రివ్యూ : స్వామి రారా

swamy-ra-ra-review

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.5/5 

రివ్యూ : స్వామి రారా

కథ ఉన్నప్పుడు జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదు. ఎలా చెప్పినా ప్రేక్షకులు చూస్తారు. టేకింగ్, షాట్ డివిజన్, రకరకాల యాంగిల్స్, స్ర్కీన్ ప్లే హంగులూ, ట్విస్టులూ ఇవన్నీ కథ లేనప్పుడు అవసరమవుతాయి. కథంటూ ఏదో ఒకటి ఉండి, పైన చెప్పుకొన్నవన్నీ కలిసొస్తే.. సినిమా నిలబడిపోతుంది. దానికి రుజువులు ఎన్నో! కొత్త దర్శకుడు సుధీర్ వర్మ.. ఈ జిమ్మిక్కులపై ఆధారపడ్డాడు. మరి అందుకు అనువైన కథ దొరికిందా? లేదంటే కేవలం బిల్డప్ షాట్స్ తోనే సరిపెట్టాడా? తెలుసుకొందాం పదండి!

అనంతపద్మనాభస్వామి దేవాలయం నుంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. కేరళ నుంచి చేతులు మారుతూ మారుతూ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఈ విగ్రహం దక్కించుకోవడానికి హో మంత్రి విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. దుర్గ (రవిబాబు)కి ఈ పని అప్పగిస్తాడు. ఆ విగ్రహం అనుకోకుండా స్వాతి(స్వాతి) దగ్గరకి చేరుతుంది. దాన్ని సూర్య (నిఖిల్) కాజేస్తాడు. అతనో దొంగ. జేబులు కొట్టడంలో ఆరితేరిపోయాడు. ఓసారి స్వాతి ముచ్చటపడి కొనుక్కొన్న స్కూటర్ పోతుంది. అది సూర్య వల్లే తిరిగి దక్కుతుంది. (కాజేసింది కూడా సూర్యనే). దాంతో ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. స్వాతి దగ్గర కొట్టేసిన విగ్రహం రూ. 5 లక్షలకు అమ్మేస్తాడు. అయితే దాని విలువ పది కోట్లని ఆలస్యంగా తెలుస్తుంది. మరోవైపు విగ్రహం స్వాతి దగ్గర ఉందని తెలుసుకొన్న దుర్గ, ఆమెను బంధిస్తాడు. విగ్రహం తీసుకొచ్చి స్వాతి విడిపించుకో..’ అని సూర్యకు గడువిస్తాడు. మరి విగ్రహం మళ్లీ సూర్య చేజిక్కించుకొన్నాడా? లేదా? అనేదే ఈ సినిమా కథ.

‘నాకు నచ్చిన సినిమాల్ని కాపీ కొడతా..’ అంటూ సినిమా ప్రారంభానికి ముందే చెప్పుకొన్నాడు దర్శకుడు. అతని నిజాయితీని మెచ్చుకోవాలి. చెప్పినట్టుగానే ‘స్వామి రారా’పై చాలా సినిమాల ప్రభావం కనిపిస్తుంది. ‘మనీ’, ‘దొంగ దొంగ’, ‘క్షణ క్షణం’ ఈ సినిమాల లక్షణాలు ‘స్వామి రారా’లోనూ కనిస్తాయి. జోగీ బ్రదర్స్ ఎంట్రీతో సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ‘అతడు’ స్థాయి బిల్డప్ తో సమయం, చోటు అంటూ స్ర్కీన్ పై అక్షరాలు చూపించి ‘కాపీ’ అనే మాట సార్థకం చేసుకొన్నాడు. అయితే సన్నివేశాల ప్రారంభం, ముగింపులో దర్శకుడి పనితనం కనిపించింది. ఉదాహరణకు.. స్వాతి-సూర్యలను పరిచయం చేసిన సన్నివేశం. ఇద్దరూ ఒకరితో ఒకరు ఫోన్ లో మాట్లాడుకొంటున్నారేమో అనుకొంటాం. కానీ ఇద్దరు వేరెవరితోనో కబుర్లు చెప్పుకొంటారు. స్ర్కీన్ ప్లేతో చేసిన ఈ ట్రిక్కు.. దర్శకుడిపై ఫస్ట్ ఇంప్రెషన్ కాస్త గట్టిగా పడేసేలా చేసింది. విగ్రహం కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ పయనం అవ్వడం, ఒక్కో చోట ఒక్కో రేటు పలకడం – ఈ దృశ్యాలను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చాకచక్యంగా తీశాడు. సూర్య అండ్ బ్యాచ్ దొంగతనాలు చేసే తీరు కూడా ఆకట్టుకొంటుంది.

రెండు మూడు సన్నివేశాలు గడిచిపోగానే కథేంటో టూకీగా ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఇక్కడ దర్శకుడు చేయవలసిందల్లా.. తెలిసిన కథను నేర్పుగా చెప్పడమే! ఈ విషయంలో దర్శకుడి అనుభవం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. దాదాపు ఇదే కథను ‘క్షణ క్షణం’లో వర్మ ఇంకోలా తీశాడు. ‘దొంగ దొంగ’లో మణి మరోలా టేకప్ చేశాడు. కానీ.. సుధీర్ వర్మ మాత్రం తేలిపోయాడు. కారణం.. అనుభవం. ఇంట్రవెల్ తరవాత చెప్పడానికి ఇంకేం మిగల్లేదు. కానీ.. మరో గంట సినిమా నడపాలి. అందుకోసం బంతి అటూ ఇటూ తిప్పి.. విసుగు తెప్పించాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే అనంత పద్మనాభస్వామి ఆలయం నుంచి ఖరీదైన విగ్రహాన్ని తీసుకొచ్చే సన్నివేశం ఆసక్తిగా చెప్పాలి. అలా కాకుండా.. ఈజీగా తేల్చిపాడేశాడు. విగ్రహం పోతే ప్రభుత్వం ఏం చేసింది. అసలు ఆ పాయింట్ ని టచ్ చేయలేదు. నిఖిల్, స్వాతిని హీరో హీరోయిన్స్ లా చూళ్లేం. వాళ్లూ రెండు పాత్రలు వేశారంతే!

ఈ సినిమాని రిచ్ గా తీర్చిదిద్దడంలో సాంకేతిక నిపుణుల పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. ముఖ్యంగా కెమెరామెన్ గురించి చెప్పుకోవాలి. సినిమా అంతా కలర్ పుల్ గా తీశాడు. కొన్ని షాట్స్ చూస్తే – పెద్ద సినిమాకి ఇచ్చేంత బిల్డప్ ఇచ్చాడు. నిఖిల్, స్వాతి మొఖాల్లో ఉన్న మైనస్ లను పక్కన పెట్టి ప్లస్ లను బాగా ఎలివేట్ చేశాడు. దాంతో.. నిఖిల్, స్వాతి మరింత అందంగా కనిపించారు. నిఖిల్ పాత్ర హీరో స్థాయిలో తీర్చిదిద్దకపోయినా – కథకు అంత వరకే కరెక్ట్ అనిపించింది. నిఖిల్ లాంటి అల్లరి అబ్బాయి… వీరోచితమైన ఫైట్లు చేసి ధనా ధనామంటూ బుల్లెట్లు పేల్చేస్తే చూడ్డానికి ప్రేక్షకులూ సిద్ధంగా లేరు. దాంతో దర్శకుడూ ఆ రిస్క్ చేయలేదు. స్వాతికి ఇలాంటి పాత్రలు భలే నప్పుతాయి. ‘డేంజర్’ తరవాత ఆమెను పరుగులు పెట్టించింది ఈ సినిమానే.

‘స్వామి రారా’ పాట పాడిన విధానం, దాన్ని చిత్రీకరించిన తీరు ఆకట్టుకొంటాయి. మిగతా పాటలూ ఓకే. డాన్సింగులూ, డబుల్ మీనింగ్ డైలాగులూ లేకుండా క్లీన్ గా సినిమా చూపించే ప్రయత్నం చేసినందుకు ఈ టీమ్ ని అభినందించాలి. దర్శకుడిగా సుధీర్ పాస్ మార్కులు తెచ్చుకుంటారు. తొలి సగంలో అతనిపై కలిగిన మంచి ఇంప్రెషన్, రెండో భాగంలో మాయం అయిపోతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మైనస్ మార్కులు పడినా ఆశ్చర్యం లేదు. ఒకరి తల మీద మరొకరు గన్ పెడుతూ.. రౌండప్ చేయడం ‘మనీ’ని గుర్తుచేసింది.

తెలుగుమిర్చి రేటింగ్‌ : 2.5/5                                           – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version