మినీ కేబినెట్ మాత్రమే

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఇంకా పూర్తి స్థాయిలో కొలువుదీరలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనతో పాటు ఏకైక మంత్రి, హోం మంత్రి మహమ్మద్ అలీ మాత్రమే ఉన్నారు. ఐతే, ఇప్పట్లో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేసే ఆలోచన సీఎం కేసీఆర్ కి లేదని సమాచారమ్. తొలి విడతలో 6–8 మందితో మినీ కెబినెట్ ని ఏర్పాటు చేసుకోబోతున్నారంట. లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.

ఈ నెలాఖర్లో అసెంబ్లీ తొలి సెషన్‌ ఏర్పాటు చేసి అప్పుడే ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని, అంతకు ముందు తొలి విడత మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన వారిలో దాదాపు 12 మంది సభ్యులు తమతో కలవడానికి ఇప్పటికే రాయబారాలు పంపారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా కనీసం 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణకు తొందర పడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి సీఎం కేసీఆర్‌ వచ్చినట్లు తెలిసింది.