ఒక ఐడియా.. నాలుగు పిట్టలు !

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాన్ని స్వీకర్ ఆమోదించడం. దీనిపై శుక్రవారం చర్చించనుండటంతో ఒక్కసారిగా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. తెలుగుదేశం, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు మద్దతు ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు అవసరమైన సభ్యుల సంఖ్య లభించింది. దీంతో స్పీకర్‌ అనుమతించారు. ఐతే, ఏపీ సీఎం ముఖ్యమంత్రి ఈ ఒక్క అవిశ్వాసం ఐడియాతో నాలుగు పిట్టలని కొట్టబోతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా రాజకీయ వ్యూహంతో.. వైకాపాపై పైచేయి, రాష్ట్రంలో భాజపాను ఏకాకి చేయడం, పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన విమర్శలకు బదులివ్వడం, జాతీయ రాజకీయపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాలను ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక తాటిపైకి తీసుకొని రావడం జరగనున్నాయి. ఇదీగాక.. దేశ రాజకీయాల్లో తెలుగుదేశం కీలకభూమికను పోషించనుందన్న సంకేతాలు వెళ్లనున్నాయి.

ఈ అవిశ్వాస తీర్మాణంతో ఎన్ డీయే ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదు. ఐతే, ఈ ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై మాత్రం గట్టిగానే పడనుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈ పరిణామాలని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. గత ఎన్నికలో ఏపీ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో భాజాపా పరిస్థితి కూడా ఇంతేనని చెబుతున్నారు.