
Nara Rohit: నారా కుటుంబంలో సరికొత్త వెలుగులు నిండాయి. నారా, నందమూరి కుటుంబ అభిమానులకు ఒక తీపి కబురు అందింది. ప్రముఖ టాలీవుడ్ హీరో నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. నారా రోహిత్ – శిరీష దంపతులకు బాబు పుట్టడంతో నారా వారి ఇంట పండగ వాతావరణం నెలకొంది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ వార్త తెలియడంతో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రీల్ లైఫ్ పార్ట్‌నర్స్.. రియల్ లైఫ్ కపుల్
నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ సినిమాలో శిరీష హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం , తర్వాత కాలంలో ప్రేమగా మారిందని చెబుతారు. పెద్దల అంగీకారంతో గత ఏడాది (2025) అక్టోబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం వైభవంగా జరగ్గా.. ఆ తర్వాత కొద్దిరోజులకే నవంబర్‌లో ఘనంగా వివాహం జరిగింది. ఇప్పటి వరకు భార్యాభర్తలుగా ఉన్న వాళ్లకు ఇప్పుడు తల్లిదండ్రులుగా ప్రమోషన్ రావడంతో అటు నందమూరి, ఇటు నారా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.














