Fish Venkat : టాలీవుడ్ హాస్య నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

Fish venkat
Fish Venkat : తెలుగు సినీ ప్రేక్షకులను తన ప్రత్యేకమైన హాస్య టైమింగ్‌తో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి (జూలై 18) తుది శ్వాస విడిచారు.

ఫిష్ వెంకట్ కిడ్నీలు పనిచేయడం మానేయడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే ఆయన ప్రాణాలను కాపాడగలదని సూచించినా, ఆయన ఆరోగ్యం ఆ దశకు చేరకముందే క్షీణించి మృతి చెందారు.

ఫిష్ వెంకట్ మొదట చిన్నపాటి పాత్రలతో తన సినీ ప్రయాణం ప్రారంభించారు. అయితే ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో చేసిన కామెడీ సీన్ ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకువచ్చింది. ఆ సినిమాలో చేపలపై చెప్పిన డైలాగ్స్ కారణంగా ఆయనకు ‘ఫిష్ వెంకట్’ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య మరియు విలన్ గ్యాంగ్ పాత్రలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తన సహజమైన డైలాగ్ డెలివరీ, సరదా కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ మృతి సినీ వర్గాలను, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. అనేక మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.