గౌతమ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఆయనేనట..

మళ్లీరావా చిత్రంతో అందర్నీ ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరి..రెండో సినిమా నాని తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన జెర్సీ చిత్రం ఏప్రిల్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించింది. తనకు కలిసి వచ్చిన స్క్రీన్‌ ప్లేతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్‌ బ్యాక్‌ను రివీల్‌ చేస్తూ.. సినిమాను ముందుకు నడిపించాడు.

ప్రతి సినిమాలోనూ సినిమాటిక్‌ లిబర్టీస్‌ ఉంటాయి. ఉన్న దాన్ని మరింత గ్లామర్‌గా చూపించడానికి ప్రయత్నిస్తారు. కానీ, గౌతమ్‌ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక, సంపాదనకు కూడా నోచుకోలేని ఓ క్రీడాకారుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో మనసుకు హత్తుకునేలా చూపించాడు. దీంతో గౌతమ్ పేరు ఇండస్ట్రీ లో మారుమోగిపోతుంది. సినిమా చూసిన ప్రతి హీరో ఆయన డైరెక్షన్లో సినిమా చేయాలని మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్ వి ప్రసాద్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి మళ్లీ రావా తరువాత ప్రసాద్ తోనే చేయాల్సి వుంది అందుకోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారట కానీ కొన్ని కారణాల వల్ల తన రెండవ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ లో చేశాడుగౌతమ్. ప్రస్తుతం జెర్సీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ నెక్స్ట్ ఏ హీరోతో చేస్తాడో చూడాలి..