
1 Billion views: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇండియన్ సినీ చరిత్రలో ఇంతవరకు ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని ఒక అపూర్వమైన ఆల్‌టైమ్ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘జయ జానకి నాయక’. తాజా ఈ చిత్రం ఒక అరుదైన మైలురాయిని అందుకుంది.
తెలుగులో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని హిందీలోకి ‘ఖూన్‌ఖార్’ (Khoonkhar) పేరుతో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేయగా, ఉత్తరాది ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్ వేదికగా ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మార్క్‌ను దాటి, ఈ ఘనత సాధించిన భారతదేశపు మొట్టమొదటి డబ్బింగ్ సినిమాగా అవతరించింది. బోయపాటి శ్రీను మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ నార్త్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. గతంలో 861 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో ఉన్న ‘కేజీఎఫ్ చాప్టర్-1’ రికార్డును సైతం బద్దలు కొట్టి ‘ఖూన్‌ఖార్’ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. వెండితెర ఫలితాలతో సంబంధం లేకుండా నార్త్ బెల్ట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఉన్న అసాధారణ క్రేజ్‌ను ఈ రికార్డు మరోసారి రుజువు చేసింది. ఈ సరికొత్త రికార్డుతో సోషల్ మీడియాలో ‘యూట్యూబ్ కింగ్’ బెల్లంకొండ పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.









