అమెరికాలోనూ జనసేన కవాతు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘జనసేన కవాతు’ జరగనుంది. ఇందులో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు పిచ్చుకల్లంక వద్ద పవన్‌ కవాతు ప్రారంభం కావాల్సి ఉంది. సుమారు రెండు లక్షల మందితో దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కవాతు చేయాలని జనసేన నిర్ణయించింది. అనంతరం బ్యారేజీ దిగువన ఉన్న కాటన్‌ విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించాల్సి ఉంది. ఐతే, ఈ కవాతుకు అనుపతి లేదని రాజమహేంద్రవరం పోలీసులు పవన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యలో జనసేన కవాతుపై సస్పెన్స్ నెలకొంది.

మరోవైపు, జనసేన కవాతుకు మద్దతుగా పవన్ కల్యాణ్ అభిమానులు అమెరికాలోని వర్జీనియాలో కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు.
జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా, కార్లు ఒకదాని వెంట మరొకటి దూసుకెళ్లాయి. ఈ సందర్భంగా ఓ చోటుకు చేరుకున్న అభిమానులు జై జనసేన, జై పవన్ కల్యాణ్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కార్లను ‘జన సేన’ అనే ఇంగ్లిష్ అక్షరాల్లో ఉన్నట్లు పార్క్ చేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. దీన్ని ప్రత్యేకమైన డ్రోన్ తో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.