మీడియం సినిమాల వార్

చూస్తుండగానే డిసెంబర్ వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో 2019 కొత్త క్యాలెండర్‌ని చూడబోతున్నాం. చిత్ర సినిమాకి సంబంధించి ఈ నెల తెగ బిజీగా ఉండబోతుంది. ఈ ఒక్క నెలలో దాదాపు 20 చిత్రాలు విడుదలకు కాలు దువ్వుతున్నాయంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా మీడియం రేంజ్ సినిమాలు. రజనీకాంత్ రోబో 2 వచ్చేయడంతో ఇంక ఈ ఏడాది పెద్ద సినిమా లేదు. మిగిలిన నెల మొత్తం మీడియం రేంజ్ సినిమాల హవానే నడుస్తుంది. ఇందులో డిసెంబరు 7న.. ఏకంగా నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ‘కవచం’ 7న రాబోతోంది. ఈనెల 30న విడుదల కావాల్సిన ‘భైరవ గీత’ సెన్సార్‌ సమస్యల వల్ల వాయిదా పడి.. డిసెంబరు 7న వస్తోంది. సందీప్‌కిషన్‌ – తమన్నాల ‘నెక్ట్స్‌ ఏంటి’, సుమంత్ సుబ్రమణ్యపురం, శుభలేఖలు, హుషారు’ అనే మరో చిన్న చిత్రం వీటితో పోటీ పడుతోంది. ‘కవచం’, ‘భైరవ గీత’ , ‘నెక్ట్స్‌ ఏంటి’ , సుబ్రమణ్యపురం ఇందులో మీడియం రేంజ్ అంచనాలు వున్న సినిమాలు.

తర్వాత వారమే మరిన్ని సినిమాలు లైన్ లో వున్నాయి. ఇందులో ‘అంతరిక్షం’, ‘పడి పడి లేచె మనసు’ మంచి అంచనాలు వున్న సినిమాలు. ఘాజీ తరువాత సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అంతరిక్షం’. ఈ తరహా కథలు తెలుగు తెరకు కొత్త. సంకల్ప్‌ ఈసారి ఏం మాయాజాలం చేయబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. అలాగే ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఈసారి ‘పడి పడి లేచె మనసు’ అంటూ మరో ప్రేమకథ చెప్పబోతున్నాడు. శర్వానంద్‌ – సాయిపల్లవి జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తంమ్మీద డిసెంబర్ లో మీడియం సినిమాల వార్ జరగబోతుంది.