రివ్యూ : సామి – సీక్వెల్ ను అందుకోలేకపోయాడు

స్టార్ కాస్ట్ : విక్రమ్ , కీర్తి సురేష్, బాబీ సింహ తదితరులు..
దర్శకత్వం : హరి
నిర్మాతలు: బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : సెప్టెంబర్ 21, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : సామి – సీక్వెల్ ను అందుకోలేకపోయాడు

‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో విక్రమ్ హీరో గా నటించిన చిత్రం సామి. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడదే టైటిల్‌తో కీర్తి సురేష్ హీరోయిన్ గా విక్రమ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈ మూవీ తెరకెక్కింది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం ఆకట్టుకోవడం , దేవి శ్రీ అద్భుతమైన సంగీతం ఇవ్వడం తో ఈ మూవీ ఫై తెలుగు ప్రేక్షకులు మంచి ఆసక్తినే కనపరిచారు. పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సామి గా విక్రమ్ ఎలా అదరగొట్టాడో..హరి విక్రమ్ ను ఎలా చుపించాడో..అసలు సామి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కథ :

విజయవాడ ను గడగడలాడిస్తుంటాడు రావణ బిక్షు(బాబీ సింహ). ఇతడికి ఇద్దరు అన్నదమ్ములు దేవేంద్ర బిక్షు, మహేంద్ర బిక్షు వీరికి ధన బలం, రాజకీయ బలం ఉండటంతో ఎన్ని అరాచకాలకు పాల్పడినా ఎవరూ ఏమీ చేయలేక పోతారు. పోలీసులు సైతం రావణ బిక్షు చేసి అరాచకాలను అడ్డు వేయలేకపోతారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని విజయవాడ కు వచ్చిన రామస్వామి (విక్రమ్) వారి అరాచలకు చెక్ పెడతాడు.

ముగ్గురు అన్నదమ్ముల అక్రమ వ్యాపారాలను దెబ్బతీయడంతో పాటు… పగబట్టి ఒక్కొక్కరినీ చంపేస్తుంటాడు. వచ్చి రాగానే రావణ బిక్షు ఫై రామస్వామి ఎందుకు పడ్డాడో చాలామందికి తెలియదు. రామస్వామికి పోలీస్ వ్యవస్థ సపోర్ట్ కూడా ఉండడం తో మరింతగా రెచ్చిపోతాడు. ఇంతకీ రామస్వామి ఎవరు..? ఆయనకు రావణ బిక్షుకు సంబంధం ఏంటి..? అసలు రామస్వామి ఎందుకు భిక్షు మీద పగ పెంచుకుంటాడు..? అసలు రామస్వామి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే.

ప్లస్ :

* విక్రమ్ అండ్ కీర్తి సురేష్

* విలన్ బాబీ సింహ

* సెకండ్ హాఫ్

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* ఎడిటింగ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* పరుశురాం సామి గా విక్రమ్ అదరగొట్టాడు…ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపించి ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించుకున్నాడు. ముఖ్యం గా యాక్షన్ సన్నివేషాల్లో దుమ్ముదులిపాడు.. మాస్ ప్రేక్షకులు ఈ ఫైట్స్ ను తెగ ఎంజాయ్ చేసారు. ఈ వయసు లో కూడా విక్రమ్ తన బాడీ ని ఆలా మెంటైన్ చేయడం నిజం గా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. దర్శకుడు హరి విక్రమ్ ను ఎలా చూపించాలనుకున్నాడో ఆలా చూపించి సక్సెస్ అయ్యాడు.

* దియా పాత్రలో కీర్తి సురేష్ ఆకట్టుకుంది. మహానటి చిత్రం తర్వాత ఈమె నటించిన సినిమా కావడం తో ఈమెను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టారు. వారిని ఏమాత్రం నిరాశ పరచకుండా తనదయిన గ్లామర్ తో యాక్టింగ్ తో ఫుల్ మార్కులు వేసుకుంది. కాకపోతే కేవలం పాటలకే పరిమితమైంది. పెద్దగా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేని పాత్రే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకుంది. విక్రమ్‌కు తగిన జోడీ అనిపించుకుంది.

* విక్రమ్ తర్వాత సినిమాకు హైలైట్ గా నిలిచింది ప్రతి నాయకుడి పాత్ర చేసిన బాబీ సింహ. మంచి వేరియేషన్స్ ను కనబర్చి తన పాత్ర కు పూర్తిగా న్యాయం చేశాడు.

* భువన పాత్రలో ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ మీద కనపడింది తక్కువ సమయమే అయినా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది.

* ఇక మిగతా నటి నటులంతా వారి వారి పరిధి మేరకు చేసి ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* దేవి శ్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు..డబ్బింగ్ చిత్రాలైన , స్ట్రయిట్ చిత్రాలైన తన మ్యూజిక్ విషయం లో మాత్రం తేడా ఉండదు. కానీ ఈ సినిమా విషయం లో మాత్రం తేడా కొట్టినట్లు అనిపించింది. ఎప్పటిలాగా కాకుండా అవుట్ డేట్ సాంగ్స్ తో పని పూర్తి చేసినట్లు అనిపించింది. ఒక చివరిలో వచ్చే పిల్ల నిన్ను చుస్తే అని సాంగ్ తప్ప మిగితావన్ని ఏ మాత్రం బాగాలేవు. మ్యూజిక్ తో నిరాశ పరిచినప్పటికీ , నేపధ్య సంగీతం మాత్రం బాగా ఇచ్చాడు.

* కనల్ కణ్ణన్ ఫైట్స్ సైతం సినిమాకు మరో ఆకర్షణగా నిలిచాయి. మాస్ ప్రేక్షకులు ఈ ఫైట్స్ ను బాగా ఎంజాయ్ చేయవచ్చు.

* ప్రియన్-వెంకటేష్ అంగురాజ్‌ల సినిమా ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాల అందంగా చూపించి సక్సెస్ అయ్యారు.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ హరి విషయానికి వస్తే..15 సంవత్సరాల క్రితం హరి – విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం పట్ల అందరిలో అంచనాలు పెరిగి పోయాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడం లో హరి నిరాశ పరిచాడు.

* అవుట్ డేట్ కథ తో విసిగించే కామెడీ తో రొటీన్ గా సినిమాను నడిపించి విసుగు తెప్పించాడు. ఆకట్టుకోలేని కథ – కథనం తో సినిమాను తెరకెక్కించాడు. నాయకుడు – ప్రతినాయకుడి మధ్యన హోరా హోరి పోరు తప్పదు అనుకునే టైంలో ఆ పాత్రలను నీరుగార్చాడు. పోనీ కామెడీ అయినా బాగుందా అంటే అది లేదు. సూరి తో కామెడీ చేయించించాలని చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. ఇక కీర్తి పాత్ర కు సైతం పెద్దగా చూపించలేకపోయారు. ఓవరాల్ గా హరి సామి కి పూర్తీ న్యాయం చేయలేకపోయాడనే చెప్పాలి.

చివరిగా :

15 ఏళ్ల క్రితం వచ్చిన సామి చిత్రాన్ని అంచనా వేసుకొని థియేటర్స్ లోకి వెళ్తే నిరాశకు గురి కావడం ఖాయం. ఊర మాస్ డైలాగ్స్ , ఫుల్ యాక్షన్ సన్నివేశాలు కోరుకునే వారికీ మాత్రం ఈ సినిమా బాగానే నచ్చుతుంది. కాస్త క్లాస్ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా ఏ మాత్రం నచ్చక పోవచ్చు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review