రివ్యూ : చిత్రలహరి – ఎమోషనల్ ట్రీట్..

స్టార్ కాస్ట్ : సాయి ధరమ్‌ తేజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు..
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : ఏప్రిల్ 12, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : చిత్రలహరి – ఎమోషనల్ ట్రీట్..

‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సాయి తేజ్.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘సుప్రీమ్’ సినిమాతో మాస్ ఇమేజ్‌ను కూడగట్టుకోవడమే కాదు సుప్రీం హీరో అనే ట్యాగ్ ను కూడా తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తేజ్ స్టార్ హీరో అవ్వడం ఖాయం అనుకున్నారు కానీ అది జరగలేదు. సుప్రీమ్ తరువాత చేసిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి భారీ ప్లాప్స్ అయ్యాయి. వినాయక్..కరుణాకరన్..కృష్ణవంశీ ఇలా స్టార్ డైరెక్టర్లందరితో పనిచేసిన కానీ తేజ్ కు మాత్రం హిట్ రాలేదు.

ఈ నేపథ్యంలో నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ను నమ్ముకొని చిత్రలహరి అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , రంగస్థలం వంటి భారీ హిట్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిత్రలహరి తెరకెక్కింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా సునీల్ కీలక రోల్ లో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మరి ఈ సినిమా కథ ఏంటి..? ఈ సినిమాతోనైనా తేజ్ హిట్ కొట్టాడా లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

విజయ్ (సాయి తేజ్) ఇంజినీరింగ్ పూర్తిచేసి సొంతంగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే.. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నవారికి కాపాడటం కోసం ఓ డివైజ్‌ను తయారుచేయడమే. ఈ ప్రాజెక్టును పట్టుకుని స్పాన్సర్‌షిప్ కోసం చాల చోట్ల తిరిగినప్పటికీ.. ఎక్కడికి వెళ్లినా అది వేస్ట్..వర్క్ అవుట్ కాదని చెప్పడంతో విజయ్ నిరాశలో ఉంటాడు. ఈ నేపథ్యంలో తన జీవితంలో వెలుగంటూ ఏదైనా ఉందంటే అది లహరి (కల్యాణి ప్రియదర్శన్‌) మాత్రమే.

తొలి చూపులోనే లహరిని ఇష్టపడిన విజయ్ ఆమె ప్రేమను గెలుచుకుంటాడు. కానీ ఆమె తన చిన్ననాటి స్నేహితురాలైన స్వేచ్ఛ (నివేదా పేతురాజ్‌) మాటలు విని… విజయ్‌ను దూరం పెడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? విజయ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందా లేదా..? మళ్లీ లహరి – విజయాలు కలుసుకుంటారా లేదా..? అసలు స్వేచ్ఛ ..విజయ్ కి సంబంధం ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* మ్యూజిక్

* కామెడీ

* డైలాగ్స్

మైనస్ :

* కథ

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న తేజ్..ఈ సినిమాలో తన నటనలో చాల మార్పులు వచ్చాయి. మేకోవర్ సైతం బాగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం, కాస్త ఒళ్లుచేసి చాలా బాగున్నాడు. భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు.

* ఏ నిర్ణయం కోసమైనా ఎదుటి వ్యక్తులపై ఆధారపడే స్వభావం కలిగిన అమ్మాయి పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ బాగానే నటించింది. తేజూ, కళ్యాణి జంట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

* నెగిటివ్‌ను వెతికే అమ్మాయి పాత్రలో నివేథ పేతురాజ్ చక్కగా సరిపోయింది. కార్పోరేట్ ఉద్యోగిణిగా ఆమె లుక్ బాగుంది.

* సాయి తేజ్ తండ్రిగా పోసాని పాత్ర హైలైట్ గా ఉంది. మరోసారి తనదయిన నటనతో ఆకట్టుకున్నాడు.

* తొలి సగభాగం సినిమాలో సునీల్‌, ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్‌ పంచిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.

* బ్రహ్మాజీ, రావు రమేష్‌, జయప్రకాష్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం :

* దేవి శ్రీ మ్యూజిక్ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. గత రెండు మూడు సినిమాల్లో దేవి మ్యూజిక్ బాగాలేదని ఫీడ్ బ్యాక్ రావడం తో ఈసారి కాస్త జాగ్రత్త పడ్డాడు. కిషోర్ – దేవి కాంబో లో వచ్చిన ఈ మూవీ హ్యాట్రిక్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ సైతం బాగా ఆకట్టుకుంది.

* కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల చిత్రీకరణ, సముద్రంలో పడవ ఎపిసోడ్‌లో ఆయన పనితనం కనిపించింది.

* ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు బాగానే పనిచెప్పారు. సినిమా నిడివిని తగ్గించి ప్రేక్షకులు విసుగు చెందకుండా చేశారు.

* టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ గత చిత్రాల మాదిరిగానే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

డైరెక్టర్ కిషోర్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో లవ్, కామెడీ, ఎమోషన్‌ను సమపాళ్లలో నడిపించిన కిశోర్ తిరుమల.. సెకండాఫ్‌ను మాత్రం చాలా సింపుల్‌గా పూర్తి చేసాడు. తేజ్‌‌లో ఇప్పటి వరకు చూడని లుక్‌, ఆ లుక్‌కు ఒక కారణం జతచేస్తూ దర్శకుడు చూపించిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ఎపిసోడ్‌ను ..హారర్ సినిమా చూస్తూ భయంభయంగా లవ్‌ను ప్రపోజ్ చేయడం వంటివి ఆకట్టుకున్నాయి.

ఇక సునీల్, సాయి తేజ్ కాంబినేషన్ బాగుంది. చాలా రోజుల తర్వాత సునీల్ మెప్పించారు. ఫస్టాఫ్‌ను చాలా సరదాగా, ఎమోషనల్ టచ్‌తో నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌ను మాత్రం బోర్ తెప్పించాడు. సెకండాఫ్‌లో ఎమోషన్స్ డోస్ ఎక్కువయ్యింది. కొన్ని సన్నివేశాలు కచ్చితంగా కంటతడి పెట్టిస్తాయి. ఈ ఎమోషన్స్ మధ్య వెన్నెల కిషోర్ కామెడీ కాస్త రిలాక్స్ చేయిస్తుంది. తమిళం, ఇంగ్లిష్‌ను మిక్స్ చేసి వెన్నెల కిషోర్ కొట్టిన కామెడీ నవ్వుల పువ్వులు పూయిస్తుంది. సినిమా నిడివిని బాగా తగ్గించినప్పటికీ సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుడికి అంత బాగా కనెక్ట్ కాదు. కథనం ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండు. క్లైమాక్స్ కూడా గొప్పగా ఏమీ లేదు. కానీ, సినిమాలో డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. ఓవరాల్ గా చిత్రలహరి కామెడీ- ఎమోషన్స్ తో నింపేసాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review