
The Great Pre Wedding Show OTT : ఇటీవల చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. వర్సటైల్ నటుడు తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్ మరియు పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 ఓటీటీ సంస్థ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వడంతో, తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్ 5 నుండి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికొస్తే — ఒక చిన్న గ్రామంలో ఉండే ఫొటోగ్రాఫర్ రమేష్ చుట్టూ కథ తిరుగుతుంది. అతను ఆ గ్రామానికి చెందిన లోకల్ లీడర్ ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అయితే ఆ మెమరీ కార్డ్ పోవడంతో జరిగే గందరగోళం కథకు ప్రధాన అంశం. ఈ ఇబ్బందులను, అతను ఎదుర్కొనే పరిస్థితులను దర్శకుడు పూర్తిగా కామెడీ కోణంలో చూపిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. గ్రామీణ నేపథ్యంలో కనిపించే మనుషుల స్వభావాలు, వారి హావభావాలు, ముచ్చట్లను సహజంగా, ఆహ్లాదకరంగా చూపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.












