రివ్యూ : ఛాంపియన్ | Champion Movie Review

Champion Movie Review

Champion movie review

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5

రోషన్ మేకా హీరోగా, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఛాంపియన్’. తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామాన్ని నేపథ్యంగా తీసుకుని, 1948 నాటి చారిత్రాత్మక సంఘటనలను స్పోర్ట్స్ డ్రామాతో మేళవిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రమోషన్స్ వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుందో చూద్దాం.

కథ: సికింద్రాబాద్‌లో బేకరీలో పని చేసే మైఖేల్ (రోషన్) ఫుట్‌బాల్‌లో ఛాంపియన్‌గా నిలిచి ఇంగ్లాండ్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటాడు. కానీ అతని తండ్రి గతంలో చేసిన ఒక పని, మైఖేల్ కలలకు అడ్డంకిగా మారుతుంది. ఓ అనుకోని పరిణామంలో ఆయుధాలు ఉన్న ట్రక్కుతో కలిసి అతను తెలంగాణలోని ఉద్యమాలకు కేంద్రంగా నిలిచిన బైరాన్‌పల్లి గ్రామానికి చేరుకుంటాడు. రజాకార్ల దాడులతో అల్లకల్లోలంగా మారిన ఆ గ్రామంలో మైఖేల్ 15 రోజులు గడపాల్సి వస్తుంది. ఈ సమయంలో జరిగిన సంఘటనలు అతని ఆలోచనలను, జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాయి. ఫుట్‌బాల్ ఆటగాడిగా ప్రపంచాన్ని జయించాలని కలలు కన్న మైఖేల్, ఉద్యమకారుడిగా ఎలా మారాడు? అతని తండ్రి కథ ఏంటి? చివరకు మైఖేల్ సాధించినది ఏమిటి? అన్నదే మిగతా కథ.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

విశ్లేషణ: సినిమా ప్రారంభంలో నిజాం పాలన, రజాకార్ల దమనకాండను క్లుప్తంగా పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్తారు. మైఖేల్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ఇంగ్లాండ్ వెళ్లాలనే అతని ఆశ నుంచి బైరాన్‌పల్లి ప్రయాణం వరకు వచ్చే మార్పు ఆసక్తికరంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల నెమ్మదితనం కనిపించినప్పటికీ, రజాకార్ల దాడితో వచ్చే ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్‌పై మంచి ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని సీన్స్ స్లోగా అనిపించినా, క్లైమాక్స్ మాత్రం హై మూమెంట్స్‌తో సినిమాను ఎమోషనల్‌గా ముగిస్తుంది. మొత్తం మీద దర్శకుడు ప్రేక్షకుడిని కథ నుంచి డివియేట్ కాకుండా ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

నటీనటులు: రోషన్ మేకా మైఖేల్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్‌లో మంచి మెచ్యూరిటీ చూపించాడు. అనస్వర రాజన్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు రోషన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, మురళీ శర్మ, సంతోష్ ప్రతాప్, రచ్చ రవి, బలగం సంజయ్ సహా మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Also Read :  YouTuber Anvesh : అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు… లుకౌట్ నోటీసుల తర్వాత డిజిటల్ బ్యాన్?

సాంకేతిక విభాగం: ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం. బైరాన్‌పల్లి గ్రామం, వార్ ఎపిసోడ్స్ అన్నీ న్యాచురల్‌గా కనిపిస్తాయి. పాటలు కథకు అనుగుణంగా బాగా కుదిరాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ కొత్తగా అనిపిస్తుంది, ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. నిడివి ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

1948 నాటి తెలంగాణ చారిత్రాత్మక నేపథ్యం

రజాకార్ల దమనకాండను రియలిస్టిక్‌గా చూపిన విధానం

రోషన్ నటన, లుక్స్

ఆర్ట్ డైరెక్షన్ & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

క్లైమాక్స్ హై మూమెంట్స్

మైనస్ పాయింట్స్:

కొన్ని చోట్ల స్లో నేరేషన్

ఫస్ట్ హాఫ్‌లో ల్యాగ్ ఫీలింగ్

కథనం ఇంకాస్త షార్ప్‌గా ఉంటే మరింత ప్రభావం ఉండేది

ఫైనల్ గా : ‘ఛాంపియన్’ ఒక ఫిక్షనల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు… తెలంగాణ చరిత్రతో, స్పోర్ట్స్ డ్రామాతో మేళవించిన ఎమోషనల్ వార్ డ్రామా.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5