Siva Karthikeyan: అన్న ఎప్పుడూ అన్నే, తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే

Shiva karthikeyan

Siva Karthikeyan: అగ్ర నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, కోలీవుడ్‌లో “తదుపరి దళపతి ఎవరూ?” అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు శివ కార్తికేయన్ పేరు బలంగా వినిపిస్తుండగా, సోషల్ మీడియాలో కొందరు ఆయనను ‘కుట్టి దళపతి’, ‘ఫ్యూచర్ దళపతి’ అని పిలుస్తున్నారు. ఈ ఊహాగానాలపై శివ కార్తికేయన్ స్పందిస్తూ, “అన్న ఎప్పుడూ అన్నే, తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే” అంటూ విజయ్‌పై గౌరవాన్ని వ్యక్తం చేశారు. అన్న స్థానం ఎప్పటికీ వేరేనని స్పష్టం చేశారు. ‘మదరాసి’ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఆయన మాట్లాడుతూ, విజయ్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాననే ఆరోపణలను ఖండించారు. “ఏ నటుడూ మరొక నటుడి అభిమానులను గెలుచుకోవాలని అనుకోరు. నేను 15 ఏళ్లుగా పరిశ్రమలో కష్టపడి, నాకంటూ అభిమానులను సంపాదించుకున్నాను. నాకు అది చాలుతుంది” అని వివరించారు.

Also Read :  ‘‘చేతబడి” ఐదు భాషల ఆడియో రైట్స్ దక్కించుకున్న 'సరిగమ'

అలాగే తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోవద్దని సూచించారు. “సచిన్ టెండూల్కర్, ధోనీ లాంటి గొప్ప ఆటగాళ్లను కూడా విమర్శించే వారు ఉంటారు. అలాంటి వాటిపై స్పందించి సమయం వృథా చేయొద్దు” అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ కూడా పాల్గొని, శివ కార్తికేయన్ నటనను, ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘మదరాసి’ చిత్రం సెప్టెంబర్ 5న తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుంది.