రివ్యూ : ఒంగోలు గిత్త

ongole-gitta-telugu-movie-review1

తెలుగుమిర్చి రేటింగ్‌ 2/5    

ప్రేక్షకులను కొమ్ములతో కుమ్మేసిన ‘ ఒంగోలు గిత్త ‘:

చదువురాకముందు ‘కాకరకాయ్’ వచ్చాక ‘కీకరకాయ్..’ అన్నాడట వెనుకటికొకడు. ‘మంచి దర్శకులు..’ అనిపించుకొన్న కొంతమంది తిరోగమన దిశగా వెళ్తుంటే… బాధ, జాలి పడడం తప్ప ఏం చేయగలం?! ‘బొమ్మరిల్లు’ తీసి… ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా మార్చుకొన్న భాస్కర్ ని చూస్తుంటే ఇలాంటి భావనలే చుట్తుముడుతున్నాయి. ‘బొమ్మరిల్లు’ చూసిన తరవాత అందరూ ‘అహో.. భాస్కరా’ అని తెగ పొగిడేశారు. ‘పరుగు’ చూసి ‘ఫర్లేదులే..’ వరకూ దిగారు. ఇంత మంచి పేరూ.. ‘ఆరెంజ్’ తో మడతడిపోయింది. భాస్కర్ తనలోని మాస్ మహరాజాని, ఓ కమర్షియల్ డైరెక్టర్నీ జాయింటుగా బయటకు తీసుకురావాలని ప్రయత్నించాడు. అందుకే రామ్ ని ‘ఒంగోలు గిత్త’గా రంగంలోకి దింపాడు. ‘ఆరెంజ్’ తో రేంజ్ పడిపోయిన భాస్కర్ ఇమేజ్ – ‘ఒంగోలు గిత్త’తో తిరిగి వచ్చిందా..? లేదంటే, ఆరెంజే బాగుంది అనిపించిందా? ఈ వివరాలు తెలియాలంటే గిత్తలా… రివ్యూలోకి దూకాల్సిందే.

అది ఒంగోలు మార్కెట్ యార్డ్. ఆదికేశవులు (ప్రకాష్ రాజ్) ఆ మార్కెట్ యార్డ్ కి ఛైర్మెన్. పైకి మంచి వాడిలా నటించే పరమ దుర్మార్గుడు. తన నటనతో.. మార్కెట్ యార్డ్ లో మంచి పలుకుపడి, పేరూ తెచ్చుకొంటాడు. అతన్ని అక్కడ కదిపేవాడే లేడు. మార్కెట్ యార్డ్ ని ప్రస్తుతం ఉన్న స్థలం నుంచి.. వేరొక స్థలంలోకి మారిస్తే రూ. 200 కోట్లు సంపాదించుకోవచ్చు అని ఆశ పడతాడు. కానీ…వైట్ (రామ్) అడ్డుపడతాడు. వైట్ అతని ముద్దు పేరు. మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పదవి బరిలో తానూ దిగుతాడు. ‘పదవి వదులుకోవాలంటే.. నీ కూతుర్ని (కృతి) ఇచ్చి పెళ్లి చెయ్..’అని షరతు విధిస్తాడు. దానికి ఆదికేశవులు ఒప్పుకొంటాడు. కూతురితో పాటు ఆ మార్కెట్ యార్డునీ తన సొంతం చేసుకోవాలని వైట్ ఆలోచన. మార్కెట్ యార్డే కాదు… కూతురు కూడా వైట్ కి దక్కకూడదనేది ఆదికేశవులు పంతం. మరి వీటిలో ఏది జరిగింది? ఎవరు గెలిచారు? వైట్ అసలు పేరేంటి? అతను ఒంగోలు ఎందుకొచ్చాడు? అతని వెనుక ఎవరున్నారు? ఈ విషయాల సమాహారమే ‘ఒంగోలు గిత్త’

రామ్ కి మాస్ పాత్రలూ, కథలూ కొత్త కాదు. కానీ.. భాస్కర్ మాత్రం ‘మాస్’ని టచ్ చేయాలనుకోవడం ఇదే తొలిసారి. మాస్ కథల్తో పెట్టుకొంటే ఎలా ఉంటుందో.. భాస్కర్ కి అర్థమయ్యే ఉంటుంది. మాస్ సినిమా అంటే… మాటల్లో నాటుదనం ఉండాలి. ప్రతి పాత్ర చేతిలో ఓ మందు బాటిల్ పెట్టాలి, నాటు స్టెప్పులు వేయించాలి అనే భ్రమల్లోనే ఉన్నారు. ఆ జాబితాలో భాస్కర్ చేరిపోయాడు. కొత్త కథ రాసుకొనే సాహసం చేయలేక… ఫార్ములా దారిలోనే నడిచాడు. కథగా ఇదో రివైంజ్ డ్రామా. కాకపోతే… ఆ పాత కథని తీసుకొచ్చి ఒంగోలు మిర్చి యార్డ్ లో పడేశాడు. కథానాయకుడు, కథానాయిక, ప్రతి కథానాయకుడు.. ఇలా ప్రతి పాత్రకూ ఓ సెపరేట్ క్యారక్టరైజేషన్ ఇచ్చాననుకొని భ్రమ పడుతూ కథని బరబర ఈడ్చుకొంటూ క్లైమాక్స్ కి తీసుకొచ్చాడు. తీరా శుభం కార్డు పడేటప్పటికి చూస్తే… ప్రకాష్ రాజ్ పాత్రతో పాటు ప్రేక్షకులకీ పిచ్చెక్కిపోతుంది.

మిర్చి యార్డులో రాజకీయాలు, రామ్ అల్లరి, కృతి కర్బందతో ప్రేమాయణం…. వీటి మధ్య టేకాఫ్ బాగానే ఉన్నా, సినిమా గడుస్తున్నకొద్దీ ప్రేక్షకుల సహనం కాస్త కాస్త నశిస్తూ ఉంటుంది. ఇదిచాలదన్నట్టు మధ్యలో ప్రకాష్ రాజ్ పిచ్చి కోపంతో.. ఒంటిమీద బట్టలన్నీ తీసేసి.. నగ్నంగా దర్శనమిస్తుంటాడు. ఒక్కసారి కాదు.. కనీసం అరడజను సార్లు ప్రకాష్ రాజ్ దిగంబర స్వరూపాన్ని చూడాల్సిందే. అసలు ప్రకాష్ రాజ్ ని నగ్నంగా చూపించడంలో ఆంతర్యం ఏమిటి? విలనిజంలో కొత్త కోణమా? లేదంటే దర్శకుడు తన అరవ టాలెంటు చూపించేయాలని తపించాడా? అరవ అంటే గుర్తొంచ్చింది. సినిమా అంతా.. ఆ గోలే ఎక్కువ. ప్రకాష్ రాజ్, ప్రభు పాత్రలు ప్రవర్తించే తీరు, వాటి మాట, అక్కడ గోల… అంతా ఓ తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో రామ్ కనిపిస్తాడు కాబట్టి సరిపోతుంది. లేదంటే డబ్బింగ్ సినిమానేమో..? అనే అనుమానం వచ్చేసేది.

కృతి కర్బందకు ఓ వ్యక్తిత్వం, వివేకం సొంత అభిప్రాయం ఇవేమి లేనట్టు చూపించారు. ‘బొమ్మరిల్లు’లో హాసిని సృష్టికర్త ఈ భాస్కరేనా? అనే అనుమానం వేస్తుంది. కృతి కూడా జెనీలియాలా ఫీలైపోయి ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది. అసలు.. ఈ సినిమాలో ఓవర్ యాక్షన్ చేయంది ఎవరు? రామ్ తో సహా… అందరూ గీత దాటి ప్రేక్షకుల చేత హాహాకారాలు చేయించినవారే. నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య విరామం వస్తే… అబ్బాయి, అమ్మాయీ ఏమేం చేసుకోవాలో.. రామ్ కృతి చెవిలో చెబితే బాగుండేది. కానీ.. రమాప్రభ చెవిలో ‘టిఫిన్లు చేసుకోవాలి, వీలుంటే భోజనాలు కానిచ్చేయాలి..’ అని తెగ ఊదేస్తాడు. దానికి రమాప్రభ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూడాలి. ‘ఓరి భగవంతుడా?’ అనిపిస్తుంది. అలీ ఎంట్రన్స్, ఆడ వేషంలో చేసే అల్లరి… ఇవన్నీ నానా రభసగా తయారయ్యాయి. సినిమా ఎప్పుడైపోతుందో.. అంటూ వాచ్ చూసుకోవడమే మనం చేయగలిగింది.

రామ్ మాటిమాటికీ పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం ఇష్టంలేక ఈసారి రవితేజని ఎంచుకొన్నాడేమో అనిపిస్తుంది. ఈ తరహా కథల్లో రవితేజ ఎలా నటిస్తాడో.. రామ్ కూడా అదే చేశాడు. ప్రకాష్ రాజ్ నటన శ్రుతి మించినట్టే అనిపిస్తుంది. ఇక మిగిలినవారి గురించీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాటల్లో సాహిత్యం వినిపించినా.. అదేమంతా గొప్పగా లేదు. రామ్ యథావిథిగా నృత్యాల్లో కొత్తదనం కోసం ప్రయత్నించాడు. సినిమా రిచ్ గా ఉన్నా, తెరపై కనిపించే సన్నివేశాల్లోనే సరుకు లేదు. మొత్తానికి ఇదో సాదా సీదా మాస్ సినిమా. భాస్కర్, రామ్ ఇద్దరూ తమ కథల ఎంపికలో దోషాల్ని వెతికి బయటకు తీసుకొచ్చిన సినిమా. మాంఛి ఎండాకాలం.. మిర్చియార్డ్ లో చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. అందుకే ప్రేక్షకుల్ని కష్టపెట్టారు. మిర్చియార్డు మంట… థియేటర్లలో సీటు కింద వరకూ పాకేసింది. టోటల్‌ గా ఈ సినిమాతో మంటెక్కిపోయింది.

 Click here for English Version

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2/5                                                                                 – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.