
Jailar 2 : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా రెండు సంవత్సరాల క్రితం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజినీ కెరీర్‌లోనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. సినిమాలో ప్రత్యేక క్యామియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు రిపీట్ ఆడియెన్స్‌ను కూడా రప్పించాయి.
ఇప్పుడే ఆ విజయాన్ని కొనసాగిస్తూ ‘జైలర్ 2’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సీక్వెల్‌లో కూడా స్పెషల్ క్యామియోలను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సారి టాలీవుడ్ నుంచి కూడా ఒక స్టార్ హీరో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అతి పెద్ద సర్ప్రైజ్ ఏమిటంటే – బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌ను ‘జైలర్ 2’ కోసం ఒక స్పెషల్ క్యామియో రోల్‌లో తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు షారుఖ్ నటించిన ‘రా వన్’ సినిమాలో రజినీకాంత్ తన ‘రోబో’ పాత్రలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి షారుఖ్ రజినీ సినిమాకు గెస్ట్ రోల్ చేస్తే, అది ఖచ్చితంగా సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతని మార్కెట్ ప్రభావం ‘జైలర్ 2’కు పాన్-ఇండియా స్థాయిలో మరింత హైప్ తెచ్చిపెట్టగలదు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రజినీకాంత్ మరియు షారుఖ్ ఖాన్ కలిసి తెరపై కనిపిస్తే, ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డులను మించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












