
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5
మాస్టర్ మహేంద్రన్ హీరోగా, యాశ్న ముత్తులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేక గీతంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణ. L S ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, దివి వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. అనిల్ ఇనుమడుగు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జనవరి 2, 2026న థియేటర్లలో విడుదలకు ముందే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ : సరస్వతిపురం అనే గ్రామంలో కఠినమైన సంప్రదాయాలు, నియమాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ గ్రామంలో తప్పు చేసిన వారికి గ్రామ పెద్దలు కఠిన శిక్షలు విధిస్తారు. అదే గ్రామానికి చెందిన టైలర్ నాగభూషణం కొడుకు నీలకంఠ (మాస్టర్ మహేంద్రన్) చదువులో మంచి ప్రతిభ కలవాడు. కానీ 10వ తరగతిలో ఒక తప్పు చేయడంతో, అతడికి 15 సంవత్సరాలు ఊరు దాటకూడదని, చదువు కొనసాగించకూడదని శిక్ష విధిస్తారు. నీలకంఠ తన చిన్ననాటి ప్రేమ సీతను (యాశ్న ముత్తులూరి) ఇష్టపడతాడు. ఆమె సర్పంచ్ కూతురు. సీత చదువుల కోసం ఊరు విడిచి వెళ్తుంది. చదువు దూరమైనా నీలకంఠ కబడ్డీ ఆటలో తన ప్రతిభను చూపుతాడు. ఊరిలో జరిగే అన్ని కబడ్డీ పోటీల్లో గెలిచినా, ఊరు దాటే అవకాశం లేక మండల స్థాయి పోటీల్లో పాల్గొనలేడు. అతడు లేని సమయంలో సరస్వతిపురం జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంటుంది. 15 సంవత్సరాల తర్వాత సీత తిరిగి ఊరికి రావడం, ఆమెకు పెళ్లి చేయాలనుకున్న సర్పంచ్ నిర్ణయం కథలో కీలక మలుపు. నీలకంఠ సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిచి సీతను పెళ్లి చేసుకుంటానని సవాల్ చేస్తాడు. ఊరి ప్రజలు అతడిని నమ్మారా? నీలకంఠ తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? సరస్వతిపురం కబడ్డీ జట్టు మండల స్థాయి పోటీల్లో ఎలా గెలిచింది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ : ఈ సినిమా ప్రధాన బలం కథా బిందువు. తప్పు చేసిన వ్యక్తిని ఊరు నుంచి వెలివేయకుండా, అతడికి ఇష్టమైన దానిని దూరం చేయడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. నాన్-లినియర్ స్క్రీన్‌ప్లే కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరో భావోద్వేగ ప్రయాణం, ప్రేమ కథ బలంగా నిలుస్తాయి. ఇంటర్వెల్ సస్పెన్స్ క్యూరియాసిటీ పెంచుతుంది. సెకండ్ హాఫ్ రేసీగా సాగుతూ యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా డిజైన్ చేశారు. గ్రామీణ కబడ్డీ సన్నివేశాలు సహజంగా, ఎనర్జీతో తెరకెక్కాయి. చివరి 30 నిమిషాల్లో కథకు మంచి పే-ఆఫ్ ఇస్తారు.
మాస్టర్ మహేంద్రన్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్, ఎమోషన్ రెండింటిలోనూ మెచ్యూరిటీ కనిపిస్తుంది. యాశ్న ముత్తులూరి సీత పాత్రలో సహజంగా నటించింది. స్నేహా ఉల్లాల్ ప్రత్యేక గీతంలో గ్రేస్‌తో ఆకట్టుకుంది. రాంకీని చాలా రోజుల తర్వాత చూడటం ఆనందంగా ఉంటుంది. మిగతా నటీనటులందరూ సహజ నటనతో గ్రామ వాతావరణాన్ని జీవంతంగా చూపించారు.
దర్శకుడు రాకేష్ మాధవన్ తన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రేక్షకులకు చేరవేశాడు. డైలాగ్స్ బలంగా ఉన్నాయి. శ్రవణ్ జి కుమార్ విజువల్స్ సినిమాకు పెద్ద ప్లస్. ఎడిటింగ్ రిఫ్రెషింగ్‌గా ఉంది. మార్క్ ప్రశాంత్ సంగీతం వింటేజ్ ఫీలింగ్ ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా హైలైట్. ప్రొడక్షన్ డిజైన్ రియలిస్టిక్‌గా ఉంది. ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు.
తుది మాట : నీలకంఠ ఒక మంచి రూరల్ కమర్షియల్ డ్రామా. బలమైన కంటెంట్, భావోద్వేగాలు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో కొత్త సంవత్సరం మొదట్లోనే ఆకట్టుకునే సినిమా ఇది. గ్రామీణ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5









