క్యాజువల్‌ సెక్సిజం మంచిది కాదు


తనను కారణం లేకుండా తిట్టిపోస్తున్నారని.. గతంలో కంటే ఇప్పడు సోషల్ మీడియాలో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది గాయని చిన్మయి శ్రీపాద. అంతేకాదు సోషల్ మీడియాలో ఎలాంటి దారుణమైన పోస్టులు వస్తుంటాయో చూపించింది. ప్రస్తుతం ‘10 year challenge’ పేరిట ఓ ఛాలెంజ్‌ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా సెలబ్రిటీలు, సామాన్యులు తమ పదేళ్ల క్రితం నాటి ఫొటోను ఇప్పటి ఫొటోను పక్కపక్కన పెట్టి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు సెలబ్రిటీల ఫొటోలను మీమ్స్‌లా రూపొందించి కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జొనాస్‌కు సంబంధించిన ఓ మీమ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫొటోలో పదేళ్ల క్రితం ప్రియాంక ఓ చిన్నారిని ఎత్తుకున్నట్లుగా, పదేళ్ల తర్వాత పెద్దవాడైన చిన్నారిని పెళ్లిచేసుకున్నట్లుగా చూపించారు. ఈ మీమ్‌ను చిన్మయి ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ ఫొటో ఎంత అసహ్యంగా ఉందో చూశారా? ఈ దేశంలో మగవాళ్లు తమకంటే వయసులో 25 ఏళ్లు చిన్నవారైన యువతులను పెళ్లిచేసుకుంటున్నారు. ఓ యువతి తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని పెళ్లిచేసుకుంటే అహస్యంగా ఇలా మీమ్‌లు రూపొందిస్తున్నారు. క్యాజువల్‌ సెక్సిజం మంచిది కాదు’ అని కామెంట్ చేసింది చిన్మయి.