Fake Casting Call: షూటింగ్ మొదలవ్వగానే వెంకీ – కళ్యాణ్ రామ్ మూవీకి కొత్త చిక్కులు!

VenkyAnil5

Fake Casting Call: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందో లేదో, అప్పుడే ఈ సినిమాకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఇంతకీ ఆ చిక్కులు ఏంటో తెలుసా.. ఈ సినిమా పేరుతో సోషల్ మీడియాలో ఒక ఫేక్ కాస్టింగ్ కాల్ కలకలం రేపింది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తూ స్కామ్‌కి తెరలేపారు. ఈ విషయం కాస్తా చిత్ర నిర్మాణ సంస్థల దృష్టికి వెళ్లడంతో, వారు వెంటనే స్పందించి ప్రేక్షకులను, ఔత్సాహిక నటీనటులను అప్రమత్తం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Also Read :  Allu Arjun: నాంపల్లి కోర్టుకు రాని అల్లు అర్జున్.. విచారణ వాయిదా ఎప్పటికి అంటే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో #VenkyAnil5 – #NKRAR2 సినిమా పేరుతో సర్క్యులేట్ అవుతున్న కాస్టింగ్ కాల్ పూర్తిగా నకిలీది, అనధికారికమైనదని మేకర్స్ స్పష్టం చేశారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి ఎవరూ మోసపోవద్దని, ఆ స్కామ్‌కి బలి కావద్దని గట్టిగా విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి కాస్టింగ్ ప్రకటనలు ఉన్నా, అవి కేవలం తమ వెరిఫైడ్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మాత్రమే అధికారికంగా వెల్లడిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. “అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి” అంటూ షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు ఎక్స్ వేదికగా ఈ హెచ్చరికను జారీ చేశాయి.