అమరావతిలో ‘NBK 112’ ప్రారంభం.. క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేష్!

NBK

NBK 112: నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #NBK112 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా ఈ సినిమా ముహూర్తపు పూజా కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచాన్ చేశారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “నేను నా జీవితంలో ఇప్పటివరకు ఏ సినిమా ఓపెనింగ్‌కు రాలేదు. మొదటిసారి నన్ను ఈ వేడుకకు ఆహ్వానించిన మా ముద్దుల మావయ్య (బాలకృష్ణ) గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అమరావతిలో ఇంత పెద్ద బ్యానర్, పెద్ద నటుడితో సినిమా ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలు ఇక్కడే ప్రారంభం కావాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం” అని అన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “ఆంధ్రుల అభిమాన రాజధాని అమరావతిలో బాలకృష్ణ గారి 112వ సినిమా ప్రారంభం కావడం శుభపరిణామం అని చెప్పారు.

Also Read :  Basil Joseph: బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘మల్లు అర్జున్’ కోసం మాలీవుడ్ సెన్సేషన్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి దాదాపు 20 ఏళ్లు అయింది. మళ్లీ ఇప్పుడు అమరావతి వేదికగా ఈ వేడుక జరగడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమకు విజయవాడ ఎప్పుడూ ఒక కీలక కేంద్రం. టూరిజం రంగానికి, సినిమాకు దగ్గర సంబంధం ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసి మరిన్ని షూటింగ్స్ జరిగేలా చూడాలి. ప్రస్తుతం నా 111వ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆధ్వర్యంలో కాకినాడ పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ కొత్త సినిమా షూటింగ్ కూడా ఇక్కడ ప్రారంభం కానుంది” అని బాలయ్య వివరించారు. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. ” బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మార్క్ స్టైల్, యాక్షన్, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌కు తగ్గట్టుగా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాం” అని అన్నారు. సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.