రివ్యూ : ఒక్కడినే

okkadine

 తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5  

చిత్రహింసల  పాలు చెయ్యడానికి.. ఒక్కడినే ! 

కొన్ని సినిమాల జాతకం పేరు చూడగానే అర్థమైపోతుందేమో?! ‘ఒక్కడినే’ సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు అచ్చం ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ‘మా సినిమాకి ఒక్కడివే వస్తే బాగుండదు – నీతో పాటు మరో నలుగురిని వెంట తీసుకురా’ – అని చూచాయగా చెప్తాయో.. లేదంటే ‘ఈ సినిమా చూసేది ప్రొజెక్టర్ రూమ్ లో ఆపరేటర్ ‘ఒక్కడే’ అని సూచిస్తాయో మన మట్టిబుర్రకు అర్థం కాదు. పెరిగిపోయిన టికెట్ రేటు గుర్తొచ్చి ‘సోలో’గా వెళ్దామనుకొంటాం. కానీ ఈ సినిమా ఒక్కడే కాకుండా నలుగురితో వెళ్తేనే మంచిది. అదెందుకో తెలుసుకోవాలంటే ‘ఒక్కడినే కథాకమామీషు చూడాల్సిందే!

శైలు (నిత్యామీనన్) తన స్నేహితురాలితో పాటు కలిసి రామాపురం వస్తుంది. శ్రీను మావ (నాగబాబు) ఇంట్లో ఉంటుంది. అక్కడ సూర్య (నారా రోహిత్) పరిచయం అవుతాడు. ఐ.ఎఫ్.ఎస్ లో చేరడమే సూర్య ధ్యేయం. సూర్య కుటుంబం శైలుకి బాగా నచ్చుతుంది. అక్కడి అప్యాయతలు చూసి… ‘నాకు ఇలాంటి కుటుంబం ఉంటే బాగుణ్ణు’ అనుకొంటుంది. ‘నీతో నా జీవితం పంచుకోవాలని ఉంది’ అని శైలు ముందు తన ప్రేమను బయటపెడతాడు సూర్య. శైలూకీ సూర్య అంటే ఇష్టమే. అందుకే న్యూయార్క్ లో ఉంటున్న తన తండ్రి శివాజీ రావు (సాయికుమార్) కి ఫోన్ చేసి సూర్యతో ప్రేమ విషయం చెబుతుంది. ‘సరే నేను వచ్చేస్తా కదా? సంబంధం ఖాయం చేద్దాం’ అంటాడు. ఇదే విషయం శీను మావతో చెబుతుంది శైలు. ‘సూర్య ఎప్పుడో చనిపోయాడు. వాళ్ల కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు. ఇన్నిరోజులూ వాళ్లతో గడిపావా?’ అంటూ ఓ షాకింగ్ న్యూస్ చెప్తాడు. కథలో ట్విస్ట్! అంటే శైలు చూసిందంతా భ్రమేనా? సూర్యతో మాట్లాడింది ఆమె ఊహ మాత్రమేనా? నిజంగా ఆ కుటుంబం ఉందా? లేదా? అనేదే ‘ఒక్కడినే’ స్టోరీ!

ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడో హీరో ఆవిర్భవించి.. న్యాయం చేస్తాడట! తెలుగు సినిమాలో హీరో చేసే పనే అది. ఈ సినిమా కూడా ఇలాంటి ఫక్తు సూత్రాలతోనే మొదలవుతుంది. ‘ఇలాంటోడు ఈ ప్రపంచంలో ఉండకూడదు’ అని శైలు అనగానే హీరో సైడు నుంచి ఎవరికీ కనిపించకుండా వచ్చి – ఆ ద్రోహిని చంపేసి వెళ్లిపోతాడు. ‘ఇదేదో ఇంట్రస్టింగ్ గా ఉందే..’ అనుకొనేలాలోగా దర్శకుడిలోని రొటీనిటీ నిద్రలేస్తుంది. మన ఆసక్తిని చంపేస్తూ వెంటవెంటనే సన్నివేశాలు వచ్చిపడిపోతుంటాయి. తొలి సన్నివేశాల్ని ‘ఇదేదో యాక్షన్ స్టోరీ’ అనిపించేలా తీశాడు. ఆ తరవాత ‘గొప్ప కుటుంబ కథా చిత్రమ్’లా బిల్డప్ ఇచ్చాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ చూస్తే ‘కొంపదీసి ఇది దెయ్యాల సినిమా కాదు కదా? అనే అనుమానం కూడా వస్తుంది.

సగం సినిమా అయిపోయాక ‘మీరు చూస్తుందంతా భ్రమ’ అనే కాన్సెప్టుతో కొన్ని సినిమాలొచ్చాయి. వాటికంటే ‘ఒక్కడినే’ ఒక మెట్టు పైనే ఉంటుంది. సూర్య ఇంట్లో సన్నివేశాలన్నీ డ్రమటిక్ గా సాగుతాయి. విశ్రాంతి ట్విస్ట్ కథలో ఆసక్తి పెంచినా – ద్వితీయార్థంలో అందుకు తగిన సన్నివేశాలు మలచుకోలేకపోయాడు. ఈ మధ్య వస్తున్న రివెంజ్ డ్రామాల్లో ఇదొకటి. తన కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తిపై హీరో ఎలా పగ తీర్చుకున్నాడో చూపించారు. తనకు తగిన కథని ఎంచుకోవడంలో నారా రోహిత్ ఈసారి తడబడ్డాడు. హావభావాలపరంగా ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి. మెరుగుపడాల్సింది చాలా ఉంది. అండర్ ప్లే చేయడం సామాన్యమైన విషయం కాదు. అనుభవంతో నేర్చుకొనే విద్య. ఈ దారిలో అతను మరిన్ని మైళ్లు ప్రయాణం చేయాలి. నిత్యమీనన్ ఉన్నంతలో బాగానే చేసింది. ద్వితీయార్థంలో శైలు పాత్ర మరీ డమ్మీగా మారిపోయింది. సాయికుమార్ కీ అంత స్కోప్ ఇవ్వలేదు. నాగబాబు మాత్రం చివర్లో కత్తిపట్టి రెచ్చిపోయారు. హీరోపాత్రలో కూడా అంత ఎమోషన్ చూపించలేదు. వినోదాత్మక సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. అలీ పాత్ర శుద్ధ దండగ. బ్రహ్మానందం కూడా నవ్వించలేకపోయారు. పట్టపగలే బాటిల్ పట్టుకొనే పాత్రల్లో ఎమ్మెస్ నారాయణని ఇంకెన్ని సినిమాల పాటు చూడాలో..?! సాంకేతికంగా మాటల విభాగం పూర్తి గా ఫెయిలయ్యింది. కొన్ని సంభాషణలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. చిన్నా అందించిన నేపథ్య సంగీతం బాగానే ఉన్నా అంత ఫీల్ తెరపై కనిపించలేదు. సంగీతంలోనూ మెరుపుల్లేవు. హీరో ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే సినిమాకి ‘శుభం’ కార్డు వేసేయొచ్చు. కానీ నిడివి కోసం మరో పావుగంట లాగారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న మన సహనం.. ‘శుభం’ కార్డు చూసే ఓపిక కూడా కోల్పోతుంది. రివ్యూ ప్రారంభంలో ‘ఈ సినిమాకి మరో నలుగురిని వెంట పెట్టుకొని వెళ్లాలి’ అని ఎందుకన్నామంటే.. ట్విస్టులు భరించలేక కళ్లుతిరిగితే మోసుకెళ్లడానికి మినిమం నలుగురు కావాలి కదా?

 

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.25/5                                 – స్వాతి                                                                                                                                    

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

 Click here for English Version