సందీప్ కిషన్.. ఇలా అయితే కష్టం గురూ


కొందరికి ట్యాలెంట్ వుంటుంది. కానీ అదృష్టం కలసి రాదు. సినిమాలు మీద సినిమాలు చేస్తున్నా.. ఒక్క హిట్టూ పడదు. అలాగని యాక్టింగ్ రాదా ? అంటే కాదు. నటనతో తెరను చించేయగలరు. అంత ఎనర్జీ వుంటుంది. సందీప్ కిషన్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ‘ప్రస్థానం’ సినిమాతోనే సందీప్ కిషన్ లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో అందరికీ అర్దమైయింది. నటన పరంగా ఈ సినిమాతోనే అందరి ద్రుష్టిని ఆకర్షించాడు. అలాగే సందీప్ కి ఇండస్ట్రీ నేపధ్యం కూడా వుంది. చోటా కే నాయుడు మేనల్లుడు సందీప్. దీంతో ఆయన కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సందీప్ కి ఇప్పటికీ అదృష్టం కలసి రాలేదు.

సందీప్ ఇప్పటి వరకూ ఇరవైకి పైగా సినిమాలు చేశాడు. ఇందులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్, టైగర్ లాంటి సినిమాలు తప్పితే గుర్తుపెట్టుకునే సినిమా మరోటి లేదు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ కి ఒక్క హిట్ కూడా పడలేదు. కనీసం యావరేజ్ కూడా లేదు. ఏ సినిమా చేసినా పల్టీ కొట్టేస్తుంది. తమిళ్ లో కూడా కొన్ని రోజులు ప్రయత్నాలు చేశాడు. అక్కడా నిలబడలేదు. మళ్ళీ తెలుగులోకి వచ్చి కొన్ని సినిమాలు చేశాడు. అయితే ఇందులో కొన్ని ఎప్పుడు రిలిజ్ అవుతున్నాయో ఎప్పుడు థియేటర్ నుండి వేల్లిపోతున్నాయో కూడా తెలియడం లేదు. అలా వుంది సందీప్ సినిమాల పరిస్థితి.

మొన్న సంతోష్ జాగర్లముడి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. అనూహ్యంగా ఈ సినిమా నుండి సందీప్ వెళ్ళిపోయాడు. సందీప్ ప్రస్తుత ఫామ్ ని ద్రుష్టిలో పెట్టుకొని నిర్మాతలు వెనకడుగు వేశారని, అందుకే ఈ సినిమా నుండి సందీప్ తప్పుకున్నాడనే మాట వినిపిస్తుంది. ఇది నిజం కూడా కావచ్చు. ఎందుకంటె ఇప్పుడు సందీప్ సినిమా అంటే సాటిలైట్ కూడా పలకడం కష్టం అవుతుంది. అంతలా పడిపోయింది సందీప్ గ్రాఫ్.

సందీప్ తో కెరీర్ మొదలుపెట్టిన శర్వా నంద్ లాంటి హీరోలు మొదటి ఫ్లాపులు ఎదురుకున్నారు. అయితే ఒక దశలో మంచి కధలని ఎంచుకొని మళ్ళీ నిలబడ్డారు. సందీప్ కూడా ఇప్పుడు అదే చేయాలి. తన బలాబలాలు తెలుసుకోవాలి. తనకు ఎలాంటి కధ నప్పుతుందో చూసుకోవాలి. ఇండస్ట్రీలో నిలబడాలంటే బ్యాగ్ గ్రౌండ్ కంటే హిట్ చాలా అవసరం. ఆ హిట్ ఇప్పుడు సందీప్ కి కావాలి. సందీప్ కధల విషయంలో పొరపాట్లు చేస్తున్నాడని ఓ విమర్శ వుంది. దానిని సరిదిద్దుకొని తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కధ ఎన్నుకోవడం ఇప్పుడు ఎంతైనా ఆవసరం. మరి త్వరలోనే సందీప్ నుండి అందరూ మెచ్చుకొని ఓ సినిమా రావాలనే కోరుకుందాం.