డైలాగ్ చెప్పారీ సినిమాలో. ఈ సినిమాకి వెళ్లాలా? వద్దా? అనేది మాత్రం మనసుని కాకుండా మైండ్ ని అడగండి.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5                                 – స్వాతి                                                                                                                                  

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 Click here for English Version