రివ్యూ : పిజ్జా

రివ్యూ : పిజ్జా 

Pizza movie review

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5 

నటీనటులు : విజయ్‌ సేతుపతి, రంయ నంబీశన్‌, వీర సంతానం, జయకుమార్‌ తదితరులు
సంగీతం : సంతోశ్‌ నారాయణ్‌
నిర్మాత : సురేశ్‌ కొండేటి
దర్శకత్వం : కార్తీక్‌ సుబ్బరాజ్‌

నిజంగానే భయపెట్టిన పిజ్జా :

దెయ్యం కథలెలా ఉంటాయ్? అనగనగా ఊరికి దూరంగా ఓ పాతబడిన బంగ్లా. చుట్టూ స్మశానంలాంటి వాతావరణం. కొత్తగా పెళ్లైన ఓ జంట ప్రపంచంలో వేరే ఇల్లే లేనట్టు అందులోనే కాపురానికి దిగుతుంది. అక్కడి విచిత్రమైన శబ్ధాలూ, నానా గందరగోళం, భయాలు, తాయెత్తులూ, నిమ్మకాయలూ, ఒకరి నీడను చూసి మరొకరు జడుసుకోవడాలూ, భూతవైద్యుడూ.. అంటూ రెండుగంటల పాటు లాగించేసి, దెయ్యాన్ని కనిపించీ.. కనిపించనట్టు చూపిస్తూ- చివరికి ‘దెయ్యం లేదు, గియ్యం లేదు.. అంతా మనం భయం నాయనా..’ అని ఓ ముక్క చెప్పి బయటకు పంపించేస్తారు. ఇలాంటి ఫక్తు కథలకు ఆద్యుడు.. రాంగోపాల్ వర్మ. ఆర్ ఆర్ ని అతిభయంకరంగా వాడేయడమే హారర్ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. దురదృష్టవశాత్తూ వర్మ శిష్యులు, అనుచరులు, భక్తులూ అదే దారిలో నడిచారు. క్రమంగా ఇలాంటి కథలపై రోత పుట్టేసింది. ఈ క్రమంలో మరో సినిమా వచ్చింది అదే ‘పిజ్జా’. పైన చెప్పుకొన్న ఫక్తు సూత్రాల్లో పాతబడిన బంగ్లా ఒక్కటే ఇందులో కనిపిస్తుంది. దాని చుట్టూ అల్లుకున్న ప్లేవర్ మాత్రం పూర్తిగా వేరు. పిజ్జా రొటీనే అయినా ఛీజ్‌ & టాపింగ్‌ మార్చుకొన్నట్టు – సరికొత్త రుచులతో మేళవించి.. ఓ హారర్ కథ తయారు చేశాడు దర్శకుడు. అతను వండి, వడ్డించిన ఈ ‘పిజ్జా’లో ఏముంది? ఎవరికి నచ్చుతుంది? అనే విషయాల్లోకి వెళ్దాం.

అను (రమ్య నంబీశన్) సైకాలజీ విద్యార్థిని. దెయ్యం కథలంటే చాలా ఇష్టం. హారర్ సినిమాలు ఎక్కువగా చూస్తుంది. ఆ ప్రభావంతో ఓ నవల కూడా రాస్తుంది. అను, మైఖేల్ (విజయ్ సేతుపతి) ఇద్దరూ ప్రేమించుకొంటారు. మైఖేల్ పిజ్జా సెంటర్లో పనిచేసే ఓ చిరుద్యోగి. అతనికి దెయ్యాలంటే నమ్మకం లేకపోయినా అను మాటలతో అలాంటి శక్తులు ఉంటాయనే విషయం గ్రహిస్తాడు. ఓసారి ఆత్మల ప్రభావం ఎలా ఉంటుందో కళ్లారా చూస్తాడు. తన యజమాని కూతురిని నిత్య అనే ఆత్మ కబళిస్తుంది. భూతవైద్యుడిని తీసుకొచ్చి.. ఆత్మని తరిమేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఓ రోజు తన డ్యూటీలో భాగంగా పిజ్జా డెలివరీ చేసేందుకు స్మిత బంగ్లా దగ్గరకు వెళ్తాడు. స్మిత బంగ్లా చుట్టు దెయ్యాలున్నాయనేది ఆ ఊరివాళ్ల నమ్మకం. అవేమీ పట్టించుకోడు మైఖేల్. అయితే ఆ బంగ్లాలో అడుగు పెట్టినప్పటి నుంచీ కొన్ని విచిత్రాలు చోటు చేసుకొంటుంటాయి. పిజ్జా అర్డర్ ఇచ్చిన మహిళ అనూహ్యంగా హత్యకు గురౌతుంది. ఆమె భర్త కూడా చనిపోతాడు. అక్కడే మరో ఆత్మనీ చూస్తాడు. ఆ ఇంటి డోర్ ఆటోమెటిక్ లాక్ సిస్టమ్ కావడంతో బయటకి రాలేడు. ఇంతకీ ఆ ఇంట్లోంచి మైఖేల్ బయటకు వచ్చాడా? లేదా? అక్కడ మైఖేల్ కి తెలిసిన మరో చేదు నిజం ఏమిటి? ఇవన్నీ తెలుసుకొని ఏం చేశాడు? అను రాసిన నవలకూ, స్మిత ఇంట్లో జరుగుతున్న పరిణామాలకూ, యజమాని కూతురుని పట్టిపీడిస్తున్న ఆత్మకూ కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ‘పిజ్జా’ చూడాల్సిందే.

ఇటీవల దెయ్యం సినిమాలు ఎక్కువగా విజయవంతం కాకపోవడానికి ప్రధానమైన కారణం… కథలో దెయ్యం తప్ప ఆసక్తికరమైన మలుపులు లేకపోవడమే. ‘పిజ్జా’లో ఆ లోటు లేదు. ‘ఎందుకిలా జరుగుతుంది? ఏమౌతుంది?’ అని ప్రేక్షకులు సతమవుతున్న సమయంలో చిక్కుముడిని విప్పి రిలాక్స్ చేశాడు. కొంతమంది ‘ఓస్ ఇంతేనా? దీని కోసం సినిమా చూడాలా?’ అనిపించొచ్చు. కానీ.. ఆ పాయింట్ లేకపోతే ఈ సినిమాకి ప్రాణం పోయినట్టే. మా సినిమాలో దెయ్యం ఉంది అని చెప్పేస్తే – భయపెట్టడం చాలా తేలికైన విషయం. కాకపోతే ఈ రోజుల్లో వాటిని నమ్మలేని వాళ్లను థియేటర్లో కూర్చోబెట్టడం కష్టం. ‘దెయ్యం లేదు – అంతా భ్రమే’ అని చెప్పేస్తే హారర్ సినిమాలు చూస్తే ప్రేక్షకులకు థ్రిల్ కల్పించలేం. ఈ విషయాన్ని చక్కగా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ప్రతి సన్నివేశాన్ని చాలా పకడ్బందీగా రాసుకొన్నాడు. అనవసరంగా వచ్చిపడిపోయే సన్నివేశం ఒక్కటీ లేదు. చీకట్లో కెమెరా తిప్పి, భయంకరమైన శబ్దాలు జోడించి భయపెట్టకుండా – థ్రిల్లర్ సినిమాల్లో ఉన్న సిసలైన మాజా చూపించాడు. అతనికి సాంకేతిక నిపుణులు చక్కటి సహకారం అందించారు. సంతోష్ నారాయణ్ సంగీతం ఈ సినిమా మూడ్ కి తగినట్టు సాగింది. ఈ తరహా సినిమాల్లో మెలోడి పాటల్ని ఊహించలేం. కానీ.. ఆలోటూ భర్తీ చేశారు. చిన్న సినిమా అనే భావన రానివ్వకుండా కెమెరా చాలా చక్కగా పనిచేసింది. ప్రధాన పాత్రలకు శివాజీ, నాగబాబు డబ్బింగ్ చెప్పారు. ఈ ఎత్తుగడ మంచి ఫలితాన్నే ఇచ్చింది. తెలిసిన గొంతు వినిపిస్తే.. అనువాద చిత్రం అన్న ఫీలింగ్ కొంతైనా పోతుంది. అన్నట్టు నిర్మాత సురేష్ కొండేటి కూడా ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. నటీనటులందరికీ మంచి మార్కులే పడ్డాయి. కథంతా సేతుపతి చుట్టూనే తిరుగుతుంది. దాదాపు ప్రతి సన్నివేశంలోనూ సేతుపతి కనిపిస్తాడు. ప్రతి భావావేశాన్ని చక్కగా పలికించాడు.

హారర్ కథలు రాసుకునేవారికి ‘పిజ్జా’ కొత్త దారులు తెరిచిందనే చెప్పాలి. మౌళిక సూత్రాలను గుర్తు పెట్టుకొంటూనే కొత్తదనం చూపించొచ్చు అని నిరూపించారు. ఈ తరహా చిత్రాల కోసం ఎదురుచూసే వారికి ‘పిజ్జా’ తప్పకుండా నచ్చుతుంది.

 

తెలుగుమిర్చి రేటింగ్‌ : 3/5                                 – స్వాతి                                                                                                                                     

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version