రివ్యూ : మిర్చి

mirchi-telugu-movie-review

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.5/5

ప్రభాస్ ఖాతాలో మరో హిట్ 

కథని స్టైలిష్ గా చెప్పాలా? మాస్ కి నచ్చేలా తీర్చిదిద్దాలా? హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే – విలనిజం మరింత గొప్పగా చూపించాల్సిందేనా? యాక్షన్ ఉన్న సినిమాల్లో ఫ్యామిలీ డ్రామాకు చోటు ఇవ్వలేమా?… ఓ కథ రాసుకొన్నప్పుడు ఇలాంటి సవాలక్ష సందేహాలు వెంటాడుతుంటాయి. ఒకటి కావాలంటే మరోటి వదులుకోవాల్సిన పరిస్థితి. స్టైల్ కీ, మాస్ కీ మధ్య – యాక్షన్ కీ ఫ్యామిలీకి మధ్య ఊగిసలాడిన కథ చివరికి ఎవరికీ కాకుండా ఒంటరిగా మిగిలిపోతుంది. నిజానికి కథలో దమ్ముండాలే గానీ (అది పాత కథే అయినా)
అందరికీ నచ్చేలా చూపించొచ్చని ‘మిర్చి’ రుజువు చేసింది. స్టైల్, మాస్, ఫ్యామిలీ, యాక్షన్, గ్లామర్.. ఇవన్నీ మిళితమైన ఓ ఫుల్ మీల్స్ అందించింది. ‘రెబల్’ దెబ్బతో – యువ హీరోల రేసులో కాస్త వెనుకబడిన ప్రభాస్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడనగానే అభిమానుల్లో కాస్త టెన్షన్. సినిమా ఎలా ఉంటుందో అన్న ఉత్సుకత. మరోవైపు ప్రచార చిత్రాలు, పాటల జోరు. వీటన్నింటి నడుమ ‘మిర్చి’ వచ్చేసింది. ఈ మిరపకాయ్ ని కొరికి చూస్తే…

ఇటలీలో అర్కెటెక్ట్ గా పనిచేస్తుంటాడు జై (ప్రభాస్). ‘ప్రేమిస్తే పోయేదేముంది? మహా అంటే తిరిగి ప్రేమిస్తారు’ అనే కాన్సెప్ట్ జైది. జీవితం ఒక్కటే. దాన్ని ఎందుకు కష్టపెట్టడం? అనేది అతని ఫిలాసఫీ. అది నచ్చే మానస(రిచా గంగోపాధ్యాయ) జైకి మనసిచ్చేస్తుంది. జై తో ఉంటే ఆమెకు నిత్యం సంతోషమే. కానీ ఈ ఆనందం కలకాలం ఉండదు. ఎందుకంటే తను ఊరెళ్లిపోవాలి. అక్కడ కక్ష్యలూ, కార్పణ్యాలే. ప్రేమకు చోటు లేదు. అందుకే ‘నువ్వునాకు దూరంగా వెళ్లిపో జై…’ అని చెబుతుంది. జై తిన్నగా మానస ఊరికే వస్తాడు. అక్కడ ఒకొక్కరి మనసూ మార్చేస్తాడు. ప్రేమ రుచి ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఆ ఇంట్లో అందరినీ తనవైపుకు తిప్పుకొంటాడు. ‘మా మానసకు నువ్వే సరైన తోడువి..’ అని ఆ ఇంట్లోవారిచేతే అనిపిస్తాడు. కానీ ఈ పెళ్లికి జై సిద్ధంగా లేడు. దానికి కారణం ఏమిటి? ఇంతకీ జై ఎవరు? ఈ ఇంటికి ఎందుకొచ్చాడు? అనేది ఈ కథలో కీలకమైన మలుపు.

‘ప్రేమిస్తే పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు…’ ఇది ఈ సినిమాలో జై చెప్పే డైలాగ్. నిజానికి ఈ కథ ప్రాణం పోసుకొన్నదే ఈ మాట చుట్టూ. పగతో రగిలిపోయే రెండు కుటుంబాల మధ్య ప్రేమ చిగురించేలా చేసే ఓ వారధి కథ ఇది. ఈ సినిమాకి ముందు అనుకొన్న టైటిల్ ఇదే.. ‘వారధి’ ఈ కథకు అక్షరాలా నప్పే పేరు ఇదే. కానీ మాస్ ని మెప్పించడానికి ‘మిర్చి’ అని పెట్టారు. అందుకే ఆ కారం, ఘాటు కావల్సిన మోతాదులోనే దట్టించారు.

‘మిర్చి’ కథలో ‘బిందాస్’ సినిమా పోలికలు కొన్ని కనిపిస్తాయి. ‘బిందాస్’ కథలో ఓ స్టార్ హీరో ఎంట్రీ ఇస్తే ‘మిర్చి’ తయారవుతుంది. అలాగని కొరటాల శివ ప్రతిభను తక్కువ చేయవలసిన అవసరం లేదు. ఈ కథకు కొరటాల శివ ఇచ్చిన ట్రీట్ మెంట్… మహా కొత్తది కాకపోయినా ‘ఫ్రెష్’ అనే ఫీలింగ్ తెస్తుంది. చాలా సన్నివేశాల్లో దర్శకత్వ ప్రతిభ కనబడుతుంది. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశమే అందుకు నిదర్శనం. అక్కడ ఓ భారీ ఫైట్ చూపించి… కథని అందరిలానే ప్రారంభించొచ్చు కానీ.. ‘నేను కొడితే ఇలా ఉంటుంది…’ అని జై చేత పలికించి.. రౌడీ గ్యాంగ్ వెన్నులో ఒణుకు పుట్టించాడు. ‘కొన్ని కటౌట్ చూసి నమ్మేయాలి డూడ్..’ అంటూ ప్రభాస్ పలికేది ఇక్కడే. మాటలతోనే ఫైట్ చేయించి – నిర్మాతకు కొన్ని డబ్బులు మిగిల్చాడు. అక్కడే కొరటాల శివ మార్కులు కొట్టేశాడు. రచయిత దర్శకుడు అయితే చాలా సౌలభ్యాలుంటాయి. సన్నివేశాన్ని ఇంకాస్త బాగా పాలీష్ చెయ్యొచ్చు. శివ అదే చేశాడు. మాటలతోనే కొన్ని సన్నివేశాల్ని ఎలివేట్ చేయగలిగాడు. ‘నువ్వు మా ఊరు రావాలంటే.. స్కెచ్ వేసుకొని రావాలి. నేను హ్యాంగర్ కి తగిలించిన షర్ట్ వేసుకొస్తే చాలు..’ అనే డైలాగే ఓ మినీ ఫైట్ లా ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్ కత్తిపట్టి భీభత్సాలు చేసింది తక్కువే. కత్తి పట్టాల్సిన చోట కూడా – కూల్ గా కనిపించాడు. జై పాత్ర అక్కడే ఎలివేట్ అయింది. ప్రభాస్ చాలా సెటిల్డ్ గా నటించాడు. ఎక్కడ ఎంత చేయాలో… అంతే చేశాడు. మాస్ ని మెప్పించే నేర్పు ప్రభాస్ కి ‘ఛత్రపతి’ నాడే వచ్చేసింది. ‘డార్లింగ్’తో ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. వీరిద్దరినీ ఈ సినిమాతో మరోసారి తన రూట్లోకి తెచ్చుకున్నాడు. మాస్ ఇమేజ్ ఉన్న ఓ కథానాయకుడు…. అందరికీ నచ్చే సినిమా చేస్తే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. అది ‘మిర్చి’ నిరూపించింది. పతాక సన్నివేశాల్లో ప్రభాస్ నటన మరింత బాగుంది. అతనిలో ఎదుగుతున్న నటుడికి ఆ సన్నివేశాలే నిదర్శనం. కథానాయికల్లో అనుష్కకే ఎక్కువ మార్కులు పడతాయి. అల్లరి అమ్మాయిగా తనకు అలవాటైన దారిలో నడిచింది. ఎప్పుడూ మైనస్ మార్కులే తెచ్చుకొనే రిచా.. ఈ సినిమాలో మాత్రం ఆ గండం దాటేసింది.

దేవిశ్రీ ప్రసాద్ ఉంటే ఆ జోషే వేరు. కథకి హైప్ ఎలా తీసుకురావాలో బాగా తెలుసు. ట్యూన్ పాతదే అయినా.. ఆ జోష్ మాత్రం ఎప్పుడూ సరికొత్తగానే ఉంటుంది. పాటలన్నీ మూడ్ పెంచడానికి దోహదం చేశాయి. ‘మిర్చిలాంటి కుర్రాడే’ పాట హఠాత్తుగా మొదలై.. అంతే హడావుడిగా పూర్తయ్యింది. ఇంకో చరణం ఉన్నా
బాగుండేది. వినోదం పంచే బాధ్యత ఈసారి బ్రహ్మానందం చూసుకున్నాడు. ఈ మధ్య బ్రహ్మి గోల చేయకుండా నవ్వించిన సినిమా ఇదేనేమో?! ఆయన పాత్ర పేరుకి తగ్గట్టే వీరప్రతాపం చూపించారు. కథలో, కథనంలో కొన్ని లొసుగులున్నాయి. ఫస్టాఫ్ లో కథ నడవదు. సెకండాఫ్ అంతా ఫ్లాష్ బ్యాకే. అదయిపోయాక సడన్ గా
సినిమా అయిపోతుంది. స్ర్కీన్ ప్లే లో లోపమే ఇదంతా. అనుష్క చదువుకోని అమ్మాయిలా చూపించారు. కానీ ప్రభాస్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంది. అదెలా సాధ్యం?! కక్ష్యలూ, కార్పణ్యాలూ, కత్తులు, గొడవల కథ అనగానే మనవాళ్లు ఒకే ఇంటిని చూపిస్తారు. కాలం మారుతున్నా ఆ వాతావరణం ఛేంజ్ చేయరా? ఇలాంటిచిన్న చిన్న లొసుగులు మర్చిపోగలిగితే ‘మిర్చి’ పవర్ ఫుల్ గానే కనిపిస్తుంది.

ప్రభాస్ స్టామినా, దేవిశ్రీ సంగీతం, దర్శకుడి ప్రతిభ ఇవి మూడూ మిర్చికి మూల స్థంభలు. మాస్ కి నచ్చిన దారిలోనే వెళ్లి కారం పంచుతూ, కుటుంబ మమకారం కూడా చూపించిన ‘మిర్చి’ ఇది. ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడిపోయినట్టే!

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3.5/5                                 – స్వాతి                                                                                                                                     

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version