Suriya Hombale Films : ‘హోంబాలే’ నిర్మాణంలో సూర్య.. ‘జై భీమ్’ కాంబో రిపీట్!

Suriya

Suriya Hombale Films : సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య అభిమానులకు సరికొత్త సర్‌ప్రైజ్ వచ్చేసింది. తన వైవిధ్యభరితమైన నటనతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ స్టార్ హీరో.. తాజాగా ఇండియన్ సినిమా మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌తో చేతులు కలిపారు. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్-ఇండియా ఇండస్ట్రీ హిట్లను అందించిన ‘హోంబాలే ఫిలిమ్స్’ నిర్మాణంలో సూర్య తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఒక స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

‘Suriya X Hombale’ కాంబోలో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో, ఎలాంటి అవార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి వీరి కలయికలో ఒక పవర్‌ఫుల్ సామాజిక కథాంశంతో కూడిన సినిమా రాబోతుండటంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విజయ్ కిరగందూర్, చలువే గౌడ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సూర్య సరసన టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక “మూడు దశాబ్దాలుగా వెండితెరపై నిజాయితీ గల పాత్రలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మోస్ట్ ఫియర్‌లెస్ యాక్టర్ సూర్యను మా గ్రాండెస్ట్ స్టేజ్‌పైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం” అంటూ హోంబాలే ఫిలిమ్స్ తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్‌ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.