రివ్యూ : కడలి

kadali-telugu-movie-review

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.75/5

‘కడలి’… సుడిగుండాలే తప్ప అలలూ, కెరటాలూ లేవు…

మణిరత్నం.. ఈ పేరు చాలు. సినిమాకి వెళ్ళడానికి. భాతతీయ సినిమా దిశ, దశ లను మార్చి… అందరినీ తన వైపు తిప్పుకున్న అద్భుత సృజనాశీలి. ప్రేక్షకుల అభిరుచులు వేరువేరైనా… వారందరూ మణి స్టైల్ కి తగ్గట్టు మౌల్డ్ అయిపోతారు. మణి నుంచి ఓ సినిమా వస్తుందంటే… తప్పకుండా ఏదో ఒక మ్యాజిక్ ఆశిస్తారు. ‘రావణ్‌’ లాంటి.. ఫ్లాప్ లు  అతని పై నమ్మకాన్ని  ఏ మాత్రం సడలించలేక పోయాయి. ‘కడలి’ కొచ్చిన ప్రచారం… ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని మణిరత్నం అభిమానులు ఎదురు చూసిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే… ‘కడలి’తో మణిరత్నం మళ్ళీ తన శైలి చూపించాడా? తన అభిమానులనైనా సంతృప్తి పరచాడా? లేదా? ఈ విషయాలు తెలుసుకుందాం పదండి..

అదొక క్రైస్తవ సంఘం. అక్కడ ఓ సైతాన్ ప్రతిరూపం బెర్గ్‌ లస్‌(అర్జున్) అల్లరి చిల్లరగా వ్యవహరిస్తుంటాడు. మంచితనం మూర్తీభవించిన శాం (అరవింద్ స్వామి) బెర్గ్‌ లస్‌ నిజస్వరూపం బయట పెట్టి.. అతన్ని అక్కడి నుంచి బయటకు పంపిస్తాడు. ‘ఎప్పటికైనా నీపై ఇంతకింత పగ తీర్చుకుంటా’ అని ప్రతిన బూని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బెర్గ్‌ లస్‌. కట్ చేస్తే… శాం ఓ చర్చ్ కి ఫాదర్ గా మారతాడు. బెర్గ్‌ లస్‌ స్మగ్లింగ్ ముఠా నాయకుడు మీసాల సామిగా మారతాడు. శాం… ధామస్ (గౌతం కార్తీక్) అనే అనాధను చేరదీసి… ఓ ప్రయోజకుడిగా మారుస్తాడు. కొంత కాలానికి మీసాల సామిని  ఓ ప్రమాదకరమైన  స్థితి నుంచి కాపాతాడు శ్యాం. కానీ… మీసాల సామి తన బుద్ధి పోనిచ్చుకోడు. తన పగ తీర్చుకునే అవకాశం గురించి ఎదురు చూస్తాడు. అది ఏ రూపంలో దొరికింది? థామస్ ని మీసాల సామి తన వైపుకు ఎలా తిప్పుకున్నాడు? మధ్యలో రాధ కూతురు తులసి, మంచు లక్ష్మి పాత్రలు ఈ కధలోకి ఎలా ప్రవేశించాయి? అనేవి ఈ కధలో కీలకమైన విషయాలు.

రామాయణం కధనే కాస్త అటూ, ఇటూ తిప్పుకుని చూపిస్తాడు.. అని మణిరత్నం పై ఓ విమర్శ వుంది. వారికి మరో సారి దొరక్కుండా ఈసారి… మణిరత్నం బైబిల్ ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే… ‘కడలి’లో అంతా క్రైస్తవ వాతావరణమే కనిపిస్తుంది. ఆమీన్, స్త్రోత్రం, ప్రభువు, బిడ్డా, పాపులు.. ఇలాంటి మాటలే ఎక్కువ వినిపిస్తూ వుంటాయి. సైతాన్ లక్షణాలు ఉన్న ఓ స్మగ్లర్ కీ,  దేవుడి ప్రతిరూపమైన ఓ చర్చ్ ఫాదర్ కీ మధ్య జరిగిన  కధ ఇది.  సైతాన్ ముందు గెలిచినట్టే అనిపిస్తుంది కానీ… అంతిమ విజయం దైవానిదే. ఈ సినిమా లోనూ అదే చూపించారు. ఎంత గొప్ప దర్శకుడైనా కధ సరిగ్గా లేకపోతే బోల్తా పడాల్సిందే. ఈ విషయంలో మణిరత్నం కుడా మినహాయింపు లేదు.  అర్జున్, అరవింద్ స్వామి పాత్రలే ఈ సినిమాకు ప్రధాన బలం. అయితే… ఆ పాత్రల మధ్య సరైన సంఘర్షణ సృష్టించడంలో మణి విఫలమయ్యాడు. అర్జున్…. అరవింద్ స్వామి పై పగ పెంచుకున్న సందర్భం అతకలేదు. ఇటు… వీరిద్దరి పగనీ.. అటు ప్రేమ జంట కథనీ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక పోయాడు. మంచు లక్ష్మి పోషించిన పాత్రకు మరింత ప్రాధాన్యం ఇస్తే బాగుండేది.

అర్జున్, అరవింద్ స్వామీ తమ అనుభవాన్ని ఉపయోగించుకుని అల్లుకుపోయారు. ఎక్కువ మార్కులు అర్జున్ కే పడతాయి. గౌతం కార్తీక్‌ నటన చాలా సహజంగా వుంటే.. అందుకు విరుద్ధంగా వుంది తులసి ప్రతిభ. తులసి పాత్ర కాసేపు అమాయకంగా, ఇంకాసేపు పిచ్చిదానిలా చూపించారు. సాధారణంగా మణిరత్నం సినిమాల్లో కధానాయిక పాత్ర కు చాలా ప్రాధాన్యం వుంటుంది. ఈ సినిమాలో మాత్రం.. ఆమె పాత్ర సాదా సీదాగా చూపించారు. తులసి కొన్ని ఫ్రేముల్లో చూడడానికి బాగానే వున్నా….చాలా సందర్భాలలో తేలిపోయింది.

సాంకేతికంగా మణి సినిమాలకు వంక పెట్టలేం. సంగీతం, ఫోటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో వున్నాయి. రెహమాన్ పాటలు, ఆర్.ఆర్ లేని వుత్సాహాన్ని తీసుకొచ్చాయి. సముద్రాన్ని సినిమా అంతా… చాలా అందంగా చూపించారు. 90 శాతం అక్కడే చిత్రీకరణ జరిగింది… పాటలతో సహా. పాటలను చిత్రీకరించిన విధానంలో ‘సఖీ’, ‘దిల్ సే’ చాయలు కనిపిస్తాయి. పతాక సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. ఆ సమయంలో సన్నివేశాలకు తగినట్టు సముద్రాన్ని చూపించిన విధానం మణి శైలిని గుర్తుకు తెస్తుంది.

అక్కడక్కడ మాత్రం ‘ఇది మణిరత్నం సినిమా’ అని గుర్తొస్తుంది. అది మినహా… ‘మణి  ఇలాంటి కధ ఎంచుకున్నాడేమిటి?’ అనే సందేహాల మధ్య… సినిమా చూడాల్సి వస్తుంది. ఓ బలమైన సామాజిక అంశాన్ని ఏదోలా కధలోకి తీసుకు వచ్చి.. ఆ సినిమాకు ఓ అర్ధాన్ని, కధకు పరమార్ధాన్ని కల్పించే మణి… ఈ సినిమా విషయంలో అలా ఆలోచించలేదు. ఈ సినిమాలో మణి తాలూకు సంగీతం, ఫోటోగ్రఫీ, టేకింగ్ అన్నీ వున్నాయి. ‘ఫీల్’ తప్ప. ఓ సాయంత్రం సరదాగా ‘కడలి’ చూద్దామని వెళితే… అలలూ, కెరటాలూ లేని సముద్రం దర్శనమిస్తే ఎలా వుంటుంది? అచ్చం ఈ ‘కడలి’ చిత్రం కూడా అలా వుంది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.75/5                                                                                 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version