రివ్యూ: చమక్ చల్లో

రివ్యూ: చమక్ చల్లో

Review Chammakchallo

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2/5

ఇదేం ప్రేమ కధ తల్లో… ‘చమ్మక్ చల్లో’

జీవ హింస మహా పాపం అన్నారు. డబ్బులు ఎదురిచ్చి మరీ ఈ పాపం భరించేవాళ్ళు ఈ ప్రపంచంలో సినిమా ప్రేక్షకులేనేమో. ‘అతిధి దేవో భవ’ అనే మాటని మర్చిపోయి… థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులని చీకటి గదిలో కూర్చోబెట్టి, తలుపులేసి మరీ రాచిరంపాలకు గురిచేయడం సినీ పరిశ్రమకే సాధ్యం. హీరో పేరు చూసి జడుసుకుని పారిపోయేవాళ్ళు కూడా దర్శకుడి మీద మమకారంతో థియేటర్ కి వెళ్తున్నారు. ఆ హోదా నిన్నటి వరకూ నీలకంఠకు వుంది. కానీ ‘చమ్మక్ చల్లో’ చూశాక మీ అభిప్రాయాల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ‘చలో చలో’ అని… వాళ్ళే ముందు హింట్ ఇచ్చారు. కానీ పోలోమని వెళ్తే ‘ఇదేం ప్రేమకధ తల్లోయ్’ అనిపిస్తుంది. అలా అనిపించుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేశారు? ప్రేక్షకులను ఎవరు ఏ స్థాయిలో ఆదుకున్నారు? అనే విషయాల్లోకి వెళ్తే…

అమెరికా నుంచి ఇండియా వస్తాడు అవసరాల శ్రీనివాస్ ఓ సినిమా తీయడానికి. ‘నీ దగ్గర టాలెంట్ వుంది. మంచి ప్రేమకధ వుంటే చెప్పు. చాలా కొత్తగా వుండాలి. తప్పకుండా సినిమా తీసేద్దాం’ అని ఆఫర్ ఇస్తాడు నిర్మాత. ప్రేమ కధ వెతుక్కుంటూ రోడ్ల వెంటా… పార్కుల వెంటా తిరుగుతున్న శ్రినివాస్ కి … షాయాజీ షిండే తగులుతాడు. ‘నేను చూసిన ఓ ప్రేమకధ చెబుతా. నచ్చితే సినిమా తీసుకో’ అంటాడు. కధ కాలేజీ రోజుల్లోకి వెళుతుంది. అది… వరుణ్ సందేశ్, సంచితా పడుకునే లది. ఇద్దరూ ఒకే క్లాస్. క్రమంగా ప్రేమలోకి దిగుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు కుడా ఒప్పుకుంటారు. నిశ్చితార్ధం జరుగుతుంది. వరుణ్ కి బెంగుళూరు లో జాబ్‌ వస్తుంది. అక్కడ సంచితా పడుకునే ని చూసి రెండో సారి మనసు పారేసుకుంటాడు. క్రమంగా సంచితా విషయాలు ఒక్కొక్కటీ మర్చిపోతుంతాడు. ఆఖరికి పుట్టిన రోజు కూడా. ‘నామీద నీకు ప్రేమ లేదు. మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని నిశ్చితార్ధం ఉంగరం విసిరేసి వెళ్ళిపోతుంది. ఇంతకీ వరుణ్ ప్రేమించింది ఎవరిని? సంచిత మనసు మార్చుకుని తిరిగి వచ్చిందా? లేదా? వీరిద్దరి కధ… శ్రీనివాస్ సినిమాగా తీసాడా? అనేదే ఈ సినిమా కధ.

ఈ సినిమా టైటిల్ కార్డులో ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన అద్భుతమైన ప్రేమ కధలు చూపించారు (అందులో రోజా కుడా వుంది? రోజా ప్రేమ కధా? ఈ విషయం తెలిస్తే మణిరత్నం ఎంత హార్ట్ అవుతాడో?). అవన్నీ చూసాక వీటికి మించిన కధ ఏదో చెబుతాడేమో అనిపిస్తుంది. అయితే అవన్నీ మన అభూత కల్పనలే అనే విషయం క్రమంగా అర్ధమవుతుంది. అతి మామూలు ప్రేమ కధని మూడో వ్యక్తి చేత చెప్పించి ప్రేమలో కొత్త కోణం అనుకోమన్నాడు దర్శకుడు. ‘సింపుల్ గా చెప్పాలా? సిల్లీ గా చెప్పాలా’ అనే పాట వుంది ఈ సినిమాలో. దర్సకుడికీ ఇదే సందిగ్ధం. అందుకే… చాలా సింపుల్ కధని, మరింత సిల్లీగా చూపించి మమ అనిపించాడు. హీరో హీరోయిన్లు ప్రేమలో పడగానే ఇంట్రవెల్. ఆ సన్నివేశాలు కుడా రొటీన్ గానే వుంటాయి. ఈ మాత్రం చూడ్డానికి దియేటర్ వరకూ రావాలా? అనిపిస్తుంది. కనీసం సెకండ్ ఆఫ్ లో అయినా కధ రసవత్తరమైన మలుపు తిప్పుతాడేమో అనిపిస్తుంది. కానీ షరా మామూలే!

వరుణ్ సందేశ్ వారం రోజుల పాటు.. లంకణం చేసినట్టు చాలా నీరసంగా కనిపించాడు. సంభాషణల్లో అమెరికన్ స్లాంగ్ ఇంకా వినిపిస్తోంది. ఈ విషయంలో శ్రద్ధ తీసుకోక పొతే మంచి మంచి తెలుగు మాటలకు కూడా చెదలు పట్టే అవకాశం వుంది. సంచిత పడుకునేకి ఇచ్చిన రెండు లిప్ లాక్ లు మినహా… ఈ సినిమాతో గుర్తు పెట్టుకునేది ఏమీ లేదు. పడుకునే… కొంచెం రీచాలా… కొంచెం దీపికా పడుకునే లా కనిపిస్తుంది. నటన ఓకే. నవ్వేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడింది. మనల్నీ ఇబ్బంది పెట్టింది. పూరి జగన్నాధ్ ఈ సినిమా చూసుంటే కేధరిన్ని తీసేసి, కధ మార్చేసి.. ‘ఒక అమ్మాయితో’ అనే సినిమా తీసేద్దును. ఇద్దరు హీరోయిన్లలో ఎవరు అందంగా వున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇద్దరూ బాగోలేరు కాబట్టి. సెకండ్ ఆఫ్ లో వెన్నెల కిషోర్ వచ్చి కొన్ని నవ్వులు పంచాడు కాబట్టి సరిపోయింది. లేదంటే… ఇంట్రవెల్ తరవాత కాసేపటికే థియేటర్ బయటకి చలో చలో. బ్రహ్మాజీ, వరుణ్ సందేశ్ కి నాన్నలా నటించారు. ఇద్దరూ అన్నదమ్ముల్లానే కనిపించారు. ఇదీ రాంగ్ కాస్టింగే!

ప్రేమ కధలు హిట్ అయ్యాయంటే కారణం… ఆ సినిమాల్లో సంగీతానికీ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే. ఈ సినిమాలో పాటలు పెద్ద మైనస్. కొన్ని పాటలు సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ లో తీసినట్టు… క్లారిటీ లేకుండా కనిపించాయి. కత్తెరకు మరింత పదును ఇస్తే… కాస్త నస తగ్గేది. నీలకంఠ మంచి దర్శకుడే. చిన్న కద దొరికినా తన కధనం తో మాయ చేస్తాడు. అయితే… బలహీనమైన కధతో తనూ ఏమీ చేయలేకపోయాడు. అందరికీ నచ్చాలని ప్రేమకధ ఎంచుకున్నాడు. దాన్ని బూతు లేకుండా నీట్ గానే చూపించాడు. అయితే.. ఈ ప్రేమకధ సిసలైన కిచిడీ కధలా ఉండడమే విషాదం.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2/5                                 – స్వాతి                                                                                                                                     

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version