Ramchander Rao : భూముల మార్కెట్ విలువల పెంపు… సామాన్యులపై మోయలేని భారం!

Ramchander Rao
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను దూరం చేసేలా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, భూయజమానులకు న్యాయమైన లాభం చేకూరడాన్ని బీజేపీ ఎప్పుడూ స్వాగతిస్తుందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం మార్కెట్ విలువల పెంపు వెనుక ప్రజా ప్రయోజనం కంటే రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశమే కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం తన అనాలోచిత నిర్ణయాలతో మరింత సంక్షోభంలోకి నెడుతోందని అన్నారు.

ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా భూముల విలువలను 50 శాతం నుంచి 100 శాతం వరకు, కొన్ని ప్రాంతాల్లో 300 శాతానికి పైగా పెంచడం వల్ల భూమి కొనుగోలు చేయాలనుకునే సామాన్యులు, ఇల్లు నిర్మించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు భారీ రిజిస్ట్రేషన్ ఫీజుల భారం మోయాల్సి వస్తోందని రాంచందర్ రావు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం కనీస ధరను రూ.2.75 లక్షలుగా, మున్సిపాలిటీల్లో రూ.5 లక్షలుగా, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలుగా నిర్ణయించడం ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. ఇప్పటికే పాత ధరల ప్రకారం స్లాట్ బుక్ చేసుకుని చలాన్లు చెల్లించిన వారికి కూడా కొత్త ధరలనే వర్తింపజేయడం ప్రభుత్వ మొండివైఖరికి నిదర్శనమని అన్నారు.

Also Read :  KTR : పవన్ కళ్యాణ్ కు కేటీఆర్ కౌంటర్.. తెలంగాణకు అసలైన OG కేసీఆరే!

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా చార్జీలు పెంచుతూ ప్రజల నడుం విరగ్గొడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ బస్సు చార్జీలు, ఆస్తి పన్నులు, మంచినీటి చార్జీలతో పాటు ఎల్‌ఆర్‌ఎస్ పేరిట కూడా ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. పెంచిన భూముల మార్కెట్ విలువలను పునఃసమీక్షించి రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని తగ్గించాలని, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.